breaking news
tbi
-
గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.21.40 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా సెర్ప్ ఆధ్వర్యంలో బిట్స్‌పిలానీ, టీ–హబ్ హైదరాబాద్‌ను ‘హైదరాబాద్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్’(టీబీఐ)లుగా నామినేట్‌చేశారు. రాష్ట్రస్థాయి ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ మే 29న ప్రారంభం కాగా తెలంగాణలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక చేయూతనివ్వడంతోపాటు, సూక్ష్మ వ్యాపారాలను పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు దోహదపడనుంది. మహిళలు కేవలం సంక్షేమపథకాల లబ్ధిదారులుగా కాకుండా పరిశ్రమలను స్థాపించే స్థాయికి ఎదిగేందుకు ఈ కార్యక్రమాలు చేయూత ఇవ్వనున్నాయి. ఒక్కో ఇంక్యుబేటర్‌కు రూ.10.70 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు. రూ. 21.40 కోట్ల వ్యయంతో మహిళా పారిశ్రామికవేత్తలకు మార్కెటింగ్, బ్రాండింగ్, సున్నా–వడ్డీ రుణాలు, సలహాలు అందిస్తారు. లాభదాయక వ్యాపారాలు చేస్తున్న 300 మంది గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఒక్కో ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ కింద 150 మంది వ్యాపారాలకు (రెండు కలిపి 300) మూడేళ్లపాటు సహకారాన్ని అందిస్తారు. 18 మంది చొప్పున (36 మందికి) గ్రాంట్, మిగిలిన వారికి సున్నాశాతం వడ్డీతో సాఫ్ట్‌లోన్లు ఇస్తారు.రాష్ట్రస్థాయిలో మొదలైన ఈ ప్రోగ్రామ్‌ను జిల్లా, మండల, గ్రామస్థాయి వరకు తీసుకెళ్లనున్నారు. ఫీల్డ్ కేడర్ ద్వారా ఔత్యాహిక పారిశ్రామికవేత్తల గుర్తింపు, అప్లికేషన్ సపోర్ట్, ఎస్‌హెచ్‌జీలు, విలేజీ ఆర్గనైజర్స్, మండల సమాఖ్య వేదికల ద్వారా మొబిలైజేషన్ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నెల 20 నుంచి జిల్లాస్థాయిల్లో ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్స్ ప్రారంభించి, 30వ తేదీ కల్లా పూర్తిచేయనున్నారు. వీటిని ‘జిల్లా స్థాయి ఇంక్యుబేటర్ లాంచ్ ఈవెంట్’గా నిర్వహించాలని జిల్లా అధికారులను పంచాయతీరాజ్‌శాఖ ఆదేశించింది. జిల్లాల వారీగా చూస్తే... టీ హబ్‌కు ఆదిలాబాద్, భద్రాద్రి, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్‌నగర్, మెదక్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి... బిట్స్‌పిలానీ–హైదరాబాద్‌కు హనుమకొండ, జగిత్యాల, జోగులాంబ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నారాయణపేట, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాలు కేటాయించారు. -
దళిత పారిశ్రామికవేత్తల నుంచి మరిన్ని కొనుగోళ్ళు!
♦ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో మార్పులు ♦ యూఏఎం వద్ద ఎంఎస్ఎంఈల నమోదు తప్పనిసరి ♦ తెలంగాణలో టీబీఐ, ఎల్బీఐ సెంటర్ల ఏర్పాటుకు ఓకే ♦ ‘స్టార్టప్’ సదస్సులో కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా హైదరాబాద్, బిజినెస్ బ్యూర : ‘‘ప్రస్తుత ప్రభుత్వ కొనుగోళ్ల విధానం ప్రకారం... కేంద్ర ప్రభుత్వం లేదా విభాగాలు తమ అవసరాల కోసం చేసే కొనుగోళ్లలో ఏడాదికి కనీసం 20 శాతం కొనుగోళ్లు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నుంచి... 4 శాతం ఎస్సీ/ఎస్టీలకు చెందిన సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల నుంచి ఉండాలి. కానీ ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు మేలు జరిగేలా ఈ పాలసీలో మరిన్ని మార్పులు చేస్తున్నాం’’ అని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్రాజ్ మిశ్రా చెప్పారు. ఇక నుంచి మరో 4 శాతం కొనుగోళ్లను ఎస్సీ/ఎస్టీ మహిళలకు చెందిన సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల నుంచి చేయాలని నిబంధన పెడతామన్నారు. లేనిపక్షంలో ఆయా కంపెనీలో ఎస్సీ/ఎస్టీ మహిళలకు కనీసం 50 శాతం వాటా అయినా ఉండాలన్నారు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ఆధ్వర్యంలో సోమవారమిక్కడ 19వ ‘‘గ్లోబల్ స్టార్టప్ వర్క్‌షాప్’’ను మంత్రి ప్రారంభించారు. మూడురోజుల పాటు జరిగే ఈ వర్క్‌షాప్‌లో తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్‌తో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిశ్రా ఏమన్నారంటే... ♦ ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించి, వ్యాపారావకాశాలు కల్పించేం దుకు ఉద్యోగ్ ఆధార్ (యూఏఎం) పాలసీని తీసుకొచ్చాం. దీని ప్రకారం దేశంలోని అన్ని ఎంఎస్ఎంఈలు తమ పేర్లను యూఏఎం వద్ద తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. దీంతో ఎంఎస్ఎంఈలు వివిధ పథకాలకు అర్హత పొందుతాయి. ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు ఎలాంటి సపోర్టింగ్ డాకుమెంట్స్, ఫీజు అవసరం లేదు. స్వీయ డిక్లరేషన్‌ను ఇస్తే చాలు. ♦ కొన్నేళ్లుగా ఎంఎస్ఎంఈ రంగం ఏటా 10 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. జీడీపీలో 37.5 శాతం వాటా ఈ రంగానిదే. ♦ ఎంఎస్ఎంఈల్లో తయారీ రంగం వాటా 45 శాతం, ఎగుమతుల వాటా 44 శాతం. ఈ రంగంపై 8 కోట్ల మంది ఆధారపడి ఉన్నారు. వీరిలో 3.6 కోట్ల మంది పారిశ్రామికవేత్తలే. ♦ 2014 నుంచి ఇప్పటి వరకు 1,12,883 ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్‌లకు అనుమతులిచ్చాం. వీటి ద్వారా 8.71 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలొచ్చాయి. ♦ వ్యవసాయాధారిత ఎంఎస్ఎంఈ, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు పథకం తెచ్చాం. సిడ్బీ సహకారంతో ఈ పథకం కింద టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్స్ (టీబీఐ), లైవ్లీహుడ్ బిజినెస్ ఇంక్యుబేటర్స్ (ఎల్బీఐ) ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొస్తే ఆయా రాష్ట్రాల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తాం. ఇందులో భాగంగానే తెలంగాణలోనూ టీబీఐ, ఎల్బీఐ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం.


