breaking news
Toxic water
-
నదిలో నీళ్లు చల్లుతున్నారు.. కొత్త టెక్నిక్ కాదు.. మరేంటి!
న్యూఢిల్లీ: యమునా నదిలో కాలుష్యంపై నెటిజనులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాలుష్యం పెరిగిపోవడంతో యమునా నది విషపూరిత నురుగులతో నిండిపోయింది. ఇందులో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. నీటిపై తేలియాడుతూ తెరతెరలుగా తరలివస్తున్న విషపూరిత నురుగును తొలగించడానికి ఢిల్లీ వాటర్ బోర్డు అధికారులు చేపట్టిన తాత్కాలిక చర్యలు అపహాస్యానికి గురయ్యారు. కాళింది కుంజ్ వద్ద నురగను అడ్డుకోవడానికి 15 పడవలను రంగంలోకి దించారు. వెదురు తడికలు అడ్డుకట్టి నురగను ఆపడానికి ప్రయత్నించారు. నదిలో పేరుకుపోయిన విషపు నురగను తొలగించడానికి పైపు ద్వారా నీటిని వెదచల్లారు. (చదవండి: సినిమా సెట్టింగో.. స్పెషల్ ఎఫెక్టో అనుకుంటున్నారా..!) ఈ చర్యలపై ట్విటర్లో నెటిజనులు తమదైన శైలిలో స్పందించారు. ‘ఇదేదో కొత్త టెక్నిక్‌లా ఉందే.. మాకూ చెబితే ఊరి చెరువులను శుభ్రం చేసుకుంటామంటూ’ సెటైర్లు పేల్చారు. ‘వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి భారతీయుడు తమ టేబుల్ ఫ్యాన్లను తెరిచిన కిటికీల వైపు చూపించాలని ప్రభుత్వం ఆదేశించింది’ అంటూ మరొకరు చురక అంటించారు. ‘RIP Science’ అంటూ ఇంకొరు సానుభూతి ప్రకటించారు. యమునా నదిలో కాలుష్య నివారణకు శాశ్వత చర్యలు చేపట్టకుండా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న పాలకులు, అధికారులపై వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి కాలుష్యాన్ని తగ్గించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని హస్తిన వాసులు డిమాండ్ చేస్తున్నారు. -
ఈ ఫొటో చూసి భ్రమ పడొద్దు.. ప్లీజ్!
న్యూఢిల్లీ : ఛత్ పూజ అనగానే గుర్తొచ్చేది ఉత్తర భారతీయులు. వేకువ జామునే నది వద్దకు చేరుకుని.. సూర్యుడు ఉదయించే వరకు పూజలు చేసి.. సూర్యదేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. ఇటీవల ఛత్ పూజలో భాగంగా యమునా నది తీరంలో మహిళలు పెద్ద ఎత్తున సూర్యదేవునికి పూజలు చేశారు. అయితే ఢిల్లీ సమీపంలో కలిండి కుంజ్ ప్రాంతంలో కనిపించిన కొన్ని దృశ్యాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. యమునా నదిలో విషపు రసాయనాలతో కూడిన నురగ మధ్యలోనే కొందరు మహిళలు పూజలు నిర్వహించారు. విషపు నురగ తమ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందనే అవగాహన లేక చాలా మంది అందులో దిగి తమ భక్తిని చాటుకున్నారు. మరికొంత మంది ఏది ఏమైనా పూజ చేసి తీరాలని విషపు నురగను సైతం లెక్కచేయకుండా తమ పని కానిచ్చారు. అయితే అలాంటి పరిస్థితుల్లో మహిళలు పూజలు నిర్వహిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ ఫొటోలు చూసిన వారు మహిళలు తెల్లని మబ్బుల మధ్య నిల్చోని పూజ చేస్తున్నారమోనని భ్రమపడుతున్నారు. కానీ.. వారు కాలుష్యపు కోరల మధ్య సూర్యదేవుడికి పూజ చేస్తున్నారు. మరోవైపు, ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయి చేరుకున్న సంగతి తెలిసిందే. అక్కడి ప్రజలు గాలి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దేశంలో కాలుష్యం ఏ స్థాయిలో పెరుగుతుందో చెప్పడానికి ఈ ఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. -
