కార్మిక హక్కుల సాధనే ధ్యేయం
మందమర్రిరూరల్: సింగరేణి సంస్ధ పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధనే తమ ధ్యేయమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. పట్టణంలోని సీఈఆర్ క్లబ్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన సీఐటీయూ రాష్ట్ర 17వ మహాసభలకు సింగరేణి కాలరీస్ ఎంప్లాయాస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి, వేజ్‌బోర్డు మెంబర్ నరసింహా రావు తదితరులతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలతో సంస్థకు నష్టం వాటిల్లుతుందన్నారు. నాలుగు కోడ్‌లతో అన్యాయం జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా పలు తీర్మానాలు చేశారు. తెలంగాణలో కొత్త గనులు సింగరేణికే కేటాయించాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని అంతవరకు హైపవర్ కమిటీ వేతనాలతోపాటు, పెర్క్స్‌పై ఇన్‌కంటాక్స్ సంస్థనే చెల్లించాలన్నారు. అంతకుముందు యూనియన్‌లో పనిచేసి అమరులైన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో యూనియన్ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు భూపాల్, గౌరవాధ్యక్షుడు రాజారావు, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ నాగరాజ్‌గోపాల్, మందమర్రి బ్రాంచి అధ్యక్షుడు వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి రాజేందర్, నాయకులు రామస్వామి, ప్రవీణ్, ఏరియాల బాధ్యులు పాల్గొన్నారు.


