వెయిట్ అండ్ సీ!
మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల తీరు చైర్‌పర్సన్ పదవీపై పలువురు ఆశలు తమ వారిని బరిలోకి నిలిపేందుకు ముఖ్యనేతల యత్నాలు
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని పాత హౌసింగ్‌బోర్డుకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి కుమారుడు తన సతీమణిని వార్డు నుంచి బరిలోకి దించుతానని, ఆమెకు చైర్‌పర్సన్ పదవీ ఇస్తామని పార్టీ ఒప్పుకుంటే మిగతా కౌన్సిలర్ల ఖర్చు మొత్తం భరిస్తామని ఓ ముఖ్య నేతను రెండు రోజుల క్రితం సంప్రదించారు. అయితే ఆ నేత నుంచి ఇప్పటివరకు సమాధానం రాలేదు. దీంతో ఆ ముఖ్యనేత మనోగతం ఎలా ఉందోననే చర్చ ఆ పార్టీలో సాగుతుంది. ఇది ఓ పార్టీకి సంబంధించిన వ్యవహారమైనప్పటికీ ఆదిలాబాద్ మున్సిపల్‌లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల నుంచి చైర్‌పర్సన్ స్థానాన్ని పలువురు ఆశిస్తున్నారు.
ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ మహిళ జనరల్ కావడంతో ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ పార్టీ పరంగా పలువురు ఈ పదవీని ఆశిస్తున్నారు. కొద్ది రోజుల కిందటి వరకు చైర్మన్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో ఉంటుందా అనే చర్చ సాగింది. దీంతో పలువురు బడాబాబులు బరిలోకి దిగుతామనే సంకేతాలు ఇచ్చారు. తీరా పరోక్ష పద్ధతిలోనే ఎన్నిక ఉంటుందని తేలిపోవడం, మరోవైపు మహిళా రిజర్వేషన్ ఖరారు కావడంతో వారంతా వెనక్కి తగ్గారు. అయినప్పటికీ ప్రధాన పార్టీలు చైర్ పర్సన్ అవకాశం ఇస్తే ఆ పార్టీకి సంబంధించి పోటీ చేసే ప్రతీ కౌన్సిలర్ ఖర్చు భరిస్తామనే ఆఫర్లతో ముఖ్య నేతలను ఆశ్రయిస్తున్నారు.
మనోగతం ఏంటో..
ఇలా పలువురు ఆ హామీ విషయంలో ముఖ్య నేతలను ఆశ్రయిస్తుండగా, వారు మాత్రం తమ మనోగతం వెల్లడించడం లేదు. వెయిట్ అండ్ సీ అనే ధోరణీలో ముందుకు సాగుతుండడంతో ఆంతర్యం ఏమై ఉంటుందా అనే చర్చా పార్టీల్లో సాగుతుంది. ప్రధానంగా బీజేపీలో ఓ ముఖ్య నేత కుటుంబ సభ్యుల్లో ఒకరిని బరిలోకి దించుతారనే ప్రచారం సాగుతుంది. దీంతోనే ఎవరైనా ఆఫర్‌తో ముందుకొస్తే ఎలాంటి హామీ ఇవ్వడం లేదని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్‌లో ఓ ముఖ్య నేత సతీమణిని బరిలోకి దించుతారనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది. అయితే ఇప్పుడే ప్రజల్లోకి ఆ విషయాన్ని వెల్లడించకుండా జాగ్రత్త వహిస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఆ విషయంలో పబ్లిక్‌గా వెళ్లాలని ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ ముఖ్య నేతలకు అతి దగ్గరగా ఉండే కొంత మంది నాయకుల వద్దే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నట్టుగా సమాచారం.
నోటిఫికేషన్‌పై ఆరా..
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఆయా పార్టీల కార్యకర్తలు ఆరా తీస్తుండటం కనిపిస్తుంది. ఇప్పటికే వార్డులు, చైర్‌పర్సన్ రిజర్వేషన్ సైతం ఖరారు కావడంతో ప్రస్తుతం ఆ అంశం చుట్టే రాజకీయ చర్చా సాగుతుంది. గతంలో బీఆర్‌ఎస్ నుంచి చైర్ పర్సన్‌గా వ్యవహరించిన ఓ నేత ఈసారి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి తన సొంత టీమ్‌తో అన్ని వార్డుల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టారు. కాంగ్రెస్, బీజేపీలో మాత్రం ముఖ్య నేతల కుటుంబ సభ్యులను తప్పనిసరి బరిలోకి దించడం ద్వారా చైర్ పర్సన్ పదవీపై ఫోకస్ పెట్టారనే ప్రచారం సాగుతుంది.


