breaking news
O Paneer selvam
-
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం
సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళనాడు అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)తో సీపీఐ,సీపీఎం వంటి వామపక్షాలతో పాటు పదికిపైగా పార్టీలు పొత్తును కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం ఓ పన్నీరు సెల్వం (ops)..సీఎం స్టాలిన్‌తో భేటీ అయారు. ఇరువురి భేటీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది.ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం(aiadmk)నుంచి బహిష్కరణకు గురైన సీఎం ఓ.పన్నీరు సెల్వం శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను కలిశారు. అసెంబ్లీ ప్రస్తుత సమావేశం చివరి రోజున ఓపీఎస్‌తో పాటు ఆయన తనయుడు మాజీ ఎంపీ రవీంద్రనాథ్‌తో కలిసి స్టాలిన్‌ను కలిశారు. స్టాలిన్ గెలుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు అనంతరం, డీఎంకే పాలనపై ఓపీఎస్ ప్రశంసల వర్షం కురిపించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ డీఎంకే గెలుస్తోందని వ్యాఖ్యానించారు. డీఎంకే పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందని అన్నారు. ఓపీఎస్ చేసిన ఈ పొలిటికల్ కామెంట్స్ తమిళనాట రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. ఈ భేటీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు కొత్త కూటమి అవకాశాలపై ఊహాగానాలకు దారితీసింది.ఒకప్పుడు సీఎం.. ఇప్పుడు రాజకీయ నిరుద్యోగిఏఐఏడీఎంకే హయాంలో ఓపీఎస్ సీఎంగా పనిచేశారు. ఇప్పుడు ఆ పార్టీతో విభేదాలు, ఓపీఎస్ అనుచరులు డీఎంకే, ఏఐఏడీఎంకేలో చేరిపోయారు. ఏఐఏడీఎంకేలో బహిష్కరణకు గురైన ఓపీఎస్ తిరిగి చేరేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎన్డీఏలో తిరిగి చేరాలన్న యత్నం కూడా ఫలించలేదు. గత ఏడాది బీజేపీతో విభేదాల కారణంగా ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఓపీఎస్ రాజకీయ భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. ఈ క్రమంలో స్టాలిన్‌ను ఓపీఎస్ కలవడం ఆసక్తికరంగా మారింది.ఒకే దెబ్బకు రెండు పిట్టలుఅయితే,ఓపీఎస్,ఎంకే స్టాలిన్ సమావేశంపై విశ్లేషకులు భవిష్యత్తు రాజకీయాల్ని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం వల్ల ఎవరికీ లాభం, ఎవరికీ నష్టం అన్నది విశ్లేషిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఓపీఎస్‌ను చేర్చుకోవడం ద్వారా డీఎంకే, ఏఐడీఎంకేలోని అసంతృప్తుల్ని తనవైపుకు తిప్పుకోవచ్చు. ఓపీఎస్‌కు ఉన్న వ్యక్తిగత మద్దతు, ఆయన అనుచరుల ఓటు బ్యాంక్ డీఎంకేకి చేరితే వచ్చే ఎన్నికల్లో అదనపు బలం లభిస్తుంది. ఓపీఎస్‌ను కూటమిలో చేర్చుకోవడం డీఎంకేకి వ్యూహాత్మకంగా లాభదాయకం. అదే సమయంలో డీఎంకేతో చేరితే ఓపీఎస్‌కు ఆయన కుమారుడికి రాజకీయ పునరావాసం లభిస్తుంది. ఓపీఎస్‌కు ఇది ఒక కొత్త మార్గం, కొత్త అవకాశంగా మారొచ్చు.ఓపీఎస్-డీఎంకే భేటీ ప్రతిపక్ష ఏఐఏడీఎంకి పెద్ద దెబ్బ. ఇప్పటికే ఓపీఎస్ అనుచరులు డీఎంకే, ఏఐడీఎంకేలలో చేరిపోయారు. ఓపీఎస్.. డీఎంకేతో కూటమి కుదుర్చుకుంటే, ఏఐఏడీఎంలోని విభేదాలు మరింత పెరుగుతాయి. ఇది ఏఐడీఎంకే ఓటు బ్యాంక్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది.ఓపీఎస్.. ఎన్డీఏ నుంచి బయటకు రావడం బీజేపికి నష్టం. ఓపీఎస్.. డీఎంకేలో చేరితే, బీజేపీకి తమిళనాడులో మిత్రపక్షం కోల్పోయినట్టే. ఇది ఎన్డీయే వ్యూహానికి ప్రతికూల ప్రభావం చూపుతుంది.మొత్తానికి సీఎం ఎంకే స్టాలిన్‌తో మాజీ సీఎం ఓ పన్నీరు సెల్వం కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీసింది. అదే సమయంలో ఏఐఏడీఎకే, బీజేపీలకు నష్టం. ఓపీఎస్ డీఎంకేలో చేరుతారా? లేక ఎన్డీయే కూటమితో చర్చలు జరుపుతారా? అన్న అంశంపై స్పష్టత లేదు. అయినప్పటికీ, ఈ పరిణామం రాబోయే ఎన్నికల ముందు తమిళనాడు రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. -
ఆ వైభవం తిరిగొస్తుందా?
