breaking news
Royal challegers
-
బెంగళూరు గెలుపు.. పూనకంతో ఊగిపోయిన స్టార్ డైరెక్టర్
ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ గెలవడంతో ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. రోడ్లపైకి వచ్చిన విక్టరీని ఎంజాయ్ చేశారు. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సైతం బెంగళూరు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. మ్యాచ్ ముగిసిన వెంటనే డ్యాన్స్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. కేజీఎఫ్‌తో బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టిన ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం మన యంగ్ టైగర్‌తో సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీని ఎన్టీఆర్-నీల్ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. Director #PrashanthNeel is overjoyed as he celebrates #RCB’s victory in IPL 2025🏆#IPL2025Final #TeluguFilmNagar pic.twitter.com/tnXGeqqkem— Telugu FilmNagar (@telugufilmnagar) June 3, 2025 -
RCB Vs PBKS: ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ కథ ముగిసింది. ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోయింది. ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో పంజాబ్ పరాజయం పాలైంది. 242 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. 17 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లలో పేసర్ మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టగా.. లూకీ ఫెర్గూసన్, కరణ్ శర్మ, స్వప్నిల్ చెరో రెండు వికెట్లు సాధించారు.పంజాబ్ బ్యాటర్లలో రిలీ రూసో(61) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శశాంక్ సింగ్(37) కాసేపు మెరుపులు మెరిపించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతులు ఎదుర్కొన్న విరాట్.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 92 పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లితో పాటు రజిత్ పాటిదార్(55), కామెరాన్ గ్రీన్(46) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా.. విధ్వత్ కావేరప్ప రెండు, అర్ష్‌దీప్ సింగ్, సామ్ కుర్రాన్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ విజయంతో ఆర్సీబీ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. -
ఈసారి మేం స్వేచ్ఛగా ఆడతాం
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోహ్లి ముంబై : క్రిస్ గేల్, డివిలియర్స్‌తో పాటు తాను కూడా ఈసారి ఐపీఎల్లో స్వేచ్ఛగా ఆడతామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. ఈసారి తమ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇటీవలి వేలంలో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, స్యామీ, బద్రీనాథ్ జట్టులోకి వచ్చారు. ‘ఈసారి సీజన్ మాకు చాలా విభిన్నమైంది. ఎందుకంటే గత నాలుగేళ్ల నుంచి నాతోపాటు గేల్, డివిలియర్స్‌లపైనే బ్యాటింగ్ భారం ఉండడంతో ఒత్తిడిలో ఆడాల్సి వచ్చేది. ఇతర జట్లను గమనిస్తే బ్యాటింగ్ ఆర్డర్లో వారికి వెసులుబాటు ఉంది. అందుకే ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడుతున్నారు. ఈసారి మేం కూడా అలాంటి ఆటతీరునే చూపుతాం. ఎందుకంటే దినేశ్ కార్తీక్, స్యామీ, బద్రీనాథ్, మన్దీప్ సింగ్ మా బ్యాటింగ్ లైనప్‌లో ఉన్నారు. వీరి అండతో మేం ముగ్గురం ఇక మా సహజశైలిలో ఆడతాం. ఇప్పటికే డివిలియర్స్ ప్రపంచకప్‌లో టి20 మజా చూపించాడు. రెండుసార్లు సెమీస్, ఓ సారి ఫైనల్‌కు వచ్చాం. ఇక ఈసారి మాత్రం టైటిల్ లోటును తీర్చుకోవాలనే కసితో ఉన్నాం’ అని టీమ్ జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా కోహ్లి అన్నాడు. పేసర్ మిషెల్ స్టార్క్ మోకాలి గాయం కారణంగా నాలుగు మ్యాచ్‌ల అనంతరం జట్టులో చేరతాడని చెప్పాడు. సుదీర్ఘ పర్యటన అనంతరం వెంటనే ఐపీఎల్ ఆడాల్సి రావడంలో ఇబ్బందేమీ లేదని కోహ్లి చెప్పాడు. ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఇలాంటి సమస్యను సమర్థవంతంగా అధిగమించాల్సి ఉంటుందని, ప్రపంచకప్ తర్వాత లభించిన 9 రోజుల విరామంలో మేం బాగానే కోలుకున్నామని అన్నాడు. -
మాల్యా ‘కోరిక’ తీరేనా!
