breaking news
Second victory
-
వహ్వా హారిస్...
ముంబై: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ముందుగా చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసిన జట్టు... ఆ తర్వాత మెరుపు బ్యాటింగ్‌తో మరో 47 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన ఈ పోరులో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూపీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. దీప్తి శర్మ (35 బంతుల్లో 45 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), డియాండ్రా డాటిన్ (37 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 72 బంతుల్లో అభేద్యంగా 93 పరుగులు జోడించారు. అనంతరం బెంగళూరు 12.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 145 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్రేస్ హారిస్ (40 బంతుల్లో 85; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా...కెప్టెన్ స్మృతి మంధాన (32 బంతుల్లో 47 నాటౌట్; 9 ఫోర్లు) రాణించింది. వీరిద్దరు తొలి వికెట్‌కు 71 బంతుల్లోనే 137 పరుగులు జోడించి జట్టు విజయాన్ని సులువు చేశారు. యూపీ జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి. నేడు జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో గుజరాత్ జెయింట్స్ తలపడుతుంది. రాత్రి గం. 7:30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. కీలక భాగస్వామ్యం... యూపీకి ఓపెనర్లు మెగ్ లానింగ్ (14), హర్లీన్ డియోల్ (11) శుభారంభం అందించలేకపోయారు. పరుగులు చేయలేకపోవడంతో పాటు వీరిద్దరు నెమ్మదిగా ఆడి బంతులను కూడా వృథా చేశారు. ఆ తర్వాత బరిలోకి దిగిన బ్యాటర్లూ కూడా పూర్తిగా తడబడ్డారు. దాంతో ఒకే స్కోరు వద్ద జట్టు 3 వికెట్లు కోల్పోయింది. లిచ్‌ఫీల్డ్ (11 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్), కిరణ్ నవ్‌గిరే (5), శ్వేత సెహ్రావత్ (0)లను ఆర్సీబీ బౌలర్లు వెనక్కి పంపించారు. ఫలితంగా 50/5తో యూపీ కష్టాల్లో పడింది. ఈ దశలో దీప్తి, డాటిన్ కలిసి జట్టును ఆదుకున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి జట్టు స్కోరు 56 పరుగులకు చేరింది. తర్వాతి పది ఓవర్లలో మరో వికెట్ కోల్పోకుండా దీప్తి, డాటిన్ పరుగులు జోడించారు. శ్రేయాంక ఓవర్లో డాటిన్ వరుసగా 4, 6 కొట్టగా, డిక్లెర్క్ బౌలింగ్‌లో దీప్తి భారీ సిక్స్ బాదింది. శ్రేయాంక వేసిన ఆఖరి ఓవర్లోనూ వీరిద్దరు మూడు ఫోర్లు కొట్టడంతో మొత్తం 15 పరుగులు వచ్చాయి. ఓపెనర్ల దూకుడు... ఛేదనలో ఆర్సీబీ అలవోకగా దూసుకుపోయింది. దీప్తి వేసిన తొలి ఓవర్లోనే హారిస్ రెండు ఫోర్లు కొట్టగా, శిఖా ఓవర్లో స్మృతి రెండు ఫోర్లు సాధించింది. ఆ తర్వాత క్రాంతి ఓవర్లో వీరిద్దరు 3 ఫోర్లతో 13 పరుగులు రాబట్టారు. ఈ దశలో డాటిన్ ఓవర్‌తో మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ వైపు మళ్లింది. శోభన ఓవర్లోనూ హారిస్ వరుసగా 6, 4 బాదింది. 