నదుల్లో గరళం
సాక్షి, హైదరాబాద్ : చుక్క చుక్క ఒడిసిపట్టి దాచుకోవాల్సిన క్షణాలు రానే వచ్చాయి. నీటి సంరక్షణ కోసం మనం గత కొన్నేళ్లుగా తీసుకుంటున్న చర్యలు సరిపోవని నిర్ధారణ అయిపోయింది.మన కళ్ల ముందే కేప్‌టౌన్ మహానగరానికి వచ్చిన దుస్థితే భారత్‌లో ఎన్నో నగరాలకు పట్టబోతోందని వరల్డ్ వాటర్ డే సందర్భంగా వచ్చిన పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. అంతేకాదు నదీ కాలుష్యం అనే భూతం మనకు పెను సవాల్ విసురుతోంది. దేశంలోని సగం నదుల్లో నీరు ఇప్పటికే విష తుల్యంగా మారింది. అయిదేళ్ల క్రితం 121 నదుల్లో నీరు కలుషితంగా మారితే ఇప్పుడు వాటి సంఖ్య 275కి చేరుకుంది. పారిశ్రామిక వ్యర్థాలు, రసాయన వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, క్రిమిసంహారక అవశేషాలు వంటివి స్వచ్ఛమైన జలాల్ని కాలుష్యమయం చేస్తున్నాయి. నీటిలో ఆక్సిజన్ శాతం బాగా తగ్గిపోతోంది. దక్షిణ భారతంలో గోదావరి, కృష్ణా, కావేరి నదులు ఎండిపోవడమే కాదు ఉన్న ఆ కాస్త నీరు కాలుష్యంగా మారడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఈ ఎండాకాలం గట్టేక్కేదెలా అన్న ఆందోళనలు అప్పుడే మొదలయ్యాయి. ఇక బహిరంగ మల విసర్జన కారణంగా భారత్‌లో భూగర్భజలాలు కూడా కలుషితంగా మారిపోవడం ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ‘ఇంకా ఏప్రిల్ నెల కూడా రాలేదు. అప్పుడే కృష్ణమ్మ ఎండిపోయింది. శ్రీశైలం డ్యామ్‌లు నీటిచుక్క కనిపించడం లేదు. మెట్టూరు డ్యామ్ దగ్గర కావేరి పాక్షికంగా ఎండిపోయింది. రాజమండ్రిలో గోదావరి నది పరిస్థితి కూడా అదే. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సారి నీటికి కట కట తప్పదు‘ అని ఏపీకి చెందిన నీటి సంరక్షణ కార్యకర్త బొలిశెట్టి సత్యనారాయణ చెప్పారు. నీటి కటకటని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ఏపీ రైతులకు నీటి వినియోగం ఎక్కువగా ఉండే వరి, చెరుకుపంటలు పండించవద్దన్న సూచనలు వెళ్లాయి. నదులు విషంగా మారిన రాష్ట్రాలు మహారాష్ట్ర – 49 నదులు అసోం–28 నదులు, మధ్యప్రదేశ్–21 నదులు, గుజరాత్–20నదులు, పశ్చిమబెంగాల్–17 నదులు భూగర్భ జలాలు విషతుల్యంగా మారిన రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, ఢిల్లీ నీరు దొరక్క కరువులో చిక్కుకున్న రాష్టాలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సురక్షిత మంచి నీరు లేక విలవిలలాడుతున్న రాష్ట్రాలు రాజస్థాన్, పశ్చిమబెంగాల్, బీహార్, పంజాబ్ మనకు లభించే నీటిలో 2 శాతం మాత్రమే స్వచ్ఛమైనది.. గ్రామీణ భారతంలో 4శాతం మంది ప్రజలు గత్యంతరం లేక కలుషిత నీరుని తాగుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రకృతి సంబంధమైన