♦ ఆర్సీబీ ఆశలన్నీ ఆ ముగ్గురిపైనే ♦ స్పిన్నర్లకు అనుభవం తక్కువ ♦ ఆల్‌రౌండర్లతో అదనపు బలం లాభాల కంటే ప్రచారం కోసమే ఐపీఎల్ జట్టును సొంతం చేసుకున్న విజయ్‌మాల్యా... గత ఏడేళ్లలో తన లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోయారు. స్టార్ ఆటగాళ్లు, పవర్ హిట్టర్లతో జట్టును నింపినా ఒక్కసారి కూడా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. కోహ్లి, గేల్, డివిలియర్స్ త్రయంపైనే మరోసారి ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. ఈసారైనా మాల్యా కోరిక తీరుతుందా..? ఐపీఎల్ ట్రోఫీని బెంగళూరు ముద్దాడుతుందా? మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌ను దిగ్గజ ఆటగాడిగా తీసుకుని 2008 ఐపీఎల్లో అరంగేట్రం చేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)లో కుంబ్లే, స్టెయిన్, కలిస్‌లాంటి మేటి ఆటగాళ్లు బరిలోకి దిగారు. అయితే 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలిగింటిలో గెలిచి జాబితాలో ఆఖరి నుంచి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. తర్వాత జరిగిన వేలంలో 2009 సీజన్ కోసం అత్యధిక ధరకు పీటర్సన్‌ను కొనుగోలు చేయడంతో పాటు భారీ హిట్టర్ రైడర్‌ను జట్టులోకి తీసుకొచ్చారు. ద్రవిడ్ స్థానంలో నాయకత్వ పగ్గాలు చేపట్టిన కేపీ లీగ్ మధ్యలో వెళ్లిపోగా, మిగతా మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కుంబ్లే జట్టు తలరాతను మార్చాడు. 8 విజయాలతో ఆర్సీబీని ఫైనల్‌కు చేర్చాడు. అయితే తుదిపోరులో డెక్కన్ చార్జర్స్ చేతిలో ఓడింది. 2010 సీజన్లో... ఉతప్ప, కలిస్‌ల సూపర్ ఫామ్‌తో వరుస విజయాలతో హోరెత్తించింది. అయితే కీలకమైన సెమీస్‌లో లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 2011లో కోహ్లిని ఒక్కడినే రిటేన్ చేసుకుని మిగతా వాళ్లందర్ని వదులుకుంది. ఆ తర్వాత జరిగిన వేలంలో దిల్షాన్, జహీర్, డివిలియర్స్, వెటోరి, తివారీ, డెరిక్ నేన్స్ను తీసుకుంది. టోర్నీ మధ్యలో నేన్స్ గాయపడటంతో అతని స్థానంలో గేల్‌ను ఆడించింది. వెటోరి నాయకత్వం చేయగా, తొలి నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడింది. తర్వాత గేల్ సునామీ బ్యాటింగ్‌తో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో టాప్‌కి చేరి తొలి క్వాలిఫయర్‌లో చెన్నై చేతిలో ఓడింది. కానీ రెండో క్వాలిఫయర్‌లో ముంబైని ఓడించి టైటిల్ పోరులో ధోనిసేనను ఢీకొట్టింది. కానీ ఈసారి కూడా రన్నరప్‌గానే మిగిలింది. 2012లో గేల్‌కు గాయం, కెప్టెన్ కోహ్లి ఫామ్‌లో లేకపోవడంతో 16 మ్యాచ్లకుగానూ 8 మాత్రమే నెగ్గి గ్రూప్ దశకే పరిమితమైంది. 2013లో కొత్త ముఖాలతో ఆడినా... లీగ్ దశను దాటలేదు. గత సీజన్ కోసం వేలంలో యువరాజ్‌కు ఆర్సీబీ రూ. 14 కోట్లు వెచ్చించింది. డివిలియర్స్, గేల్, కోహ్లి... ఇలా కావలసినంత మంది స్టార్స్ ఉన్నా... ఒక్కరు కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చూపకపోవడంతో 14 మ్యాచ్లకుగానూ ఐదింటిలో మాత్రమే నెగ్గింది. భారీ ఆశలు పెట్టుకున్న యువీ... ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే చెలరేగాడు. డివిలియర్స్ రెండు నాణ్యమైన ఇన్నింగ్స్‌లు ఆడినా వరుస ఓటములతో జట్టు గ్రూప్‌కే పరిమితమైంది. ముగ్గురిపైనే ఆశలు గతంలో రెండుసార్లు రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఆర్సీబీ ఈసారి ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ సీజన్ కోసం యువరాజ్, మురళీధరన్, జకాటీ, తన్మయ్ మిశ్రా, సచిన్ రాణాలను తప్పించి బద్రినాథ్, సీన్ అబాట్, మిల్నే, ఇక్బాల్ అబ్దుల్లా, సర్ఫరాజ్ ఖాన్, మన్దీప్ సింగ్, స్యామీ, జలజ్ సక్సేనా, బిస్లా, బావ్నేలను జట్టులోకి తెచ్చారు. కోహ్లి, డివిలియర్స్, గేల్లపైనే ఈ జట్టు భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ ముగ్గురిలో ఒకరు ఫామ్‌లో ఉన్నా జట్టు విజయాలకు ఢోకా ఉండదు. కానీ గేల్ బ్యాటింగ్ అనిశ్చితి ఆందోళనకు గురి చేస్తోంది. డివిలియర్స్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. కీలక ఆటగాళ్లు: కోహ్లి, డివిలియర్స్, గేల్‌లతో పాటు ఆసీస్‌కు వన్డే వరల్డ్‌కప్‌ను అందించిన స్టార్క్, మిల్నే, సీన్ అబాట్‌లు అత్యంత కీలకంకానున్నారు. స్పిన్నర్లకు అనుభవం లేకపోవడం కాస్త లోటుగా కనిపిస్తోంది. - సాక్షి క్రీడావిభాగం