భక్తులకు ఎలాంటి లోటు రానివ్వొద్దు
ఇంద్రవెల్లి: ఈ నెల 18నుంచి 25వరకు నిర్వహించనున్న నాగోబా జాతరలో మెస్రం వంశీయులు, భ క్తులకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఎస్పీ అఖిల్ మహాజన్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. మంగళవారం మండలంలోని కేస్లాపూర్ నాగోబా దర్బార్ హాల్‌లో నిర్వహించిన జాతర నిర్వహణ రెండో స మీక్షకు హాజరై మాట్లాడారు. భక్తులకు సరిపడా ఆర్టీ సీ బస్సులు నడపాలని, జాతరలో వివిధ శాఖల అ ధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ నెల 22న నిర్వహించే దర్బార్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 80శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పనులు త్వరగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జాతర ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిరంతరం 350 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం జాతర వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్, నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్, సర్పంచ్ మెస్రం తుకారాం, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.