10 ఓవర్లలోనే 121 పరుగులు సాధించిన బెంగళూరుకు ఆటను ముగించేందుకు మరో 13 బంతులు సరిపోయాయి. స్కోరు వివరాలు యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: లానింగ్ (సి) రాధ (బి) శ్రేయాంక 14; హర్లీన్ (సి) స్మృతి (బి) బెల్ 11; లిచ్‌ఫీల్డ్ (సి) స్మృతి (బి) శ్రేయాంక 20; కిరణ్ (సి) స్మిత్ (బి) డిక్లెర్క్ 5; దీప్తి (నాటౌట్) 45; శ్వేత (సి) అరుంధతి (బి) డిక్లెర్క్ 0; డాటిన్ (నాటౌట్) 40; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–21, 2–39, 3–50, 4–50, 5–50. బౌలింగ్: లారెన్ బెల్ 4–0–16–1, లిన్సీ స్మిత్ 4–0–30–0, శ్రేయాంక పాటిల్ 4–0–50–2, అరుంధతి రెడ్డి 4–0–18–0, నదైన్ డిక్లెర్క్ 4–0–28–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గ్రేస్ హారిస్ (సి) లానింగ్ (బి) శిఖా 85; స్మృతి (నాటౌట్) 47; రిచా (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (12.1 ఓవర్లలో వికెట్ నష్టానికి) 145. వికెట్ల పతనం: 1–137. బౌలింగ్: దీప్తి శర్మ 3.1–0–25–0, క్రాంతి గౌడ్ 2–0–18–0, శిఖా పాండే 3–0–28–1, డియాండ్రా డాటిన్ 1–0–32–0, సోఫీ ఎకెల్‌స్టోన్ 2–0–20–0, శోభన 1–0–17–0. డాటిన్ ఓవర్లో 32 పరుగులు! యూపీ బౌలర్ డియాండ్రా డాటిన్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఆర్సీబీ ఓపెనర్ గ్రేస్ హారిస్ మెరుపులా చెలరేగిపోయింది. ఈ ఓవర్లో ఆమె వరుసగా 4, 6, 4, 6, 6 బాదింది. వీటిలో తొలి బంతి నోబాల్ కూడా కావడంతో స్కోరు బోర్డులో అదనపు పరుగు చేరింది. అనంతం డాటిన్ వైడ్ కూడా వేసి మరో పరుగు ఇచి్చంది. తర్వాతి బంతిని హారిస్ మళ్లీ బౌండరీకి తరలించింది. ఎట్టకేలకు చివరి బంతికి పరుగు రాకుండా నిరోధించడంతో డాటిన్ సఫలమైంది. మొత్తంగా హారిస్ 30 పరుగులు కొట్టగా, అదనపు పరుగులు కలిపి ఓవర్లో 32 పరుగులు లభించాయి. ఈ క్రమంలో 22 బంతుల్లోనే హారిస్ అర్ధ సెంచరీ పూర్తయింది. -
దబంగ్ ఢిల్లీ రెండో గెలుపు
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో దబంగ్ ఢిల్లీ రెండో విజయం సాధించింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన డిఫెన్స్‌తో అదరగొట్టిన దబంగ్ ఢిల్లీ 39–30తో బెంగాల్ వారియర్స్‌పై గెలుపొందింది. దబంగ్ ఢిల్లీ తరఫున నవీన్ కుమార్ 11, చంద్రన్ రంజిత్ 7 రైడ్ పాయింట్లు సాధించారు. ట్యా క్లింగ్లో రవీందర్ పహల్ (4 పాయిం ట్లు) ఆకట్టుకున్నాడు. బెంగాల్ వారియర్స్ తరఫున జాంగ్ కున్ లీ 10, మణిందర్ సింగ్ 6, మహేశ్ గౌడ్ 5 రైడ్ పాయింట్లు సాధించారు ట్యాక్లింగ్‌లో సుర్జిత్ సింగ్ (2 పాయింట్లు) ఫర్వాలేదనిపించాడు. మరో మ్యాచ్‌లో పుణేరీ పల్టన్ 27–25తో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో తెలుగు టైటాన్స్; తమిళ్ తలైవాస్‌తో పుణేరి పల్టన్ తలపడతాయి. -
హైదరాబాద్ హంటర్స్‌కు రెండో విజయం