గత అక్టోబర్‌లో యాభై ఏళ్ళు నిండినప్పుడు అందరూ ఆగిచూసిన దక్షిణాది ప్రాంతీయ పార్టీ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకె)కు మంచి రోజులు రానున్నాయా? అప్పట్లో ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకె)తో సరిపడక హీరో ఎమ్జీఆర్ బయటకొచ్చి స్థాపించిన ఈ పార్టీపై పట్టు కోసం కోర్టులో పోరు కొలిక్కి వచ్చినట్టేనా? పార్టీ నుంచి తనను బహిష్కరించడాన్నీ, తన ప్రత్యర్థి – మాజీ సీఎం ఈడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడాన్నీ సవాలు చేస్తూ మాజీ సమన్వయకర్త ఓ. పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) వేసిన పిటిషన్లను మద్రాస్ హైకోర్ట్ మంగళవారం తోసిపుచ్చింది. కోర్టులో ఓపీఎస్‌కు ఎదురుదెబ్బ ఇది వరుసగా మూడోసారి. తీర్పుపై అప్పీలుకు అవకాశం ఉన్నా, ఆయన రాజకీయ పునరాగమనానికి దారులు మూసుకుపోతున్నట్టే అనిపిస్తోంది. కేడర్‌పై విస్తరించిన పట్టు, కీలక స్థానాల్లో నమ్మినబంట్ల నియామకం, సమర్థ పరిపాల కుడిగా సాధించిన పేరు, తాజా కోర్టు తీర్పుతో... పార్టీ పగ్గాలు ఈపీఎస్ చేతికి దాదాపు వచ్చినట్టే. ఇది పార్టీ పునర్వైభవానికి దోహదమవుతుందా అన్నదే ఇక మిగిలిన ప్రశ్న. అధినేత్రి జయలలిత మరణానంతరం క్రమంగా కష్టాల్లో పడ్డ అన్నాడీఎంకె గత రెండేళ్ళలో తేవర్లు, గౌండర్లు, వగైరా కులాల కుంపట్లతో ఒకటికి నాలుగు (ఈపీఎస్, ఓపీఎస్, పదవీచ్యుత ప్రధాన కార్యదర్శి శశికళ, ఆమె మేనల్లుడు – ఏఎంఎంకె అధినేత టీటీవీ దినకరన్) వర్గాలైంది. సాంప్రదాయికంగా అన్నాడీఎంకెకు పట్టున్న రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో నిరుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకె పాగా వేసింది. మహిళలు, వెనుకబడిన వర్గాలు, అగ్రవర్ణాల ఓటు బ్యాంక్ క్రమంగా చెదిరిపోతోంది. ఈపీఎస్, ఓపీఎస్ శిబిరాల మధ్య పోరుతో పార్టీ దశ, దిశ కోల్పోయి బలహీనపడ్డ సమయంలో కోర్ట్ తీర్పు అయాచిత వరమే. పేరుకు ప్రధాన ప్రతిపక్షమైనా వర్గ విభేదాలు, పార్టీకి సారథి ఎవరో తెలియని అయోమయం, ఎన్నికల చిహ్నం రెండాకులపై పోరాటం సాగుతున్న వేళ ఈ తీర్పు పార్టీ ప్రస్థానానికి దిశానిర్దేశమే. కోర్టు ఆదేశాలు ఈపీఎస్ వర్గానికి నైతికంగా పెద్ద అండ. నిజానికి, దివంగత జయలలితనే పార్టీ శాశ్వత అధినేత్రిగా ప్రకటించాలన్నది