ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి
ఉట్నూర్‌రూరల్/బోథ్: ఆదివాసీల సమస్యల పరి ష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన బుధవారం మండలానికి విచ్చేశారు. దంతన్‌పల్లి, కొలంగూడతో పాటు కు మ్మరితండాలో పర్యటించారు. దంతన్‌పల్లిలో లింగంపెల్లి తారమ్మ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ఆదిలాబాద్ జిల్లా అభివృద్ద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఇప్పటివరకు జిల్లాకు రూ.150 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు వెల్లడించారు. అనంతరం కొలంగూడకు చేరుకున్నారు. కుమురం సూరు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ, గిరిజనుల ఆత్మగౌరవం కోసం పాటుపడిన సూరు త్యాగాలను కొనియాడారు. గిరిజనులకు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాల సమస్యను సమగ్రంగా పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా సౌర జలగిరి వికాస పథకం ద్వారా గిరిజన భూములకు సాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించడమే లక్ష్యమని వివరించారు.
నాణ్యమైన విద్యే లక్ష్యం
మండలంలోని కుమ్మరితండాలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ట్రైకా ర్ చైర్మన్ బెల్లయ్య నాయక్ తేజవత్‌తో కలిసి బు ధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఆదివాసీ పిల్లలకు నాణ్యమైన, అంతర్జాతీయ ప్రమాణాల విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అనంతరం రూ.13కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు భూమి పూజ చేశారు. ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నగదు బదిలీ ద్వారా ఇప్పటివరకు రూ.1,21,874 కోట్లను ప్రజల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. చికుమాన్, పులిమడుగు త్రివేణి సంగమం ప్రాజెక్టుల ను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. అ నంతరం గిరిజన దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్ టాప్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ సీఎండీ వరుణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, అనిల్ జాద వ్, కలెక్టర్ రాజర్షి షా,ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. అలాగే బోథ్ మండలంలో ని పట్నాపూర్‌లో నిర్మించతలపెట్టిన విద్యుత్ సబ్‌స్టేషన్‌కు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు.
నేడు దర్బార్.. ఏర్పాట్లు పూర్తి
ఇంద్రవెల్లి: నాగోబా జాతరలో భాగంగా నేడు నిర్వహించే దర్బార్‌కు అధికారులు అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేశారు. ఆదివాసీల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రజావాణి నిర్వహణతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఆయా శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటుచేశారు. దర్బార్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు హాజరుకానున్నారు.
ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి


