‘సీసీఐ భూములను అమ్ముకునే ఆలోచన’
ఆదిలాబాద్‌టౌన్: కాంగ్రెస్, బీజేపీ నాయకులు జిల్లా అభివృద్ధిని విస్మరించి సీసీఐ భూములను అమ్ముకునే ఆలోచన చేస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో పార్టీ పట్టణ స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అన్ని వార్డుల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఎమ్మెల్యే శంకర్ ఎయిర్‌పోర్టు నిర్మాణం అంటూ మోసపూరిత ప్రకటనలు చేయడం ఆపి పర్మిషన్ లెటర్ చూపించాలని సవాలు విసిరిరారు. సీసీఐ భూములను అమ్ముకోవడంపై ఉన్న చిత్తశుద్ధి పట్టణ అభివృద్ధిపై లేదన్నారు. అనంతరం పలువురు పార్టీలో చేరగా వారికి ఆయన కండువాలు కప్పి స్వాగతించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు అజయ్, నాయకులు మనోహర్, ప్రహ్లాద్, సోజిదొద్దీన్, శివ తదితరులు పాల్గొన్నారు.


