లెక్క చెప్పారు
కైలాస్‌నగర్: ఇటీవల నిర్వహించిన గ్రామపంచాయ తీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచార వ్యయ వివరాలను ఎన్నికల సంఘానికి అందజేశారు. ఇందుకు సంబంధించిన గ డువు శుక్రవారం ముగిసింది. దీంతో ఈసీ నిబంధనలకు అనుగుణంగా సర్పంచ్ అభ్యర్థులంతా తమ వివరాలను సంబంధిత ఎంపీడీవోలకు అందజేశా రు. వారు ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్ పోర్టల్ టీ ఫోల్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థుల వ్యయ వివరాలకు ఈసీ మినహాయింపునివ్వడం వారికి ఊరటనిచ్చింది.
అనర్హత వేటు తప్పించుకునేలా..
జిల్లాలో 473 గ్రామపంచాయతీలకు గాను గతేడాది డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో 53 గ్రామపంచాయతీల సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 420 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. సర్పంచ్ పదవుల కోసం 1.466 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వారు ఎన్నికల ప్రచారం కోసం చేసిన ఖర్చుల వివరాలను ఎన్నికలు జరిగిన 45రోజుల్లోపు ఈసీకి విధిగా లెక్క చెప్పాల్సి ఉంటుంది. దీంతో నామినేషన్ సమయంలో తెరిచిన బ్యాంక్ ఖాతా ఆధారంగా సదరు అభ్యర్థుల ప్రచార వ్యయ వివరాలను అందజేయాలని ఈసీ నిబంధన విధించింది. ఒకవేళ ఈ వివరాలను అందించని పక్షంలో పదవిలో ఉన్నవారు అనర్హతకు గురయ్యే అవకాశముంది. ఓటమి పాలైన అభ్యర్థులు భవిష్యత్‌లో మూడేళ్ల పాటు ఏ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండదని ఈసీ స్పష్టం చేసింది. తొలి విడత గడువు ఈ నెల 24, రెండో విడత 27, మూడో విడత గడువు 30వ తేదీతో ముగిసింది. దీంతో మూడు విడతలకు సంబంధించి శుక్రవారం తుది గడువు కావడంతో పోటీ చేసిన అభ్యర్థులంతా తమ ప్రచార వ్యయం వివరాలను అధికారులకు అందజేశారు. సంబంధిత అధికారులు ఆ వివరాలను జిల్లా ఉన్నతాఽధికారులకు అందజేయడంతో పాటు టీ పోల్‌లో నమోదు చేస్తున్నారు.
మండలం పంచాయతీలు అభ్యర్థులు
ఇచ్చోడ 33 85
గాదిగూడ 25 75
ఇంద్రవెల్లి 28 106
నార్నూర్ 23 78
సిరికొండ 19 46
ఉట్నూర్ 38 135
ఆదిలాబాద్ రూరల్ 31 98
బేల 31 103
భీంపూర్ 26 74
భోరజ్ 17 60
జైనథ్ 17 60
మావల 03 11
సాత్నాల 17 54
తాంసి 14 60
బోథ్ 21 74
సోనాల 12 38
బజార్‌హత్నూర్ 31 85
నేరడిగొండ 32 80
గుడిహత్నూర్ 26 71
తలమడుగు 29 73


