‘ప్రత్యేక’ పాలనకు ఏడాది
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ప్రత్యేకాధికారి పాలన అమల్లోకి వచ్చి నేటితో సరిగ్గా ఏడాది. పాలకవర్గ గడువు గతేడాది జనవరి 26న ముగిసింది. ఎన్నికల ప్రక్రియ జరగకపోవడంతో ప్రత్యేకాధికారి పాలన అనివార్యమైంది. దీంతో గ్రేడ్–1 స్థాయి కలిగిన జిల్లాలోని ఏకై క మున్సిపాలిటీకి అప్పటి ఐటీడీఏ పీవో, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తాను ప్రభుత్వం ప్రత్యేకాధికారిగా నియమించింది. అదే నెల 27న బాధ్యతలు స్వీకరించిన ఆమె సెప్టెంబర్ 18 వరకు స్పెషలాఫీసర్‌గా కొనసాగారు. ఏడు నెలల 21 రోజుల పాటు బల్దియా ప్రత్యేకాధికారిగా విధులు నిర్వహించినప్పటికీ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించకపోవడం గమనార్హం. బాధ్యతలు సైతం ఉట్నూర్‌లోనే స్వీకరించారు. అధికారులతో ఎలాంటి సమీక్షలు కూడా నిర్వహించకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే సదరు అధికారి సెలవుపై వెళ్లడంతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎస్.రాజేశ్వర్‌ను ప్రభుత్వం ప్రత్యేకాధికారిగా నియమించింది. గతేడాది సెప్టెంబర్ 19న ఆయన స్పెషలాఫీసర్‌గా బాధ్యతలు చేపట్టి విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మున్సిపల్ కార్యాలయాన్ని రెగ్యులర్‌గా సందర్శిస్తున్నారు. అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ బల్దియాపై ఇంకా పూర్తిస్థాయిలో పట్టు సాధించలేకపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగానే బల్దియా వీధి దీపాల నిర్వహణ టెండర్లలో అక్రమాలు చోటు చేసుకుని రీటెండర్ నిర్వహణ వరకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాపై పర్యవేక్షణ కొరవడి గాడి తప్పినట్లుగా పట్టణవాసులు చర్చించుకుంటున్నారు.
త్వరలోనే ఎన్నికల నగారా
మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికకు త్వరలోనే నగారా మోగనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అవసరమైన కసరత్తుపై అధికారులు దృష్టి సారించారు. ఓటర్ల జాబితా, రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణ సిబ్బంది ఎంపిక, బ్యాలెట్ బాక్స్‌లు వంటి వాటి ప్రక్రియ పూర్తి చేశారు. అలాగే స్థానికుడైన కమిషనర్ సీవీఎన్.రాజుకు స్థానచలనం కల్పించిన ప్రభుత్వం ఆయన స్థానంలో కొత్త కమిషనర్‌ను నియమించింది. ఇదిలా ఉంటే త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలోపు ప్రక్రియను సైతం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా చర్చ సాగుతోంది. ఇదే జరిగితే త్వరలోనే మున్సిపల్ నూతన పాలకవర్గం కొలువుదీరే అవకాశముంది.


