పోడియంల తొలగింపు
కై లాస్‌నగర్: రిజిస్ట్రేషన్ల శాఖలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు సంస్కరణలను అమలు చేస్తోంది. రిజిస్ట్రేషన్లకు ఈ సైన్ విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఏళ్లుగా కొనసాగుతున్న రాచరిక పోకడలకు స్వస్తి పలకాలని నిర్ణయించింది. ఇందుకోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కోర్టుల తరహాలో ఉన్న పోడియం(గద్దె)లను తొలగించాలని ఆదేశించింది. ఈ మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్ర కమిషనర్ రాజీవ్‌గాంధీ హనుమంత్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. వాటికి అనుగుణంగా ఆదిలాబాద్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోని జాయింట్–1, జాయింట్– 2 సబ్‌రిజిస్ట్రార్లకు ఉన్న పోడియంను తొలగించారు. బారికేడ్ల మాదిరిగా ఉన్న వాటిని తీసివేశారు. కార్యాలయ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహించేలా సాధారణ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఆదిలాబాద్, బోథ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా బోథ్‌లో ఇటీవలే నూతన భవనం నిర్మించగా అక్కడ పోడియం వంటివి ఏర్పాటు చేయలేదు. సబ్ రిజిస్ట్రార్లు ఉద్యోగులతో కలిసి సమానంగా విధులు నిర్వహించడం ద్వారా రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలతో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడి పనులు సకాలంలో పూర్తి చేసేందుకు అవకాశముంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే అవినీతి, అక్రమాలకు సైతం అడ్డుకట్ట పడనుందనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లుగా ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.


