సైబర్ బాధితులకు అండగా పోలీసులు
ఆదిలాబాద్‌టౌన్: సైబర్ బాధితులకు జిల్లా పోలీసులు అండగా నిలుస్తున్నారని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 2024 మార్చిలో సైబర్‌క్రైం బారినపడి రూ.2.45 లక్షల డబ్బులు పోగొట్టుకోగా, నిందితుడి ఖాతా ఫ్రీజ్ చేసి రూ.20వేలను కోర్టు అనుమతితో చెక్కు రూపంలో మంగళవారం బాధితుడికి తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సైబర్ క్రైమ్‌కు గురైన వారు సకాలంలో ఫిర్యాదు చేస్తే మోసపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. పట్టణానికి చెందిన మహబూబ్ ఖాన్ సియాసత్ 2024 మార్చిలో తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నారని, ఆ మొబైల్ ఆధారంగా సైబర్ నిందితులు ఆయన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా గత నవంబర్ 2025 వరకు మొత్తం రూ.2.45 లక్షలు దుర్వినియోగం చేశారని తెలిపారు. సొంత అవసరాల నిమిత్తం బ్యాంకుకు వెళ్లినప్పుడు ఖాతా నుంచి డబ్బులు మాయమైన విషయం వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. బ్యాంకు అధికారుల సూచన మేరకు ఇది సైబర్ నేరమని గుర్తించి వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేశారని, దీంతో చివరగా మోసపోయిన మొత్తంలో రూ.20వేలను నిందితుడి ఖాతాలో ఫ్రీజ్ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సైబర్‌క్రైమ్ ఆర్‌ఎస్సై గోపీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.


