మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు వ్యవహారం ఇప్పుడో.. పెద్ద పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుకు సంబంధించిన సమాచారం దాచినట్లు ఆరోపణలతో రిటర్నింగ్ అధికారి ఆర్వింద్ శర్మ ఆమె నామినేషన్‌ను తిరస్కరించడం.. రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్, బీజేపీ పరస్పర ఆరోపణలతో ఈ ఎపిసోడ్ పూటకో మలుపు తిరుగుతోంది..
తెలంగాణలో మీనాక్షి నటరాజన్‌పై కేసు ఉందని బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలోనే నామినేషన్ తిరస్కరణకు గురైంది. అయితే ఈ కేసుకు సంబంధించిన పత్రాలు బీజేపీ చేతికి ఎలా వచ్చాయన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ నుంచే తమకు ఆ సమాచారం అందిందని బీజేపీ బాంబ్ పేల్చింది.
ఈ మొత్తం వ్యవహారం వెనుక కాంగ్రెస్‌లోనే అంతర్గత విభేదాలు, లీక్ రాజకీయాలు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. మధ్యప్రదేశ్ మంత్రి కైలాశ్ విజయవర్గీయ మాట్లాడుతూ, “ఈ పత్రాలు తెలంగాణ నుంచి వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే సమాచారం కాంగ్రెస్ వర్గాల నుంచే బయటకు వచ్చి ఉండొచ్చు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా ముందుకెళ్లి, బీజేపీకి ఈ సమాచారం కాంగ్రెస్ లోపలి వ్యక్తుల నుంచే వచ్చి ఉండొచ్చని కూడా ఆయన అనడంతో రాజకీయ వేడిని మరింత పెంచింది. ఇదే సమయంలో తెలంగాణలో కూడా బీఆర్‌ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్‌లో అంతర్గత వర్గపోరు వల్లే ఈ లీక్ జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే..
ఈ వ్యవహారం “యాదృచ్ఛిక లీక్” కాకుండా ఒక ప్రణాళికాబద్ధ రాజకీయ మార్గం ద్వారా బీజేపీకి చేరినట్లు ఓ ప్రముఖ జాతీయ మీడియా కథనం ఇచ్చింది. తెలంగాణకు చెందిన ఓ ప్రముఖ బీజేపీ నేత ఇచ్చిన వివరాల మేరకు.. ఆ పత్రాలు మధ్యప్రదేశ్ బీజేపీకి చేరగా, ఆ పార్టీ వెంటనే చురుకుగా స్పందించిందట. ఆ పత్రాల్లో కోర్టు కేసులు, నోటీసులకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు సమాచారం.
బోపాల్‌కు చేరిన తర్వాత బీజేపీ లీగల్ వ్యూహాన్ని సిద్ధం చేసి రిటర్నింగ్ అధికారికి అభ్యంతరం దాఖలు చేసింది. ఈ కేసును బలంగా వాదించేందుకు పార్టీ తరఫున రాహుల్ కొఠారి, మాజీ న్యాయమూర్తి రోహిత్ ఆర్యను నియమించినట్లు తెలుస్తోంది. దీంతో నామినేషన్ స్క్రూటినీ సమయంలో బీజేపీ బలమైన సవాలు విసరడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
మరోవైపు కాంగ్రెస్ ఈ మొత్తం ప్రక్రియపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. స్క్రూటినీ సమయంలో మాజీ న్యాయమూర్తి పాల్గొనడంపై కాంగ్రెస్ నేత జేపీ ధనోపియా అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు. ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం వల్లే తమ అభ్యర్థిపై అన్యాయం జరిగిందని కాంగ్రెస్ వాదిస్తోంది.
ఈ వివాదానికి మూలం 2022లో తెలంగాణలో జరిగిన ఒక కేసు అని తెలుస్తోంది. ఒక మహిళ చేసిన ఫిర్యాదులో కాంగ్రెస్ నాయకుడిపై ఆరోపణలు ఉండగా, ఆ సమయంలో ఆ వ్యవహారంతో మీనాక్షి నటరాజన్‌కు కూడా సంబంధం ఉందని ఫిర్యాదుదారు పేర్కొన్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ మాత్రం ఆమెపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, కోర్టు కేవలం షోకాజ్ నోటీసులు.. సమన్లు మాత్రమే ఇచ్చిందని.. చట్టపరంగా నామినేషన్‌లో ఆ వివరాలు ప్రకటించాల్సిన అవసరం లేదని అంటోంది. ఈ విషయంలో గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేస్తూ.. ఆ దిశగా అడుగులు వేయొచ్చని సంకేతాలిస్తోంది.
మొత్తానికి ఈ వ్యవహారం కేవలం నామినేషన్ రద్దు ఘటనగా కాకుండా, కాంగ్రెస్–బీజేపీ మధ్య పత్రాల రాజకీయ యుద్ధంగా మారింది. “పేపర్ ఎవరు ఇచ్చారు?”, “లీక్ వెనుక ఎవరు ఉన్నారు?” అనే ప్రశ్నలతో మధ్యప్రదేశ్ రాజ్యసభ పోరు ఇప్పుడు పూర్తిగా పొలిటికల్ థ్రిల్లర్‌గా మారిపోయింది.
ఈసీ ఏం చేయబోతోంది?..
ఈ మొత్తం వివాదంపై ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. సాధారణంగా రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా.. చట్టపరమైన ప్రక్రియనే ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నామినేషన్ స్క్రూటినీ సమయంలో వచ్చిన అభ్యంతరాలు, సమర్పించిన అఫిడవిట్ వివరాల ఆధారంగానే రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకుంటారని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ నిరసనలు చేస్తేనో.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తేనో ఈసీ నిర్ణయాలు మారవని.. దాని పరిధి కేవలం ఎన్నికల ప్రక్రియ నిర్వహణకే పరిమితమని, లీక్‌లు లేదంటే రాజకీయ ఆరోపణలపై స్పందించేది కాదని కూడా అంటున్నారు. దీంతో కాంగ్రెస్ ముందు కోర్టును ఆశ్రయించడమనే ఆప్షన్ మాత్రమే ఉందని చెబుతున్నారు.


