Pension grant
-
చేయూత కోసం చాన్నాళ్లుగా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ‘చేయూత’పింఛన్ల మంజూరు కోసం పేదలకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2022 ఆగస్టు నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేయకపోవడంతో వీటిని కోరుకుంటున్న పేదల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొత్త పింఛన్ల దరఖాస్తునకు సంబంధించి 2022 ఆగస్టు నుంచే ఆసరా పింఛన్ల ఆన్లైన్ పోర్టల్ అందుబాటులో లేకుండా పోయింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత రెండున్నరేళ్లుగా వివిధ కేటగిరీల కింద కొత్త పింఛన్ల కోసం దాదాపు 19 లక్షల దాకా ప్రభుత్వానికి దరఖాస్తులు అందాయి. దాదాపు మూడున్నరేళ్లుగా కొత్త పింఛన్ల కోసం వివిధ కేటగిరీల వారు నిరీక్షిస్తున్నారు. వీటిలో అత్యధికంగా అంటే దాదాపు 12 లక్షల దాకా వృద్ధాప్య, నాలుగు లక్షల దాకా వితంతు, మూడులక్షల దాకా దివ్యాంగుల దరఖాస్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలోనే 70 వేలకు పైగా పింఛన్ దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తీసుకుంటున్న దరఖాస్తులన్నీ కలిపితే 19 లక్షలు ఉన్నట్టుగా సమాచారం. చేయూత ఇలా... చేయూత పథకం... వృద్ధులతోపాటు వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కారి్మకులు, వృద్ధ కళాకారులు, డయాలసిస్ పేషెంట్లకు భరోసానిస్తోంది. ఉమ్మడి ఏపీలో 2004–14 మధ్య పదేళ్ల కాలంలో పింఛన్ల కోసం రూ.5,558 కోట్లు ఖర్చుచేయగా... తెలంగాణ ఏర్పడ్డాక... 2014–23 ఏళ్ల మధ్య ఆసరా పథకం కింద రూ.61,526 కోట్లు వ్యయం చేశారు. ప్రస్తుతం వృద్ధాప్య ఇతర కేటగిరీల పింఛనుదారులకు నెలకు రూ.2,016 చెల్లిస్తుండగా, దివ్యాంగులకు రూ.4,016 అందజేస్తున్నారు. 2014 వరకు పింఛన్లు పొందే లబ్ధిదారులు 29,21,828 మంది ఉన్నారు. 2023 డిసెంబర్ నాటికి వివిధ కేటగిరీల ఆసరా పింఛ¯న్దారుల సంఖ్య 43,20,551కు పెరిగింది. వివిధ కేటగిరీల కింద పింఛన్ పొందే వారి మరణాలు, అనర్హతలు, ఇతర కారణాల వల్ల 3.05 లక్షల పింఛన్లను తొలగించినట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని కేటగిరీల కింద పింఛన్ పొందుతున్న వారు 41,02,818 ఉన్నట్టుగా తెలుస్తోంది. -
బతికున్నప్పుడు దరఖాస్తు.. చనిపోయాక పెన్షన్
కాప్రా, హైదరాబాద్: బతికున్నంత కాలం కాసింత ‘ఆసరా’ కోసం తపించారు. తీరా ఆ ఆశ తీరకుండానే చనిపోయాక వారికి పెన్షన్లు మంజూరయ్యాయి. దీంతో నివ్వెరపోవడం బాధిత కుటుంబాల వంతైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాప్రా సర్కిల్లో 2022లో పెన్షన్ కోసం పలువురు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 191 మందికి పెన్షన్ మంజూరైనట్లు తాజాగా సర్కిల్ అధికారులకు జాబితా చేరింది. కాగా ఈ జాబితాలో 32 మంది మృతుల పేర్లు కూడా ఉన్నాయని అధికార వర్గాల సమాచారం. బతికున్నప్పుడు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. చనిపోయాక వారి పేరున మంజూరైంది. 191 మందితో జాబితా సర్కిల్ కార్యాలయానికి చేరడంతో సంబంధిత అధికారులు వారికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. ‘మీకు పెన్షన్ వస్తుంది.. బ్యాంక్ ఖాతా తనిఖీ చేసుకోండి’ అని లబ్ధిదారులకు ఫోన్ చేసి చెబుతున్నారు. కాగా, వారిలో కొందరు చనిపోయినట్లు వారి కుటుంబసభ్యులు చెప్పారని అధికార వర్గాలు వెల్లడించాయి. -
వికలాంగ సర్టిఫికెట్ ఉన్నా పింఛన్ ఇస్తలేరు
సంగారెడ్డి అర్బన్: చెవిటి, మూగనైన తనకు హైదరాబాద్‌లోని ఈఎన్టీ ఆస్పత్రి అధికారులు ధ్రువపత్రం ఇచ్చినా పింఛన్ ఇవ్వడం లేదని తనకు పింఛన్ మంజూరు చేయాలని దుబ్బాక మండలం పెద్దగుండవెల్లికి చెందిన దండు కుమారస్వామి కోరారు. సోమవారం ప్రజావిజ్ఞప్తుల దినంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీదారులు సంబంధితాధికారులకు అర్జీలను అందజేశారు. వికలాంగురాలైన తాను నిరుపేద కుటుంబంలో జన్మించానని గత 15 సంవత్సరాలుగా సొంత ఇంటి కొరకై పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని, ఇల్లు మంజూరు చేయాలని రామచంద్రాపురానికి చెందిన డి.వెంకటేశ్వరమ్మ జేసీ శరత్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో జేసీ మండలంలోని ఏదైనా ఒక గ్రామంలో ఆమెకు ఇల్లు మంజూరు చేయాలని తహాశీల్దార్‌ను ఆదేశించారు. పటాన్చెరు మండలం పెద్ద కంజర్ల గ్రామం బామన్ల కుంట చెరువును చెరువును తప్పుడు సేల్‌డీడ్‌తో 32 మంది వ్యక్తులు తప్పుడు హద్దులు చూపించి అక్రమించుకున్నారని ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని గొల్ల నిమ్మలయ్య జొన్నాడ క్రిష్టా యాదవ్, శివరాజ్ ఫిర్యాదు చేశారు. సదాశివపేట మండలం బొబ్బిలిగామ గ్రామానికి చెందిన గౌటాన్ భూమిలో దళితులైన తమకు మూడెకరాల చొప్పున వ్యవసాయ భూమి ఇవ్వాలని గ్రామానికి చెందిన నర్సమ్మ, ఎల్లమ్మ, యశోద, మంజుల తదితరులు కోరారు. అనంతరం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓటర్ల అవగాహన వాహనానికి జేసీ శరత్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్వో దయానంద్ పాల్గొన్నారు.


