PT Usha: పరుగుల రాణికి ‘రాజ్య’ యోగం 

Athlete PT Usha Among 4 Nominated To Rajya Sabha - Sakshi

ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో ప్రపంచ వేదికలపై భారత్‌ సత్తా చాటిన అథ్లెట్‌ పీటీ ఉష. చిరుత కూడా చిన్నబోయే వేగం ఉష సొంతం. ట్రాక్‌పై ఆమె అడుగు పెట్టిందంటే పందెం కోడె! అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో ఉష ప్రతిభ ఎన్నో పతకాలను తెచ్చిపెట్టింది. అమ్మాయిలకు చదువెందుకనే ఆ రోజుల్లో ఆటల పోటీల్లోకి వెళ్లడమంటే సాహసం. అలాంటి పరిస్థితుల్లో ‘పయ్యోలి’అనే పల్లెటూరులో నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది. ప్రపంచవేదికపై ‘పరుగుల రాణి’గా నిలిచింది. పతకాలతో ‘గోల్డెన్‌ గర్ల్‌’గా మారింది. ‘పయ్యోలి ఎక్స్‌ప్రెస్‌’గా ఎదిగింది. ఆమె పరుగు ఎందరో అమ్మాయిలకు ప్రేరణ.

ఊరి పేరునే.. ఇంటిపేరుగా మార్చుకున్న పయ్యోలి తెవరపరంపిల్‌ ఉష (పీటీ ఉష) 1976 నుంచి 2000 వరకు రెండున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘంగా ‘పరుగు’ప్రయాణాన్ని కొనసాగించింది. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 4–400 మీటర్ల రిలే, 400 మీటర్ల హర్డిల్స్‌లో అలుపెరగని పరుగుతో దిగ్గజ అథ్లెట్‌గా ఎదిగింది. 25 ఏళ్ల కెరీర్‌లో జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో ఉష మొత్తం 102 పతకాలను గెలుచుకుంది. లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ (1984)లో 400 మీటర్ల హర్డిల్స్‌లో త్రుటిలో కాంస్యం కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.

కానీ అంతకుముందు... ఆ తర్వాత జరిగిన ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్‌లలో ఎదురేలేని స్ప్రింటర్‌గా ఎదిగింది. ప్రత్యేకించి 1985 నుంచి 1989 వరకు కువైట్, జకార్తా, సియోల్, సింగపూర్, న్యూఢిల్లీల్లో జరిగిన ఆసియా పోటీల్లో ఆమె 16 స్వర్ణాలు (ఓవరాల్‌గా 18 బంగారు పతకాలను) సాధించింది. కెరీర్‌ తదనంతరం అకాడమీ నెలకొల్పి.. తన జీవితాన్నే భారత అథ్లెటిక్స్‌కి అంకితం చేసింది. ఆమె సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం 1984లో ‘అర్జున అవార్డు’తో పాటు ‘పద్మశ్రీ’పురస్కారాన్ని అందజేసింది.

58 ఏళ్ల ఉష తాజాగా రాజ్యసభకు నామినేట్‌ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ ఉష పేరును ఎగువసభకు ప్రతిపాదించారు. ఉష ప్రతి భారతీయుడికి స్ఫూర్తిప్రదాత అని మోదీ స్వయంగా ట్వీటర్‌ వేదికగా శుభాకంక్షలు తెలిపారు. ఉష (కేరళ) సహా తమిళనాడు నుంచి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయారాజా, కర్ణాటక నుంచి ధర్మస్థల ఆలయ పాలక మండలి అధినేత, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్గడే, ఆంధ్రప్రదేశ్‌ నుంచి సినీ కథా రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్‌లను బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌ ఎగువసభకు నామినేట్‌ చేసింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top