బీ–ఫామ్‌లు ఎవరికో..
మున్సిపల్ ఎన్నికలకు పోటాపోటీ పలు వార్డులకు అధిక నామినేషన్లు తల పట్టుకుంటున్న నాయకులు అభ్యర్థుల ఎంపికకు తీవ్ర కసరత్తు బీ–ఫామ్ ఇచ్చేందుకు తర్జనభర్జన
సాక్షి, ఆదిలాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలా బాద్ పట్టణంలోని పలు వార్డుల నుంచి పోటీ చేయాలని ఆయా పార్టీల ఆశావహులు పదుల సంఖ్యలో నామినేషన్లు వేశారు. నామినేషన్ల పర్వం శుక్రవారం ముగియగా పార్టీ బీ–ఫామ్ ఎవరికివ్వాలనే విషయంలో నేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఒక్కరిని అభ్యర్థిగా ఖరారు చేసేందుకు మిగతావారిని బుజ్జగిస్తున్నారు. పదో వార్డులో గత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ఆ తర్వాత ఆ కౌన్సిలర్ పార్టీ మారారు. ఈసారి ఈ వార్డు నుంచి పదుల సంఖ్యలో ఆశావహులు బీజేపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 39వ వార్డులో కిందటి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో ఆ వార్డు నుంచి పదుల సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. ఇలా అనేక వార్డుల్లో ప్రధాన పార్టీలకు చెందిన ఆశావహులు అధికసంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి ఆయా వార్డుల్లో తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. శుక్రవారం నామినేషన్ల పర్వవ పూర్తికావడం, ఈ రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించకపోవడం, బీ–ఫామ్ ఇవ్వకపోవడంతో ఆశావహులు ఎవరికి వారే నామినేషన్లు వేశారు. ఇక పార్టీ నుంచి బీ–ఫామ్ ఒకరికివ్వాలంటే మిగతా వారిని సముదాయించాలి. వారిని బుజ్జగించి నామినేషన్ ఉపసంహరించుకునేలా చూడాలి. ఇప్పుడు ముఖ్యనేతలు ఆ ప్రయత్నాలే మొదలుపెట్టారు. కొందరు అధిష్టానాన్ని ఎదురించైనా బరిలో నిలిచేందుకు సమాయత్తమవుతున్నారు. ఇది ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపి నష్టం చేకూరుస్తుందనే అభిప్రాయం ఆయా పార్టీల్లో వ్యక్తమవుతోంది. మెజార్టీ వార్డుల్లో గెలుపొంది మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కై వసం చేసుకోవాలన్న పార్టీలను ఇప్పుడు రెబల్ బెడద బెంబేలెత్తిస్తోంది.
ఏ–ఫామ్‌ల అందజేత
అభ్యర్థిగా ఎవరినైతే ఎంపిక చేసి బీ–ఫామ్ ఇవ్వాలనుకుంటుందో సదరు ఆశావహులకు ఇచ్చేదే ఏ–ఫామ్. ఏ–ఫామ్ అందుకున్న అభ్యర్థి దాన్ని ఆయా ఎన్నికల అధికారులకు అందజేస్తారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, ఏఐఎఫ్‌బీ, జనసేన ఏ–ఫామ్‌లు అందజేశాయి. కాంగ్రెస్ నుంచి డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్‌కు, బీఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రి జోగు రామన్నకు, ఏఐఎఫ్‌బీ పార్టీ నుంచి రంగినేని పవన్‌రావుకు, జనసేన నుంచి ఆ పార్టీ నాయకుడికి ఆథరైజేషన్ బీ–ఫాం ఇచ్చే అధికారాన్ని ఆయా పార్టీలు కల్పించాయి. బీజేపీకి సంబంధించి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నుంచే ఆథరైజేషన్ ఇచ్చారు. ఆయా పార్టీలు ఏ–ఫామ్‌లను ఎన్నికల అధికారులకు అందజేశారు.
పార్టీల నుంచి పలువురు ఆశావహులు నామినేషన్లు వేయడంతో ఇప్పుడు అభ్యర్థిగా బీ–ఫామ్ ఎవరికిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. అంతగా పోటీలేని వార్డుల్లో ఈ సమస్య పెద్దగా లేకపోయినా ప్రధాన పార్టీల నేతలు అనేక వార్డుల్లో ఇప్పుడు బీ–ఫామ్ విషయంలో ఆచీతూచి ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు అనేక సర్వేలు చేసి అభ్యర్థుల ఎంపిక విషయంలో ఓ కొలిక్కి వచ్చారు. ఆ అభ్యర్థికే బీ–ఫామ్ అందజేయనుండగా, ఇక మిగతా వారిని బుజ్జగించి వారి నామినేషన్లు ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు ప్రారంభించారు.
బీ–ఫామ్‌లు ఎవరికో..
బీ–ఫామ్‌లు ఎవరికో..