పరిష్కారాలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందని నిపుణులు చెబుతున్నారు. నదీతీరం వెంబడి అడవులు పెంచడం, భూమిలోకి వర్షపు నీరు ఇంకేలా చర్యలు చేపట్టడం, కృత్రిమంగా చిత్తడి నేలల్ని పెంచడం వంటివి చేయడం ద్వారా నీటిసమస్యను కొంతైనా పరిష్కరించుకోవచ్చునని అంటున్నారు. నీరు ఎలా తాగాలో మీకు తెలుసా ! మన శరీరంలో 75 శాతం నీరే ఉంటుంది. శరీరభాగాలు అన్నీ సక్రమంగా పని చేయడానికి నీరు అత్యంత అవసరం. అలాంటి నీటిని సరైన విధంగా తాగడానికి కొన్ని సూచనలు. చాలా మంది ఎత్తిన గ్లాసు దించకుండా ఒకే గుటకలో నీరు తాగేస్తారు. మరికొందరు సీసాల ద్వారా నీటిని నేరుగా గొంతులోనే పోసుకుంటారు. అలా తాగకుండా.. నోట్లో నీళ్లని పోసుకొని కాసేపు ఉంచుకొని, నెమ్మదిగా మింగాలి. అప్పుడే నోట్లో లాలాజలం ఆహారనాళం ద్వారా కడుపులోని వెళ్లి యాసిడ్స్ లెవల్స్‌ని సమం చేస్తుంది. నిరంతరం మనం మంచినీళ్లను తాగుతూనే ఉండాలి. అప్పుడే ఆకలికి, దాహానికి మధ్య తేడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. అలా నీళ్లు తాగకపోతే దాహం వేసినా, ఆకలివేస్తునట్టుగా తప్పుడు సంకేతాలు అందుతాయి. మితిమీరి తినడాన్ని అరికట్టాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. భోజనానికి ముందు, భోజనం చేస్తున్న సమయంలోనూ నీటిని అతిగా తాగడం మంచిది కాదు. అన్నం తినేటప్పుడు నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయడానికి దోహదపడే ద్రవాలపై ప్రభావం పడుతుంది. దాని వల్ల జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. వ్యాయామానికి ముందు, తర్వాత తప్పనిసరిగా మంచినీళ్లు తాగాలి. అప్పుడే వ్యాయామం సమయంలో కండరాలు పట్టేయడం, తిమ్మిర్లు ఎక్కడం వంటివి జరగవు. వ్యాయామం సమయంలో చెమట రూపంలో మన శరీరం నుంచి నీరు అధికంగా వెళ్లిపోతుంది. అందుకే తప్పనిసరిగా నీరు తాగాలి. పరగడుపునే గోరువెచ్చని నీటిని తాగాలి.. వెచ్చని నీరు తాగడం వల్ల కండరాల కదలిక సులభంగా ఉంటుంది. ఎక్కువ వేడిగా, మరీ ఎక్కువ చల్లగా ఉన్న నీటిని ఎప్పుడూ తాగకూడదు. రూమ్ టెంపరేచర్లో ఉన్న నీటినే తాగాలి. అప్పుడే శరీర భాగాలన్నీ సక్రమంగా పనిచేస్తాయి. లేదంటే ఒత్తిడికి లోనవుతాయి. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
విషపు నీరు తాగి 12 గొర్రెలు మృతి
మిర్యాలగూడ రూరల్ (నల్లగొండ) : పొలంలో విష గుళికలు కలిసిన నీరు తాగి 12 గొర్రెలు మృత్యువాతపడగా మరో 70 జీవాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం నందిపాడు శివారు నందిగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగుల రామలింగయ్య తన జీవాలను తోలుకుని శుక్రవారం పొలాల వైపు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో సమీపంలోని వరి పొలంలో నీరు తాగిన గొర్రెల్లో 12 కొద్దిసేపట్లోనే చనిపోయాయి. మరో 70 వరకు తీవ్ర అస్వస్థతకు గురి కావటంతో పశువైద్యులను పిలిపించి, వైద్యం చేయిస్తున్నారు. చనిపోయిన జీవాల విలువ రూ.లక్ష ఉంటుందని బాధితుడు తెలిపాడు.