సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు ఎదురుదెబ్బ | Congress Meenakshi Natarajan plea Hearing SC News Updates | Sakshi
Sakshi News home page

సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు ఎదురుదెబ్బ

Jun 12 2026 1:23 PM | Updated on Jun 12 2026 6:22 PM

Congress Meenakshi Natarajan plea Hearing SC News Updates

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. మధ్యప్రదేశ్‌ నుంచి ఆమె దాఖలు చేసిన రాజ్యసభ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి (Returning Officer) తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేసిన ఆమె నామినేషన్‌ను, పెండింగ్‌లో ఉన్న ఒక క్రిమినల్ కేసును(తెలంగాణలో నమోదు అయ్యింది) వెల్లడించలేదన్న కారణంతో రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ్టి విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, సంబంధిత కేసులో ఇప్పటివరకు చార్జీలు (charges) ఫ్రేమ్ కాలేదని తెలిపారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం చార్జీలు నమోదు కాకుండా నామినేషన్‌ను తిరస్కరించడం సరైనది కాదని ఆయన కోర్టుకు వివరించారు. 

అయితే ధర్మాసనం ఈ వాదనపై స్పందిస్తూ, నామినేషన్ ప్రక్రియ అనంతరం రిటర్నింగ్ అధికారి ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేసి నామినేషన్‌ను అంగీకరించిన ఏమైనా తీర్పులు ఉన్నాయా చూపించాలని సింఘ్వీని ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. ఏ కేసులోనైనా వాస్తవాలు వచ్చినప్పుడు మాత్రమే కోర్టు చట్టాన్ని వర్తింపజేస్తుందని.. చట్టం ఇప్పటికే స్పష్టంగా ఉందని.. తగిన సందర్భంలో కోర్టు దాన్ని అమలు చేస్తుందని తెలిపారు.

మధ్యప్రదేశ్‌ ఆర్వో తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ..  నామినేషన్ తిరస్కరణ అంశం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు రాదని, అందువల్ల ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టులో పిటిషన్ నిలవదని వాదించారు. ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాల జోక్యానికి ఆర్టికల్ 329 అడ్డుకట్ట వేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగింపు వరకు న్యాయ సమీక్ష పరిధికి బయట ఉంటుందని, ఏదైనా తప్పు జరిగితే అది ఎన్నికల ట్రైబ్యునల్‌లోనే సవాలు చేయాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మోహిందర్ సింగ్ గిల్ కేసు సహా పలు తీర్పులను ఆయన ప్రస్తావించారు.

విచారణ సందర్భంగా సాంకేతిక లోపం కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు నిలిచిపోయాయి. ఆ సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా కోర్టుకు వాదనలు వినిపించారు. అయితే ఈ జోక్యంపైనా సింఘ్వీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధారణంగా ఎన్నికల సంఘం అభ్యర్థి తరఫున వాదనలు వినిపించకూడదని ఆయన పేర్కొన్నారు. అయితే.. అన్ని వాదనలు పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఆర్వో నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని.. ఇలాంటివి జరిగినప్పుడు ఈసీని ఆశ్రయించాలని సూచిస్తూ.. పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తున్నట్లు తెలిపింది. 

సుప్రీం కోర్టు మీనాక్షి నటరాజన్‌కు గట్టి ఎదురుదెబ్బ..!

కాగా.. సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ స్పందించారు. ఇది తన వ్యక్తిగత పరాజయం కాదని, భారత ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి జరిగిన నష్టమని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం స్వతంత్రతపై తాను మొదటి నుంచే అనుమానాలు వ్యక్తం చేస్తున్నానని, అవి మరోసారి నిరూపితమయ్యాయని ఆమె అన్నారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయం వెనుక పారదర్శకత లేకపోవడాన్ని తాము ఎత్తిచూపామని, అయితే తమ వాదనలను సరైన విధంగా పరిగణనలోకి తీసుకోలేదని ఆమె అభిప్రాయపడ్డారు. మరోవైపు, తమ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించినందుకు మాత్రం ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement