40 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 85
బెంగళూరుకు వరుసగా రెండో విజయం
9 వికెట్లతో యూపీ వారియర్స్ చిత్తు
ముంబై: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ముందుగా చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసిన జట్టు... ఆ తర్వాత మెరుపు బ్యాటింగ్‌తో మరో 47 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన ఈ పోరులో ఆర్‌సీబీ 9 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌ను చిత్తు చేసింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూపీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. దీప్తి శర్మ (35 బంతుల్లో 45 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), డియాండ్రా డాటిన్ (37 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 72 బంతుల్లో అభేద్యంగా 93 పరుగులు జోడించారు. అనంతరం బెంగళూరు 12.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 145 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్రేస్ హారిస్ (40 బంతుల్లో 85; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా...కెప్టెన్ స్మృతి మంధాన (32 బంతుల్లో 47 నాటౌట్; 9 ఫోర్లు) రాణించింది. వీరిద్దరు తొలి వికెట్‌కు 71 బంతుల్లోనే 137 పరుగులు జోడించి జట్టు విజయాన్ని సులువు చేశారు. యూపీ జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి. నేడు జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో గుజరాత్ జెయింట్స్ తలపడుతుంది. రాత్రి గం. 7:30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
కీలక భాగస్వామ్యం...
యూపీకి ఓపెనర్లు మెగ్ లానింగ్ (14), హర్లీన్ డియోల్ (11) శుభారంభం అందించలేకపోయారు. పరుగులు చేయలేకపోవడంతో పాటు వీరిద్దరు నెమ్మదిగా ఆడి బంతులను కూడా వృథా చేశారు. ఆ తర్వాత బరిలోకి దిగిన బ్యాటర్లూ కూడా పూర్తిగా తడబడ్డారు. దాంతో ఒకే స్కోరు వద్ద జట్టు 3 వికెట్లు కోల్పోయింది. లిచ్‌ఫీల్డ్ (11 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్), కిరణ్ నవ్‌గిరే (5), శ్వేత సెహ్రావత్ (0)లను ఆర్‌సీబీ బౌలర్లు వెనక్కి పంపించారు.
ఫలితంగా 50/5తో యూపీ కష్టాల్లో పడింది. ఈ దశలో దీప్తి, డాటిన్ కలిసి జట్టును ఆదుకున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి జట్టు స్కోరు 56 పరుగులకు చేరింది. తర్వాతి పది ఓవర్లలో మరో వికెట్ కోల్పోకుండా దీప్తి, డాటిన్ పరుగులు జోడించారు. శ్రేయాంక ఓవర్లో డాటిన్ వరుసగా 4, 6 కొట్టగా, డిక్లెర్క్ బౌలింగ్‌లో దీప్తి భారీ సిక్స్ బాదింది. శ్రేయాంక వేసిన ఆఖరి ఓవర్లోనూ వీరిద్దరు మూడు ఫోర్లు కొట్టడంతో మొత్తం 15 పరుగులు వచ్చాయి.
ఓపెనర్ల దూకుడు...
ఛేదనలో ఆర్‌సీబీ అలవోకగా దూసుకుపోయింది. దీప్తి వేసిన తొలి ఓవర్లోనే హారిస్ రెండు ఫోర్లు కొట్టగా, శిఖా ఓవర్లో స్మృతి రెండు ఫోర్లు సాధించింది. ఆ తర్వాత క్రాంతి ఓవర్లో వీరిద్దరు 3 ఫోర్లతో 13 పరుగులు రాబట్టారు. ఈ దశలో డాటిన్ ఓవర్‌తో మ్యాచ్ పూర్తిగా ఆర్‌సీబీ వైపు మళ్లింది. శోభన ఓవర్లోనూ హారిస్ వరుసగా 6, 4 బాదింది. 10 ఓవర్లలోనే 121 పరుగులు సాధించిన బెంగళూరుకు ఆటను ముగించేందుకు మరో 13 బంతులు సరిపోయాయి.
స్కోరు వివరాలు
యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: లానింగ్ (సి) రాధ (బి) శ్రేయాంక 14; హర్లీన్ (సి) స్మృతి (బి) బెల్ 11; లిచ్‌ఫీల్డ్ (సి) స్మృతి (బి) శ్రేయాంక 20; కిరణ్ (సి) స్మిత్ (బి) డిక్లెర్క్ 5; దీప్తి (నాటౌట్) 45; శ్వేత (సి) అరుంధతి (బి) డిక్లెర్క్ 0; డాటిన్ (నాటౌట్) 40; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 143.
వికెట్ల పతనం: 1–21, 2–39, 3–50, 4–50, 5–50.
బౌలింగ్: లారెన్ బెల్ 4–0–16–1, లిన్సీ స్మిత్ 4–0–30–0, శ్రేయాంక పాటిల్ 4–0–50–2, అరుంధతి రెడ్డి 4–0–18–0, నదైన్ డిక్లెర్క్ 4–0–28–2.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గ్రేస్ హారిస్ (సి) లానింగ్ (బి) శిఖా 85; స్మృతి (నాటౌట్) 47; రిచా (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (12.1 ఓవర్లలో వికెట్ నష్టానికి) 145.
వికెట్ల పతనం: 1–137.
బౌలింగ్: దీప్తి శర్మ 3.1–0–25–0, క్రాంతి గౌడ్ 2–0–18–0, శిఖా పాండే 3–0–28–1, డియాండ్రా డాటిన్ 1–0–32–0, సోఫీ ఎకెల్‌స్టోన్ 2–0–20–0, శోభన 1–0–17–0.
డాటిన్ ఓవర్లో 32 పరుగులు!
యూపీ బౌలర్ డియాండ్రా డాటిన్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఆర్‌సీబీ ఓపెనర్ గ్రేస్ హారిస్ మెరుపులా చెలరేగిపోయింది. ఈ ఓవర్లో ఆమె వరుసగా 4, 6, 4, 6, 6 బాదింది. వీటిలో తొలి బంతి నోబాల్ కూడా కావడంతో స్కోరు బోర్డులో అదనపు పరుగు చేరింది. అనంతం డాటిన్ వైడ్ కూడా వేసి మరో పరుగు ఇచి్చంది. తర్వాతి బంతిని హారిస్ మళ్లీ బౌండరీకి తరలించింది. ఎట్టకేలకు చివరి బంతికి పరుగు రాకుండా నిరోధించడంతో డాటిన్ సఫలమైంది. మొత్తంగా హారిస్ 30 పరుగులు కొట్టగా, అదనపు పరుగులు కలిపి ఓవర్లో 32 పరుగులు లభించాయి. ఈ క్రమంలో 22 బంతుల్లోనే హారిస్ అర్ధ సెంచరీ పూర్తయింది.


