breaking news
Rajya Sabha nomination
-
మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫామ్స్ నింపే నిబంధనలు ప్రతీ ఒక్కరూ పాటించాల్సిందేనన్నారు. నామినేషన్ పత్రంలో ప్రతీ కాలమ్ భర్తీ చేయాలని ఎన్నికల నిబంధన ఉందన్నారు. కొన్నిసార్లు ఎన్నికల అధికారులు చూసి చూడనట్లు ఉన్నా.. రాజకీయ ప్రత్యర్థులు దాన్నే ఎత్తిచూపుతారు. ప్రత్యర్థులు ఫిర్యాదు చేయకపోతే పరిస్థితి మరోలా ఉండేదేమోనంటూ ఆయన వ్యాఖ్యానించారు.‘‘కోర్టు కేసు వివరాలు ఇవ్వాలని నటరాజన్‌కు సమయం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. ఒకసారి రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకున్న తర్వాత నా పరిధిలో ఉండదు. మీనాక్షి నటరాజన్ సుప్రీం కోర్టును వెళ్లినా.. కోర్టు సైతం ఆర్వో నిర్ణయాన్నే సమర్థించింది. సీఎం రేవంత్‌రెడ్డి రెండు ఓట్లు సర్ ప్రక్రియతో ఇక ఉండవు’’ అని సీఈసీ పేర్కొన్నారు.‘సర్’పై విమర్శల నేపథ్యంలో జ్ఞానేష్‌కుమార్ స్పందిస్తూ.. ‘‘ప్రపంచంలోనే ఫెడరల్ ఎలక్షన్ జరిగే దేశం ఇండియా. ప్రపంచంలోనే అత్యంత ఆర్గనైజేషన్ కలిగిన బాడీ ఎలక్షన్ కమిషన్. దేశంలో ఓటర్ల సంఖ్య ప్రతీ ఏడాది 8 కోట్ల వరకు మారుతుంది. 95 కోట్ల భారతీయ ఓటర్లకు నేను లీడర్ కావడం నాకు గర్వంగా ఉంది. దేశ వ్యాప్తంగా 12 లక్షల మంది బీఎల్వోలు పనిచేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగడానికి ప్రక్రియలో అందరూ ముఖ్యమే...ఎలక్షన్ కమిషన్ అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. మొన్న జరిగిన వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో 93.7 ఓటింగ్ శాతం ప్రపంచ రికార్డు సాధించాం. ఏఎస్ఎస్డీఎఫ్ ఓట్లను మాత్రమే ఎలక్షన్ కమిషన్ తొలగిస్తుంది. ‘సర్’ను ఇతర దేశాలను ఆదర్శనంగా తీసుకోబోయే రోజులు వస్తాయి. ప్రభుత్వ పథకాలకు ఓటర్ ఐడి కార్డు తప్పనిసరి అనే వార్తల్లో నిజం లేదు’’ అని సీఈసీ జ్ఞానేష్‌కుమార్ తెలిపారు. -
సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. మధ్యప్రదేశ్ నుంచి ఆమె దాఖలు చేసిన రాజ్యసభ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి (Returning Officer) తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేసిన ఆమె నామినేషన్‌ను, పెండింగ్‌లో ఉన్న ఒక క్రిమినల్ కేసును(తెలంగాణలో నమోదు అయ్యింది) వెల్లడించలేదన్న కారణంతో రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ్టి విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, సంబంధిత కేసులో ఇప్పటివరకు చార్జీలు (charges) ఫ్రేమ్ కాలేదని తెలిపారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం చార్జీలు నమోదు కాకుండా నామినేషన్‌ను తిరస్కరించడం సరైనది కాదని ఆయన కోర్టుకు వివరించారు. అయితే ధర్మాసనం ఈ వాదనపై స్పందిస్తూ, నామినేషన్ ప్రక్రియ అనంతరం రిటర్నింగ్ అధికారి ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేసి నామినేషన్‌ను అంగీకరించిన ఏమైనా తీర్పులు ఉన్నాయా చూపించాలని సింఘ్వీని ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. ఏ కేసులోనైనా వాస్తవాలు వచ్చినప్పుడు మాత్రమే కోర్టు చట్టాన్ని వర్తింపజేస్తుందని.. చట్టం ఇప్పటికే స్పష్టంగా ఉందని.. తగిన సందర్భంలో కోర్టు దాన్ని అమలు చేస్తుందని తెలిపారు.మధ్యప్రదేశ్ ఆర్వో తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ.. నామినేషన్ తిరస్కరణ అంశం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు రాదని, అందువల్ల ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టులో పిటిషన్ నిలవదని వాదించారు. ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాల జోక్యానికి ఆర్టికల్ 329 అడ్డుకట్ట వేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగింపు వరకు న్యాయ సమీక్ష పరిధికి బయట ఉంటుందని, ఏదైనా తప్పు జరిగితే అది ఎన్నికల ట్రైబ్యునల్‌లోనే సవాలు చేయాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మోహిందర్ సింగ్ గిల్ కేసు సహా పలు తీర్పులను ఆయన ప్రస్తావించారు.