pc george
-
చరిత్ర సృష్టించకపోగా.. నవ్వుల పాలయ్యారు!
ఎన్నికల టైంలో సవాళ్లు.. ప్రతి సవాళ్లు సాధారణంగా కనిపించే వ్యవహారమే. అయితే అది అతిగా ఉంటేనే జనాల్లో నవ్వుల పాలయ్యేది. కేరళలో ఇప్పుడు ఆ తండ్రీ కొడుకులది అదే తరహా పరిస్థితి. ఎలక్షన్ టైంలో ఈ ఇద్దరూ తమ నోటికి పని చెప్పడంతో.. వాళ్ల కలను తారుమారు చేసి ఓటర్లు తగిన బుద్ధి చెప్పారు!.. పీసీ జార్జ్.. కేరళ రాజకీయాలపై నాలుగు దశాబ్దాలుగా ప్రభావం చూపించిన నేత. పూన్జార్ నియోజవకర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన వ్యక్తి. కేరళ కాంగ్రెస్(జోసెఫ్ గ్రూప్), అటుపై ఇండిపెండెంట్ అభ్యర్థిగానూ నెగ్గిన ట్రాక్ రికార్డు ఆయనది. అలాంటి వ్యక్తి సొంత పార్టీ పెట్టాడు. ఓటమి చవిచూశాడు. తన పార్టీని బీజేపీలో విలీనం చేశాడు. బీజేపీ నుంచి పోటీ చేసి తాను ఓడడమే కాదు.. తన తనయుడ్ని ఓడగొట్టారు. పీసీ జార్జ్ ఎన్నికల ముందు తన విజయంపై ఎంతలా ధీమా వ్యక్తం చేశారంటే.. ‘‘నేను పూన్జార్లో భారీ మెజారిటీతో గెలుస్తా. నేనే కాదు.. బీజేపీ తరఫున పోటీ చేస్తున్నా. నా తనయుడు షోన్ జార్జ్ కూడా గెలుస్తాడు. మేం ఇద్దరం కేరళ అసెంబ్లీలో అడుగుపెట్టిన తండ్రీకొడుకులుగా చరిత్ర సృష్టిస్తాం. ఎవరికైనా సందేహం ఉంటే ఒక కోటి రూపాయల పందానికి రెడీ’’ అంటూ సవాల్ విసిరాయాన. కట్ చేస్తే.. పూన్జార్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పీసీ జార్జ్ చిత్తుగా ఓడారు. అక్కడ యూడీఎఫ్ అభ్యర్థి ఎం.జె. సెబాస్టియన్ నెగ్గారు. ఎల్డీఎఫ్ అభ్యర్థి సెబాస్టియన్ కులతుంకల్ రెండో స్థానంలో నిలవగా.. పీసీ జార్జ్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇటు పాళాలో షోన్ జార్జ్‌కు వరుసగా రెండోసారి పరాభవం తప్పలేదు. 2021లో కేరళ కాంగ్రెస్(ఎం) ఎమ్మెల్యే జోస్ కే మణి రాజ్యసభకు వెళ్లారు. ఆ స్థానంలో ఉప ఎన్నిక జరగ్గా.. షోన్ జార్జ్ ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. అయితే.. మణి సి కప్పన్ చేతిలో షోన్ ఓడారు. ఇప్పుడు ఎన్డీయే అభ్యర్థిగా మరోసారి పోటీ చేసినా షోన్ నెగ్గలేకపోయారు. మళ్లీ మణి సి కప్పన్ నెగ్గగా.. ఇక్కడ కూడా షోన్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. దీంతో ఆ తండ్రీకొడుకుల మీద ‘కోటి రూపాయలెక్కడ?’ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. పీసీ జార్జ్ ఒకప్పుడు కేరళ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతనే. అయితే గత కొంతకాలంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నానుతూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా మతపరంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలు ఎదుర్కొనేలా చేశాయి. ఒకవైపు బీజేపీ కేరళలో క్రిస్టియన్ కమ్యూనిటీని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే.. ఈ తండ్రీకొడుకులు మాత్రం తమ నోటికి పని చెబుతూ ముస్లిం ఓట్లను దూరం చేశారు. దీంతో.. బీజేపీకి ముస్లిం ఓటు బ్యాంకు దూరంగా ఉండడంతో పాటు ఒకేసారి కేరళ అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న ఆ తండ్రీకొడుకుల కల చెదిరినట్లైంది. అయితే గత ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ.. ఈ ఎన్నికల్లో మూడు సీట్లు గెల్చుకోవడం ఆ పార్టీకి కాస్త ఊరట ఇచ్చే అంశమే!. -
PC George: ప్రముఖ మలయాళ నటుడు కన్నుమూత
ప్రముఖ మలయాళ నటుడు పీసీ జార్జి(74) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన త్రిసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. పోలీసు అధికారిగా మంచిపేరు తెచ్చుకున్న ఆయన.. పదవి విరమణ తర్వాత పూర్తి స్థాయిలో సినిమాలపై దృష్టిపెట్టాడు. పలు మలయాళ చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించారు. ‘అంబ అంభిక అంబాలిక’తో సినీ ఎంట్రీ ఇచ్చారు. ఒకవైపు పోలీసు అధికారిక బాధ్యలు నిర్వర్తిస్తూనే అప్పుడప్పుడు సినిమాల్లో నటించేవాడు. 1988లో మమ్ముట్టి నటించిన 'సంఘం' చిత్రం పీసీ జార్జికి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ నటుడిగా ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. పీసీ జార్జి సుమారు 75 చిత్రాల్లో నటించారు. శనివారం త్రిసూరులో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. చదవండి: కరోనాతో నంద్యాల రవి కన్నుమూత -
మాజీ భార్యే స్కెచ్ వేసి ఇరికించింది
సాక్షి, తిరువనంతపురం : భావన కిడ్నాప్, లైంగిక దాడి కేసు ఉదంతంలో నటుడు, ఎమ్మెల్యే పీసీ జార్జ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దిలీప్ అమాయకుడని.. అతన్ని ఈ కేసులో అనవసరంగా ఇరికించారని అంటున్నారు. మనోరమ ఆన్లైన్ ఇంటర్వ్యూలో జార్జీ మాట్లాడుతూ.. అతని మాజీ భార్య మంజూ వారియర్ దీనంతటికి కారణమన్నారు. ‘‘ఆమెకు దిలీప్ నుంచి విడిపోవటం ఇష్టం లేదు. కానీ, వేరే మార్గం లేక విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు అవకాశం దొరకటంతో పథకం పన్ని దిలీప్‌ను ఇరికించి ప్రతీకారం తీర్చుకుంది. మంజు మంచి నటే కావొచ్చు. కానీ, అంతకు మించి కఠిన హృదయం కలది’’ అని జార్జ్ చెప్పారు. దిలీప్‌కు ఇంత అండగా ఎందుకు నిలుస్తున్నారన్న ప్రశ్నకు... ఏ తప్పు చెయ్యని ఓ వ్యక్తి 90 రోజులు జైలు శిక్ష అనుభవించాడు. ధర్మం గెలిచి తీరాలన్న ఒకే ఉద్దేశ్యంతో తాను అతని తరపున నిల్చున్నానని.. అందు కోసం ఎక్కడిదాకా అయినా వెళ్తానని జార్జ్ బదులిచ్చారు. కాగా, జార్జ్ ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని మంజు అంటున్నారు. పుంజార్ ఎమ్మెల్యే పీసీ జార్జ్ ఈ కేసులో మొదటి నుంచి దిలీప్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అంతకు నటి భావనను లక్ష్యంగా చేసుకుని ఆయన మాటల దాడి చేశారు. అంత పెద్ద దాడి జరిగితే మరుసటి రోజు షూటింగ్ కు వెళ్లటమేంటని ఆయన ప్రశ్నించారు. దీంతో భావన తనను జార్జ్ అవమానిస్తున్నారంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఓ లేఖ రాసింది. -
భోజనం లేటైందని.. కొట్టిన ఎమ్మెల్యే
తనకు భోజనం వడ్డించడం 20 నిమిషాలు ఆలస్యమైందని.. క్యాంటీన్లో పనిచేసే పార్ట్ టైం సర్వర్‌ను ఓ ఎమ్మెల్యే చెంపమీద కొట్టారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఎమ్మెల్యే పీసీ జార్జ్ తనను కొట్టారని ఆ కార్మికుడు స్థానిక మీడియా వద్ద వాపోయాడు. అయితే దీనిపై అతడు ఎవరికీ ఫిర్యాదు మాత్రం చేయలేదు. తాను ఎవరినీ కొట్టలేదని, అనవసరంగా తన పేరు ఇందులో ఇరికించినందుకు స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే జార్జ్ అంటున్నారు. తాను ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లేసరికి ఆయన ఓ మహిళను తిడుతున్నారని, తనను చూసేసరికి తనను కూడా తిట్టారని మను అనే ఆ కార్మికుడు చెప్పాడు. తిట్టాల్సిన అవసరం ఏమీ లేదని తాను చెప్పగా చెంపమీద కొట్టారని ఆరోపించాడు. కొట్టాయం జిల్లాలోని పూంజర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జార్జ్ (65) ఈ ఆరోపణలను ఖండించారు. తాను మధ్యాహ్నం 1.30కి భోజనం కావాలని చెప్పానని, 2.05 అయినా అది రాలేదని జార్జ్ అన్నారు. మరీ ఆలస్యం అవుతుండటంతో క్యాంటీన్ సూపర్వైజర్గా పనిచేస్తున్న మహిళను పిలిచి అడగ్గా, అప్పటికే పంపానని ఆమె చెప్పారన్నారు. ఇలాంటి పనికిమాలిన వాళ్లను తీసుకోకూడదని ఆమెకు చెబుతుండగా ఈ కుర్రాడు వచ్చాడని, సూపర్వైజర్ను తిట్టడంతో అతడు కోపగించుకున్నాడని, తాను అతడిని తిట్టి బయటకు పంపేశాను తప్ప కొట్టలేదని జార్జ్ వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై తాను స్పీకర్ శ్రీరామకృష్ణన్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు.


