రంజాన్ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
కై లాస్‌నగర్: రంజాన్ వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి వివిధ శాఖల అధికారులు, మత పెద్దలతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైందని వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. మసీదుల వద్ద వీధి దీపాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని, ఈద్గాల పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణ మెరుగుపరాచాలన్నారు. తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగకుండా చూడాలని ఆదేశించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కలీమ్, డీపీవో రమేశ్, మున్సిపల్ కమిషనర్ రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మసీదుల కమిటీ సభ్యులు, మత పెద్దలు పాల్గొన్నారు.