విచారణ సందర్భంగా సాంకేతిక లోపం కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు నిలిచిపోయాయి. ఆ సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా కోర్టుకు వాదనలు వినిపించారు. అయితే ఈ జోక్యంపైనా సింఘ్వీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధారణంగా ఎన్నికల సంఘం అభ్యర్థి తరఫున వాదనలు వినిపించకూడదని ఆయన పేర్కొన్నారు. అయితే.. అన్ని వాదనలు పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఆర్వో నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని.. ఇలాంటివి జరిగినప్పుడు ఈసీని ఆశ్రయించాలని సూచిస్తూ.. పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు తెలిపింది. కాగా.. సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ స్పందించారు. ఇది తన వ్యక్తిగత పరాజయం కాదని, భారత ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి జరిగిన నష్టమని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం స్వతంత్రతపై తాను మొదటి నుంచే అనుమానాలు వ్యక్తం చేస్తున్నానని, అవి మరోసారి నిరూపితమయ్యాయని ఆమె అన్నారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయం వెనుక పారదర్శకత లేకపోవడాన్ని తాము ఎత్తిచూపామని, అయితే తమ వాదనలను సరైన విధంగా పరిగణనలోకి తీసుకోలేదని ఆమె అభిప్రాయపడ్డారు. మరోవైపు, తమ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించినందుకు మాత్రం ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
మీనాక్షి నామినేషన్ రద్దు.. బీజేపీ చేతికి ఆ పేపర్లు ఎలా?
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు వ్యవహారం ఇప్పుడో.. పెద్ద పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుకు సంబంధించిన సమాచారం దాచినట్లు ఆరోపణలతో రిటర్నింగ్ అధికారి ఆర్వింద్ శర్మ ఆమె నామినేషన్‌ను తిరస్కరించడం.. రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్, బీజేపీ పరస్పర ఆరోపణలతో ఈ ఎపిసోడ్ పూటకో మలుపు తిరుగుతోంది.. తెలంగాణలో మీనాక్షి నటరాజన్‌పై కేసు ఉందని బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలోనే నామినేషన్ తిరస్కరణకు గురైంది. అయితే ఈ కేసుకు సంబంధించిన పత్రాలు బీజేపీ చేతికి ఎలా వచ్చాయన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ నుంచే తమకు ఆ సమాచారం అందిందని బీజేపీ బాంబ్ పేల్చింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక కాంగ్రెస్‌లోనే అంతర్గత విభేదాలు, లీక్ రాజకీయాలు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. మధ్యప్రదేశ్ మంత్రి కైలాశ్ విజయవర్గీయ మాట్లాడుతూ, “ఈ పత్రాలు తెలంగాణ నుంచి వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే సమాచారం కాంగ్రెస్ వర్గాల నుంచే బయటకు వచ్చి ఉండొచ్చు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా ముందుకెళ్లి, బీజేపీకి ఈ సమాచారం కాంగ్రెస్ లోపలి వ్యక్తుల నుంచే వచ్చి ఉండొచ్చని కూడా ఆయన అనడంతో రాజకీయ వేడిని మరింత పెంచింది. ఇదే సమయంలో తెలంగాణలో కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్‌లో అంతర్గత వర్గపోరు వల్లే ఈ లీక్ జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే..ఈ వ్యవహారం “యాదృచ్ఛిక లీక్” కాకుండా ఒక ప్రణాళికాబద్ధ రాజకీయ మార్గం ద్వారా బీజేపీకి చేరినట్లు ఓ ప్రముఖ జాతీయ మీడియా కథనం ఇచ్చింది. తెలంగాణకు చెందిన ఓ ప్రముఖ బీజేపీ నేత ఇచ్చిన వివరాల మేరకు.. ఆ పత్రాలు మధ్యప్రదేశ్ బీజేపీకి చేరగా, ఆ పార్టీ వెంటనే చురుకుగా స్పందించిందట. ఆ పత్రాల్లో కోర్టు కేసులు, నోటీసులకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు సమాచారం.బోపాల్‌కు చేరిన తర్వాత బీజేపీ లీగల్ వ్యూహాన్ని సిద్ధం చేసి రిటర్నింగ్ అధికారికి అభ్యంతరం దాఖలు చేసింది. ఈ కేసును బలంగా వాదించేందుకు పార్టీ తరఫున రాహుల్ కొఠారి, మాజీ న్యాయమూర్తి రోహిత్ ఆర్యను నియమించినట్లు తెలుస్తోంది. దీంతో నామినేషన్ స్క్రూటినీ సమయంలో బీజేపీ బలమైన సవాలు విసరడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.మరోవైపు కాంగ్రెస్ ఈ మొత్తం ప్రక్రియపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. స్క్రూటినీ సమయంలో మాజీ న్యాయమూర్తి పాల్గొనడంపై కాంగ్రెస్ నేత జేపీ ధనోపియా అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు. ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం వల్లే తమ అభ్యర్థిపై అన్యాయం జరిగిందని కాంగ్రెస్ వాదిస్తోంది.ఈ వివాదానికి మూలం 2022లో తెలంగాణలో జరిగిన ఒక కేసు అని తెలుస్తోంది. ఒక మహిళ చేసిన ఫిర్యాదులో కాంగ్రెస్ నాయకుడిపై ఆరోపణలు ఉండగా, ఆ సమయంలో ఆ వ్యవహారంతో మీనాక్షి నటరాజన్‌కు కూడా సంబంధం ఉందని ఫిర్యాదుదారు పేర్కొన్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ మాత్రం ఆమెపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, కోర్టు కేవలం షోకాజ్ నోటీసులు.. సమన్లు మాత్రమే ఇచ్చిందని.. చట్టపరంగా నామినేషన్లో ఆ వివరాలు ప్రకటించాల్సిన అవసరం లేదని అంటోంది. ఈ విషయంలో గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేస్తూ.. ఆ దిశగా అడుగులు వేయొచ్చని సంకేతాలిస్తోంది.మొత్తానికి ఈ వ్యవహారం కేవలం నామినేషన్ రద్దు ఘటనగా కాకుండా, కాంగ్రెస్–బీజేపీ మధ్య పత్రాల రాజకీయ యుద్ధంగా మారింది. “పేపర్ ఎవరు ఇచ్చారు?”, “లీక్ వెనుక ఎవరు ఉన్నారు?” అనే ప్రశ్నలతో మధ్యప్రదేశ్ రాజ్యసభ పోరు ఇప్పుడు పూర్తిగా పొలిటికల్ థ్రిల్లర్‌గా మారిపోయింది.ఈసీ ఏం చేయబోతోంది?..ఈ మొత్తం వివాదంపై ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. సాధారణంగా రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా.. చట్టపరమైన ప్రక్రియనే ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నామినేషన్ స్క్రూటినీ సమయంలో వచ్చిన అభ్యంతరాలు, సమర్పించిన అఫిడవిట్ వివరాల ఆధారంగానే రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకుంటారని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ నిరసనలు చేస్తేనో.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తేనో ఈసీ నిర్ణయాలు మారవని.. దాని పరిధి కేవలం ఎన్నికల ప్రక్రియ నిర్వహణకే పరిమితమని, లీక్‌లు లేదంటే రాజకీయ ఆరోపణలపై స్పందించేది కాదని కూడా అంటున్నారు. దీంతో కాంగ్రెస్ ముందు కోర్టును ఆశ్రయించడమనే ఆప్షన్ మాత్రమే ఉందని చెబుతున్నారు. -
రాజ్యసభ బరిలో సునేత్రా పవార్
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి సునేత్ర ఎన్సీపీ అభ్యరి్థగా గురువారం రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ ఎంపీ ప్రఫుల్ పటేల్, మంత్రి ఛగన్ భుజ్‌బల్, లోక్‌సభకు ఎన్నికైన సునీల్ తాట్కరే వెంటరాగా విధాన్ భవన్లో ఆమె నామినేషన్ సమరి్పంచారు. మిత్రపక్షాలైన బీజేపీ, శివసేన నుంచి ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. దేశం దృష్టిని ఆకర్షించిన బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే చేతిలో సునేత్ర ఓటమి పాలైన విషయం తెలిసిందే. పీయూష్ గోయల్, ఉదయన్‌రాజే భోంస్లే (ఇద్దరూ బీజేపీ) ఇటీవలే లోక్‌సభకు ఎన్నిక కావడంతో మహారాష్ట్రలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. అస్సాం, బిహార్లలో రెండేసి, హరియాణా, మధ్యప్రదేశ్, రాజస్తాన్, త్రిపురలలో ఒకటి చొప్పున రాజ్యసభ స్థానాలు కూడా ఖాళీ అయ్యాయి. ఆయా చోట సిట్టింగ్ సభ్యులు లోక్‌సభకు ఎన్నికయ్యారు. -
ఆమె చేసిన అమూల్యమైన సేవలు ఎనలేనివి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ కావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆయన ఒక సందేశం ద్వారా సుధామూర్తికి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాజ్యసభకు నామినేట్ అయినందుకు శ్రీమతి సుధామూర్తిగారికి నా హృదయపూర్వక అభినందనలు. పరోపకారిగా, సామాజిక సేవకురాలిగా, వ్యాపారవేత్తగా, రచయిత్రిగా ఆమె చేసిన అమూల్యమైన సేవలు ఎనలేనివి. భవిష్యత్ లో సుధామూర్తి మరింత ఉన్నత శిఖరాలను అందుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా అని ట్వీట్ చేశారాయన. My heartfelt congratulations to @SmtSudhaMurty garu on being nominated to the Rajya Sabha on International Women’s Day. Her invaluable contributions as a philanthropist, social worker, entrepreneur and author are immeasurable. I earnestly hope that she achieves even greater… — YS Jagan Mohan Reddy (@ysjagan) March 8, 2024 ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్ చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్ (ట్విటర్)’ వేదికగా వెల్లడించారు. మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడటంతో డబుల్ సర్ప్రైజ్గా.. చాలా ఆనందంగా ఉందని ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సుధా మూర్తి ఓ మీడియా సంస్థ ద్వారా స్పందించారు. -
పెద్దల సభకు పరుగుల రాణి
ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ప్రపంచ వేదికలపై భారత్ సత్తా చాటిన అథ్లెట్ పీటీ ఉష. చిరుత కూడా చిన్నబోయే వేగం ఉష సొంతం. ట్రాక్‌పై ఆమె అడుగు పెట్టిందంటే పందెం కోడె! అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో ఉష ప్రతిభ ఎన్నో పతకాలను తెచ్చిపెట్టింది. అమ్మాయిలకు చదువెందుకనే ఆ రోజుల్లో ఆటల పోటీల్లోకి వెళ్లడమంటే సాహసం. అలాంటి పరిస్థితుల్లో ‘పయ్యోలి’అనే పల్లెటూరులో నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది. ప్రపంచవేదికపై ‘పరుగుల రాణి’గా నిలిచింది. పతకాలతో ‘గోల్డెన్ గర్ల్’గా మారింది. ‘పయ్యోలి ఎక్స్‌ప్రెస్’గా ఎదిగింది. ఆమె పరుగు ఎందరో అమ్మాయిలకు ప్రేరణ. ఊరి పేరునే.. ఇంటిపేరుగా మార్చుకున్న పయ్యోలి తెవరపరంపిల్ ఉష (పీటీ ఉష) 1976 నుంచి 2000 వరకు రెండున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘంగా ‘పరుగు’ప్రయాణాన్ని కొనసాగించింది. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 4–400 మీటర్ల రిలే, 400 మీటర్ల హర్డిల్స్‌లో అలుపెరగని పరుగుతో దిగ్గజ అథ్లెట్‌గా ఎదిగింది. 25 ఏళ్ల కెరీర్లో జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో ఉష మొత్తం 102 పతకాలను గెలుచుకుంది. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ (1984)లో 400 మీటర్ల హర్డిల్స్‌లో త్రుటిలో కాంస్యం కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. The remarkable PT Usha Ji is an inspiration for every Indian. Her accomplishments in sports are widely known but equally commendable is her work to mentor budding athletes over the last several years. Congratulations to her on being nominated to the Rajya Sabha. @PTUshaOfficial pic.twitter.com/uHkXu52Bgc— Narendra Modi (@narendramodi) July 6, 2022 కానీ అంతకుముందు... ఆ తర్వాత జరిగిన ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్‌లలో ఎదురేలేని స్ప్రింటర్‌గా ఎదిగింది. ప్రత్యేకించి 1985 నుంచి 1989 వరకు కువైట్, జకార్తా, సియోల్, సింగపూర్, న్యూఢిల్లీల్లో జరిగిన ఆసియా పోటీల్లో ఆమె 16 స్వర్ణాలు (ఓవరాల్‌గా 18 బంగారు పతకాలను) సాధించింది. కెరీర్ తదనంతరం అకాడమీ నెలకొల్పి.. తన జీవితాన్నే భారత అథ్లెటిక్స్‌కి అంకితం చేసింది. ఆమె సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం 1984లో ‘అర్జున అవార్డు’తో పాటు ‘పద్మశ్రీ’పురస్కారాన్ని అందజేసింది. 