‘అట్రాసిటీ’ విచారణ వేగవంతం చేయాలి
కై లాస్‌నగర్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ వేగవంతం చేసి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చూడాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. మండలాల వారీగా నమోదైన కేసులు, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసు నమోదైన వెంటనే దర్యాప్తు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. సకాలంలో చార్జిషీట్లు దాఖలు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన నష్టపరిహారాన్ని జాప్యం లేకుండా వారి ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, కేసుల విచారణలో ఎలాంటి జాప్యం లేకుండా చూస్తున్నామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు నీలాదేవి, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునీత కుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఆర్డీవో స్రవంతి, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ నిర్వహణను జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో చేపట్టనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ రాజర్షిషా ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి పరిశీలించారు. కౌంటింగ్ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. వారి వెంట అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ పాత, కొత్త కమిషనర్లు సీవీఎన్ రాజు, జి.రాజు తదితరులు ఉన్నారు.
అభివృద్ధి పనులపై సమీక్ష..
కొరటా–చనాఖా ప్రాజెక్ట్ భూసేకరణ, రైల్వే ఆర్‌వోబీ, ఆర్‌యూబీ నిర్మాణాలపై సంబంధిత అధికా రులతో కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో కలెక్టర్ రాజర్షిషా సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఇందులో ఇరిగేషన్ ఈఈ విఠల్, ఆర్‌అండ్‌బీ ఈఈ నర్సయ్య, విద్యుత్ శాఖ ఎస్‌ఈ జాదవ్ శేష్‌రావు, సర్వే ల్యాండ్ రికార్డ్ ఏడీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
కై లాస్‌నగర్: జిల్లాలో క్షయ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో టీబీ నియంత్రణపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతేడాది జిల్లాలో 31,232 నాట్ పరీక్షలు నిర్వహించగా 1,689 పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిందన్నారు. ఇందులో 1,326 మందికి చికిత్స అందించినట్లు తెలిపారు. అలాగే పౌష్టికాహారం నిమిత్తం 7,500 ఫుడ్ బాస్కెట్లను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 13 గ్రామ పంచాయతీలను ‘టీబీ రహిత గ్రామాలు‘గా ప్రకటించామన్నారు. రెండు వారాల దగ్గు, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం వ్యాధి జయించిన పలువురిని శాలువాతో సన్మానించారు. అలాగే వ్యాధి నిర్మూలనకు కృషి చేసిన అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, సిబ్బందికి నిక్షయ్ మిత్ర ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, క్షయ నివారణ అధికారి సుమలత, డీఐవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


