ప్రమాదాల నివారణపై ఫోకస్
ఆదిలాబాద్‌టౌన్: అతివేగం.. మద్యం మత్తు.. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో రహదారులు నెత్తురోడుతుండగా విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. బాధిత కుటుంబాల్లో విషాదం అలుముకుంటోంది. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా పోలీస్‌శాఖ జిల్లాలో ప్రమాదాల నివారణపై దృష్టి సారించింది. రవాణాశాఖ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, డీజీపీ ‘అరైవ్.. అలైవ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈనెల 1నుంచి 31వరకు జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న వాహనదారులకు పూలు ఇచ్చి అభినందిస్తున్నారు.
ప్రమాదాల నివారణకు..
సెల్‌ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి, రాంగ్‌రూట్ డ్రైవింగ్, హైవేలకు ఇరువైపులా వాహనాల పార్కింగ్, ఎడమ వైపు నుంచి ఓవర్‌టేక్ లాంటి ఉల్లంఘనలే ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు డీజీపీ శివధర్‌రెడ్డి ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాహనదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించడంతో జిల్లా వ్యాప్తంగా పోలీస్‌శాఖ రోజు కో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో గాయాలపాలైన క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడం, ప్రథమ చికిత్స అందించడం, బ్లాక్ స్పాట్లను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టడం, స్పాట్‌లోనే ప్రాథమిక చికిత్స అందించడం కోసం చేపట్టిన ‘అరైవ్–అలైవ్’ సత్ఫలితాలనిస్తోంది.
ప్రమాదాలు జరిగే ప్రాంతాలపై దృష్టి
జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి రంబుల్‌స్టిక్స్, అతివేగంగా వెళ్లకుండా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎక్కువగా భోరజ్ చెక్‌పోస్టు, గుడిహత్నూర్ మండలంలోని మేకలగండి, సీతాగోంది, నేరడిగొండ, గుడిహత్నూర్ ప్రాంతాల్లో అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. కుప్టి, బోథ్ ఎక్స్‌రోడ్, ఉట్నూర్ ఎక్స్‌రోడ్ ప్రాంతాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఆటోలు, జీపుల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకువెళ్తుండడంతోనూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా సేఫ్టీక్లబ్‌లు
రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రమాద సమయంలో క్షతగాత్రులు మృత్యువాత పడకుండా పోలీస్ శాఖ చర్యలు చేపడుతోంది. జిల్లా వ్యాప్తంగా వెయ్యి ప్రాంతాల్లో పోలీసులు రోడ్ సేఫ్టీ క్లబ్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కో క్లబ్‌లో ఐదుగురిని నియమించారు. ఐఎంఏ ద్వారా ఈ క్లబ్‌లకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందజేశారు. జాతీయ రహదారి, ఇతర రహదారులను ఆనుకుని ఉన్న గ్రామాల్లోని యువకులకు సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చారు. ప్రమాదాలు జరిగినప్పుడు 108, డయల్ 100, అంబులెన్స్‌కు సమాచారం అందించడం, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆటో, జీపు డ్రైవర్లకు పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లకుండా, రాంగ్‌రూట్‌లో ప్రయాణించకుండా, ట్రా ఫిక్ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్లకు డిఫెన్స్ డ్రైవింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. మైనర్లు వాహనాలు నడపకుండా స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. రెండోసారి మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఐదు మండలాల్లో డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహించారు. జిల్లాలోని సిరికొండ, బజార్‌హత్నూర్, భీంపూర్, నార్నూర్, గాదిగూడ మండలాలకు చెందిన 350 మందికి డ్రైవింగ్ లైసెన్స్‌లు, 50 మందికి పర్మినెంట్ లైసెన్స్‌లు ఇప్పించేలా ఎస్పీ చొరవ చూపారు. భోరజ్ నుంచి బేల వైపు రోడ్డు సరిగా లేక హాట్‌స్పాట్లను గుర్తించి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా సైన్ బోర్డులు, హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేశారు.
జిల్లాలో ప్రమాదాలు, మృతుల వివరాలు
సంవత్సరం ప్రమాదాలు మృతులు
2021 245 145
2022 234 137
2023 286 126
2024 349 127
2025 381 117
ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. రోడ్డుసేఫ్టీ క్లబ్‌లు ఏర్పాటు చేశాం. వాహనదారులకు నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాం. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి భద్రత చర్యలు చేపడుతున్నాం. వాహనదారులు హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు. సేల్‌ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడుపవద్దు. – అఖిల్ మహాజన్, ఎస్పీ