58 ఏళ్ల ఉష తాజాగా రాజ్యసభకు నామినేట్ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ ఉష పేరును ఎగువసభకు ప్రతిపాదించారు. ఉష ప్రతి భారతీయుడికి స్ఫూర్తిప్రదాత అని మోదీ స్వయంగా ట్వీటర్ వేదికగా శుభాకంక్షలు తెలిపారు. ఉష (కేరళ) సహా తమిళనాడు నుంచి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయారాజా, కర్ణాటక నుంచి ధర్మస్థల ఆలయ పాలక మండలి అధినేత, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్గడే, ఆంధ్రప్రదేశ్ నుంచి సినీ కథా రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్‌లను బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ ఎగువసభకు నామినేట్ చేసింది. -
భార్యకు మొండిచేయి చూపిన లాలూ
పట్నా: బిహార్ లో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సోమవారం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. జేడీ(యూ) నేత శరద్ యాదవ్, ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ, లాలూ ప్రసాద్ తనయ మిసా భారతి, నితీశ్ కుమార్ అనుచరుడు ఆర్సీపీ సింగ్ నామినేషన్లు దాఖలు వేశారు. లాలూ ప్రసాద్ భార్య రబ్రీదేవిని కాదని కూతురికి సీటు ఇచ్చారు. సతీమణిని పెద్దల సభకు పంపుతారని వార్తలు వచ్చాయి. దీనిపై సోమవారం సస్పెన్స్ కొనసాగింది చివరకు కూతురివైపే ఆయన మొగ్గుచూపారు. అవినీతి కేసుల్లో తన తరపున వాదించిన జెంఠ్మలానీకి మరొ స్థానం కేటాయించారు. ఆదివారం ఆయన ఆర్జేడీలో చేరారు. తాను లాలూ ప్రసాద్ కు స్నేహితుడిని, రక్షకుడిని అని జెంఠ్మలానీ ప్రకటించుకున్నారు. బీజేపీ తరపున రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోపాల్ నారాయణ్ సింగ్ టికెట్ దక్కించుకున్నారు. ఈ ఐదు స్థానాలు జులైలో ఖాళీ అవుతాయి. -
మరో హీరోకి కేంద్రమంత్రి ఛాన్స్ !
తిరువనంతపురం : ప్రముఖ మలయాళ నటుడు సురేష్ గోపికి కేంద్రమంత్రి పదవి వరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు కమలనాథులు. సురేష్ గోపిని కేరళ నుంచి రాజ్యసభకు పంపాలని ఆ పార్టీ అగ్రనేతలు నిర్ణయించినట్లు సమాచారం. గత ఆదివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సురేష్ గోపి న్యూఢిల్లీలో సమావేశమై... ఈ అంశంపై చర్చించారని తెలిసింది. కాగా సురేష్ గోపిని నేషనల్ ఫిల్మ్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిలో నియమించాలని కమలం పార్టీ అగ్రనేతలు ఇప్పటి వరకు భావించారు. కానీ అమిత్ షాతో సురేష్ గోపి భేటీ అనంతరం తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ఆ పార్టీ అగ్రనేతలు చెబుతున్నారు. ఆయన్ని రాజ్యసభకు నామినేట్ చేసి మోదీ మంత్రివర్గంలో చోటు కల్పించాలని సదరు నాయకుల మధ్య ప్రచారం సాగుతోంది. ఎందుకంటే నరేంద్రమోదీ కేబినెట్లో కేరళ రాష్ట్రం నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహించడం లేదు. ఈ నేపథ్యంలో ఆ అవకాశం సురేష్ గోపికి ఇవ్వాలని వారు నిర్ణయించారు. అయితే కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మే 16 తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరువనంతపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన్ని ఎన్నికల బరిలో నిలపాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. అయితే ఆ నిర్ణయాన్ని సురేష్ గోపి సున్నితంగా తిరస్కరించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్నాయి. అందులోభాగంగా ప్రధాని మోదీ ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారం కోసం సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఆయనతోపాటు సురేష్ గోపి కూడా ఈ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలిసింది. ఇప్పటికే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఆయన మరోవైపు బీజేపీకి ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.


