రేపే సీఎం రాక
సాక్షి,ఆదిలాబాద్: సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. కొరటా–చనాఖా బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు బ్యారేజ్‌కు సమీపంలో ఉన్న పంప్‌హౌస్ వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి ఆ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్‌లో బయల్దేరుతారు. నేరుగా భోరజ్ మండలం హత్తిఘాట్ వద్దకు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.
దిగువ పెన్‌గంగపై నిర్మాణం..
దిగువ పెన్‌గంగపై తెలంగాణ(కొరటా) – మహారాష్ట్ర(చనాఖా) సరిహద్దున దీనిని నిర్మించారు. ఇక్కడి నుంచి 0.81 టీఎంసీ నీళ్లు ఎత్తిపోసే విధంగా బ్యారేజ్ నిర్మాణం చేపట్టారు. సమీపంలోని హత్తిఘాట్ గ్రామం వద్ద పంప్‌హౌస్ నిర్మించారు. ఈ పంప్‌హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయగా, పారేందుకు లోయర్ పెన్‌గంగ మెయిన్ కాలువ 42 కిలోమీటర్ల పరిధిలో నిర్మించడం జరిగింది. ఈ కాలువల ద్వారా నీరు జైనథ్, భోరజ్, బేల మండలాల్లోని ఆయకట్టుకు పారుతాయి. మెయిన్ కెనాల్ పనులు పూర్తయినప్పటికీ చేల వరకు నీళ్లు చేరేందుకు డిస్ట్రిబ్యూటరీ వర్క్ ఇంకా జరగాల్సి ఉంది. సీఎం పంప్‌హౌస్ నుంచి నీటిని విడుదల చేయనున్నారు.
ఏర్పాట్లు పూర్తి..
హత్తిఘాట్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి సీఎం హెలిక్యాప్టర్‌లో నేరుగా ఇక్కడికే చేరుకుంటారు. పంప్‌హౌస్ వరకు వెళ్లేందుకు ప్రత్యేక రోడ్డు నిర్మాణం చేశారు. స్థలాభావం, భద్రత కారణాల దృష్ట్యా కేవలం పాస్ ఉన్నవారికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ హత్తిఘాట్‌ను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
రేపే సీఎం రాక


