‘మార్పు’ కలిసొచ్చేనా? | - | Sakshi
Sakshi News home page

‘మార్పు’ కలిసొచ్చేనా?

Feb 8 2026 4:07 AM | Updated on Feb 8 2026 4:07 AM

‘మార్పు’ కలిసొచ్చేనా?

‘మార్పు’ కలిసొచ్చేనా?

● గత ఎన్నికల్లో ఆదిలాబాద్‌ పట్టణంలోని ఐదోవార్డు నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన ఆర్‌.శ్రీలత బీజేపీ అభ్యర్థిని ధోని జ్యోతిపై 473 ఓట్ల అధిక్యంతో విజయం సాధించి కౌన్సిల్‌లో తొలిసారిగా అడుగుపెట్టారు. మరోసారి ఆమెకు రిజర్వేషన్‌ అనుకూలించినా పార్టీ సీనియర్‌ కోసం ఆమె స్థానాన్ని త్యాగం చేశారు. ప్రస్తుతం ఈ వార్డులో కాకుండా ఆరోవార్డు నుంచి పోటీలో నిలిచారు. ● ఎంఐఎం అధ్యక్షుడిగా ఉన్న నజీర్‌ అహ్మద్‌ గతంలో 17వ వార్డు నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎండీ అష్రప్‌పై 146 ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు. ప్రస్తుతం జనరల్‌కు రిజర్వ్‌ అయిన ఈ వార్డులో ఆయన పోటీ చేసే అవకాశమున్నా తన సతీమణిని పోటీలో నిలిపారు. గత ఐదేళ్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ప్రాతినిధ్యం వహించిన జోగు ప్రేమేందర్‌ బరిలో ఉన్న 34వ వార్డు నుంచి నజీర్‌ అహ్మద్‌ ఎంఐఎం తరఫున పోటీ చేస్తున్నారు. ● గతంలో తొమ్మిదో వార్డు నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున ఉష్కం రఘుపతి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి వేణుగోపాల్‌పై 174 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రస్తుతం ఈ వార్డు ఎస్టీలకు రిజర్వ్‌ అయ్యింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం లేదు. దీంతో ప్రస్తుతం 40వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ● బీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు, సీనియర్‌ కౌన్సిలర్‌ అలాల్‌ అజయ్‌ గతంలో 33వ వార్డు నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఇండిపెండెంట్‌ అభ్యర్థి రాజలింగుపై 406 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ వార్డు నుంచి మూడుసార్లు విజయం సాధించిన ఆయన వార్డును తన కంచుకోటగా మార్చుకున్నారు. అయితే, ఈ సారి ఆ వార్డు బీసీలకు రిజర్వ్‌ అయ్యింది. దీంతో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఆయనకు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం జనరల్‌ మహిళకు కేటాయించిన ఐదోవార్డు నుంచి తన సతీమణి పుష్పను పోటీలో నిలిపారు. ● గతంలో ఒకటో వార్డుకు చెందిన గండ్రత్‌ రేఖ బీజేపీ తరఫున పోటీ చేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గోలి కృష్ణవేణిపై 32 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ప్రస్తుతం ఈ వార్డు ఎస్సీలకు రిజర్వ్‌ కావడంతో పోటీకి అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం జనరల్‌ స్థానమైన రెండో వార్డు నుంచి ఆమె తనయుడు గండ్రత్‌ మహేందర్‌ అదే పార్టీ తరఫున బరిలో నిలిచారు. ● మూడోవార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిషిధ ఖండేష్కర్‌ పట్టణంలోని 47వ వా ర్డు రాణీసతీజీ కాలనీలో నివసిస్తున్నారు. అయి తే, అక్కడ రిజర్వేషన్‌ అనుకూలంగా రాకపోవడంతో మరో వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. ● ఓల్డ్‌ హౌసింగ్‌ బోర్డు కాలనీలో నివాసముండే లాలా మున్నా పట్టణంలోని తన పాత వార్డు అయిన 46వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇదివరకు ఈ వార్డులో ఆయన సతీమణి మధు జైస్వాల్‌ సిట్టింగ్‌ కౌన్సిలర్‌ కావడం గమనార్హం.

పలువురికి కలిసిరాని రిజర్వేషన్లు ఇతర వార్డుల నుంచి బరిలోకి.. తాజా మాజీల మరో ప్రయత్నం ఓటర్లు వీరిపై కరుణ చూపేనా?

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల పోరు ఆసక్తి రేపుతోంది. ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్లు పలు వార్డుల్లో తారుమారయ్యాయి. దీంతో గత కౌన్సిల్‌లో ప్రాతినిధ్యం వహించిన పలువురు తాజా మాజీ కౌన్సిలర్లకు మరోసారి ఆ వార్డుల నుంచి పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. అయితే, ఎలాగైనా కౌన్సిల్‌లో తిరిగి అడుగుపెట్టాలని భావిస్తున్న సదరు ఆశావహులు ఇతర వార్డుల నుంచి బరిలోకి దిగారు. మరికొందరు రిజర్వేషన్‌ అనుకూలించినా రాజకీయపరమైన కారణాలతో తమకు అనుకూలంగా ఉన్న ఇతర వార్డుల నుంచి పోటీ చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల తరఫున నామినేషన్లు దాఖలు చేసి ప్రచారం ముమ్మరం చేశారు. ఆ వార్డుల్లోని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. స్థానికేతరులు అనే భావన అక్కడి ఓటర్లలో రానీయకుండా వారి విశ్వాసాన్ని చూరగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం నానా తంటాలు పడుతున్నారు. గెలుపే లక్ష్యంగా ఖర్చుకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఓటర్లకు తాయిలాలు ప్రకటిస్తూ తమవైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి ప్రచార గడువు ముగిసే దాకా అదే వార్డుల్లో మకాం వేసి ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వార్డుల మార్పు సదరు అభ్యర్థులకు ఏ మేరకు కలిసి వస్తోందనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. కొత్త వార్డుల్లో పోటీకి దిగిన అభ్యర్థులను అక్కడి ఓటర్లు ఏ మేరకు ఆశీర్వదిస్తారనేదానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఇంట గెలిచి ప్రజలకు సేవలందించిన వీరు.. రచ్చ గెలుస్తారా? అనేది ఈ నెల 13న వెల్లడి కానుంది.

తాజా మాజీల ‘పక్కచూపులు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement