ఎన్నికల టైంలో సవాళ్లు.. ప్రతి సవాళ్లు సాధారణంగా కనిపించే వ్యవహారమే. అయితే అది అతిగా ఉంటేనే జనాల్లో నవ్వుల పాలయ్యేది. కేరళలో ఇప్పుడు ఆ తండ్రీ కొడుకులది అదే తరహా పరిస్థితి. ఎలక్షన్ టైంలో ఈ ఇద్దరూ తమ నోటికి పని చెప్పడంతో.. వాళ్ల కలను తారుమారు చేసి ఓటర్లు తగిన బుద్ధి చెప్పారు!..
పీసీ జార్జ్.. కేరళ రాజకీయాలపై నాలుగు దశాబ్దాలుగా ప్రభావం చూపించిన నేత. పూన్జార్ నియోజవకర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన వ్యక్తి. కేరళ కాంగ్రెస్(జోసెఫ్ గ్రూప్), అటుపై ఇండిపెండెంట్ అభ్యర్థిగానూ నెగ్గిన ట్రాక్ రికార్డు ఆయనది. అలాంటి వ్యక్తి సొంత పార్టీ పెట్టాడు. ఓటమి చవిచూశాడు. తన పార్టీని బీజేపీలో విలీనం చేశాడు. బీజేపీ నుంచి పోటీ చేసి తాను ఓడడమే కాదు.. తన తనయుడ్ని ఓడగొట్టారు.
పీసీ జార్జ్ ఎన్నికల ముందు తన విజయంపై ఎంతలా ధీమా వ్యక్తం చేశారంటే.. ‘‘నేను పూన్జార్‌లో భారీ మెజారిటీతో గెలుస్తా. నేనే కాదు.. బీజేపీ తరఫున పోటీ చేస్తున్నా. నా తనయుడు షోన్ జార్జ్ కూడా గెలుస్తాడు. మేం ఇద్దరం కేరళ అసెంబ్లీలో అడుగుపెట్టిన తండ్రీకొడుకులుగా చరిత్ర సృష్టిస్తాం. ఎవరికైనా సందేహం ఉంటే ఒక కోటి రూపాయల పందానికి రెడీ’’ అంటూ సవాల్ విసిరాయాన.
కట్ చేస్తే.. పూన్జార్‌లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పీసీ జార్జ్ చిత్తుగా ఓడారు. అక్కడ యూడీఎఫ్ అభ్యర్థి ఎం.జె. సెబాస్టియన్ నెగ్గారు. ఎల్‌డీఎఫ్ అభ్యర్థి సెబాస్టియన్ కులతుంకల్ రెండో స్థానంలో నిలవగా.. పీసీ జార్జ్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇటు పాళాలో షోన్ జార్జ్‌కు వరుసగా రెండోసారి పరాభవం తప్పలేదు.
2021లో కేరళ కాంగ్రెస్(ఎం) ఎమ్మెల్యే జోస్ కే మణి రాజ్యసభకు వెళ్లారు. ఆ స్థానంలో ఉప ఎన్నిక జరగ్గా.. షోన్ జార్జ్ ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. అయితే.. మణి సి కప్పన్ చేతిలో షోన్ ఓడారు. ఇప్పుడు ఎన్డీయే అభ్యర్థిగా మరోసారి పోటీ చేసినా షోన్ నెగ్గలేకపోయారు. మళ్లీ మణి సి కప్పన్ నెగ్గగా.. ఇక్కడ కూడా షోన్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. దీంతో ఆ తండ్రీకొడుకుల మీద ‘కోటి రూపాయలెక్కడ?’ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది.
పీసీ జార్జ్ ఒకప్పుడు కేరళ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతనే. అయితే గత కొంతకాలంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నానుతూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా మతపరంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలు ఎదుర్కొనేలా చేశాయి. ఒకవైపు బీజేపీ కేరళలో క్రిస్టియన్ కమ్యూనిటీని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే.. ఈ తండ్రీకొడుకులు మాత్రం తమ నోటికి పని చెబుతూ ముస్లిం ఓట్లను దూరం చేశారు. దీంతో.. బీజేపీకి ముస్లిం ఓటు బ్యాంకు దూరంగా ఉండడంతో పాటు ఒకేసారి కేరళ అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న ఆ తండ్రీకొడుకుల కల చెదిరినట్లైంది. అయితే గత ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ.. ఈ ఎన్నికల్లో మూడు సీట్లు గెల్చుకోవడం ఆ పార్టీకి కాస్త ఊరట ఇచ్చే అంశమే!.