బెంగళూరు బ్లాస్టర్స్‌పై 4–3తో గెలుపు బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–2)లో హైదరాబాద్ హంటర్స్ జోరు పెంచింది. శనివారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో హంటర్స్ 4–3తో బెంగళూరు బ్లాస్టర్స్ జట్టుపై గెలిచింది. ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌లాడిన హైదరాబాద్‌కు ఇది రెండో విజయం. పురుషుల సింగిల్స్ తొలిమ్యాచ్‌లో సమీర్ వర్మ (హైదరాబాద్) 11–7, 11–8తో బూన్సక్ పొన్సానా (బెంగళూరు)పై గెలిచి హంటర్స్‌కు శుభారంభాన్నిచ్చాడు. అయితే మిక్స్డ్ డబుల్స్‌లో కరోలినా మారిన్–సాత్విక్ సాయిరాజ్ (హైదరాబాద్) జోడీ 9–11, 7–11తో సిక్కిరెడ్డి–కో సంగ్ హ్యూన్ (బెంగళూరు) జంట చేతిలో ఓడింది. దీంతో స్కోరు 1–1తో సమమైంది. అనంతరం జరిగిన సింగిల్స్ మ్యాచ్‌ను బెంగళూరు ‘ట్రంప్’గా ఎంచుకోగా విక్టర్ అక్సెల్సన్ (బెంగళూరు) 11–6, 11–5తో భమిడిపాటి సాయిప్రణీత్ (హైదరాబాద్)పై గెలిచాడు. ఈ విజయంతో బ్లాస్టర్స్ ఆధిక్యం 3–1కు పెరిగింది. పురుషుల డబుల్స్‌లో తన్ బూన్ హియోంగ్–తన్ వి కియోంగ్ (హైదరాబాద్) ద్వయం 5–11, 13–11, 11–8తో కో సంగ్ హ్యూన్–యూ సియంగ్ (బెంగళూరు) జోడీపై నెగ్గింది. దాంతో బెంగళూరు ఆధిక్యం 3–2కి తగ్గింది. అనంతరం మ్యాచ్ ఫలితాన్ని తేల్చే ‘ట్రంప్’ పోరులో హైదరాబాద్ ప్లేయర్, ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ 9–11, 11–5, 11–8తో అశ్విని పొన్నప్ప (బెంగళూరు)పై గెలిచింది. దాంతో హైదరాబాద్ 4–3తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఆదివారం జరిగే పోటీల్లో ఢిల్లీ ఏసర్స్‌తో చెన్నై స్మాషర్స్, బెంగళూరు బ్లాస్టర్స్‌తో ముంబై రాకెట్స్ తలపడతాయి. -
ముంబై రాకెట్స్ జోరు
లక్నో: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–2) రెండో సీజన్లో ముంబై రాకెట్స్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. అవధ్ వారియర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై రాకెట్స్ 3–2 పాయింట్ల తేడాతో గెలిచింది. తొలి మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో లీ యోంగ్ డే–నిపిత్పోన్ జోడీ 11–7, 3–11, 13–11తో గో వి షెమ్–మార్కిస్ కిడో (వారియర్స్) జంటపై నెగ్గడంతో ముంబై 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ 5–11, 15–14, 11–5తో కిడాంబి శ్రీకాంత్ (వారియర్స్)పై సంచలన విజయం సాధించడంతో ముంబై 2–0తో ముందంజ వేసింది. మూడో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ 12–10, 4–11, 11–5తో సుంగ్ జీ హున్ (ముంబై)ను ఓడిం చడంతో వారియర్స్ ఖాతాలో తొలి పాయింట్ చేరింది. నాలుగో మ్యాచ్ గా జరిగిన పురుషుల సింగిల్స్ ముంబై ‘ట్రంప్’ మ్యాచ్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 14–12, 9–11, 11–8తో విన్సెంట్ వోంగ్ వింగ్ కీ (వారియర్స్) గెలిచాడు. దాంతో ముంబై రాకెట్స్ 4–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఐదో మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్ వారియర్స్ ‘ట్రంప్’ మ్యాచ్‌లో సావిత్రి–బొదిన్ ఇసారా ద్వయం 11–8, 11–4తో నిపిత్పోన్–జీబా జంటపై గెలిచినా తుదకు అవధ్ వారియర్స్ 3–4తో ఓటమిని మూటగట్టుకుంది. శనివారం జరిగే బెంగళూరు బ్లాస్టర్స్‌తో హైదరాబాద్ హంటర్స్ తలపడుతుంది. -
భారత్‌కు రెండో విజయం
సింగపూర్: ఆసియా మహిళల చాంపియన్స ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మలేసియా జట్టుతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 2-0తో గెలిచింది. ఈ విజయంతో ఐదు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్ ఏడు పారుుంట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్ తరఫున పూనమ్ రాణి (7వ నిమిషంలో), దీపిక (45వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. భారత్ తమ చివరిదైన నాలుగో లీగ్ మ్యాచ్‌లో ఈనెల 4న చైనాతో ఆడుతుంది. లీగ్ దశ ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు టైటిల్ కోసం తలపడతారుు. -
జైపూర్‌కు రెండో విజయం
పట్నా: డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్‌కు ప్రొ కబడ్డీ లీగ్ తాజా సీజన్లో రెండో విజయం దక్కింది. ఇప్పటిదాకా ఏడు మ్యాచ్‌లు ఆడినా పెద్దగా ఆకట్టుకోని జైపూర్ జట్టు ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పూర్తి స్థాయిలో రెచ్చిపోయింది. ఫలితంగా పుణేరి పల్టన్స్‌పై 35-29 తేడాతో నెగ్గింది. సోను నర్వాల్ 8, జస్వీర్ సింగ్, రాజేశ్ నర్వాల్ ఎనిమిదేసి రైడ్ పాయింట్లు సాధించారు. జైపూర్ రెండు సార్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. ఇరు జట్లు సమానంగా చెరి 20 రైడ్ పాయింట్లు సాధించాయి. పుణే కెప్టెన్ ప్రవీణ్ నివాలే 9 పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. ప్రారంభం నుంచే జైపూర్ జోరును ప్రదర్శించడంతో తొలి అర్ధ భాగంలో 19-13తో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. ఆ తర్వాత కూడా ఇదే ఆధిపత్యాన్ని చూపెట్టి పుణెను ఓడించింది. పట్నా పైరేట్స్, బెంగాల్ వారియర్స్ మధ్య హోరాహోరీగా జరిగిన మరో మ్యాచ్ 20-20తో ‘డ్రా’గా ముగిసింది. సోమవారం మ్యాచ్‌లు లేవు. మంగళవారం హైదరాబాద్ అంచె పోటీలు ప్రారంభమవుతాయి. -
భారత్‌కు రెండో గెలుపు
బ్రెడా (నెదర్లాండ్స్): వోల్వో అంతర్జాతీయ అం డర్-21 హాకీ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 3-0 గోల్స్ తేడాతో గెలిచింది. ఆట ఆరో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచి భారత్ ఖాతా తెరిచాడు. 29వ నిమిషంలో సిమ్రన్‌జీత్ సింగ్ ఫీల్డ్ గోల్‌తో భారత ఆధిక్యం 2-0కు చేరుకుంది. 41వ నిమిషంలో లభించిన మరో పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ లక్ష్యానికి చేర్చాడు. మంగళవారం జరిగే తదుపరి లీగ్ మ్యాచ్‌లో బెల్జియంతో భారత్ తలపడుతుంది. -
హంపికి రెండో విజయం
షార్జా: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ మూడో ర్యాంకర్ కోనేరు హంపి రెండో విజయం సాధించింది. తాతియానా కొసింత్సెవా (రష్యా)తో సోమవారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో హంపి 60 ఎత్తుల్లో గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక నాలుగో ‘డ్రా’ నమోదు చేసుకుంది. అనా ఉషెనినా (ఉక్రెయిన్)తో జరిగిన గేమ్‌ను హారిక 43 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఏడో రౌండ్ తర్వాత హంపి ఖాతాలో మూడు, హారిక ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. మంగళవారం జరిగే ఎనిమిదో రౌండ్లో అనా ఉషెనినాతో హంపి; చెన్ జూ (ఖతార్)తో హారిక తలపడతారు.