ఓపీఎస్ వర్గం దీర్ఘకాలిక డిమాండ్. ఇప్పుడీ తీర్పుతో వారి డిమాండ్‌కు గండిపడింది. ఈపీఎస్ మద్దతుదారులు తమ నేతను శాశ్వత ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొని, పార్టీని మళ్ళీ పట్టాలెక్కించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ ఫిబ్రవరిలో సుప్రీం కోర్ట్ సానుకూలంగా ఇచ్చిన తీర్పూ వారికి కలిసొచ్చే అంశం. ఇప్పటికే పార్టీ జనరల్ కౌన్సిల్లో, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెజారిటీ సభ్యుల మద్దతు ఈపీఎస్‌కే ఉంది గనక ఈపీఎస్ యథేచ్ఛగా ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవచ్చు. సదరు సమావేశాల్లో పార్టీలో ఓపీఎస్ లాంటి ప్రత్యర్థుల్ని ఇంటికి సాగనంపుతూ తీర్మానాలు చేసే వీలు చిక్కుతుంది. అవసరాన్ని బట్టి పార్టీ రాజ్యాంగాన్నీ సవరించుకోవచ్చు. ఇవన్నీ ఈపీఎస్‌కు కలిసొచ్చే అంశాలు. ఇల్లలకగానే పండగ కాదనట్టు ఈపీఎస్‌కు అనేక సవాళ్ళు ముందున్నాయి. దాదాపు 1.5 కోట్ల మంది కార్యకర్తలున్న పార్టీని ఒంటరి దళపతిగా ఆయన ముందుకు నడపాలి. పార్టీకి మునుపు సారథ్యం వహించిన ఎమ్జీఆర్, జయలలిత లాంటి దిగ్గజాలకున్న ఇమేజ్, ప్రాచుర్యం ఈపీఎస్‌కు లేవు. వారిలా జనాకర్షణ, మాటే శాసనంగా పార్టీని నడిపే పట్టు ఆయన నుంచి ఆశించలేం. సొంత గూటి సంగతి పక్కన పెడితే, ప్రత్యర్థి పార్టీ అయిన డీఎంకెతో ఢీ అంటే ఢీ అనాలంటే ముందుగా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా జనంలో పార్టీపై నమ్మకం పెంపొందించాలి. మరోపక్క 2019 లోక్‌సభ ఎన్నికల్లో, 2021 తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో విజయాలతో డీఎంకెను ముందుకు నడిపిన ఘనత స్టాలిన్‌ది. బలమైన ఈ ప్రత్యర్థితో తలపడడం ఈపీఎస్‌కు ఈజీ కాదు. తమిళ రాజకీయాలెప్పుడూ డీఎంకె, అన్నాడీఎంకెల మధ్య... కరుణానిధి, జయలలితల మధ్య ఊగడం రివాజు. ఆ రాజకీయ దృశ్యం ఇప్పుడు గణనీయంగా మారింది. చిరకాలంగా తమిళ రాజకీయాలకు దిక్సూచైన ద్రావిడ సిద్ధాంతం క్రమంగా కుంచించుకుపోతోంది. ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులను (గవర్నర్ రవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై) 2021లో బరిలోకి దింపి, డీఎంకె వ్యతిరేక, హిందూత్వ జాతీయవాద వైఖరితో బీజేపీ కాలు దువ్వుతోంది. అలాగే, జయ మరణానంతరం అన్నాడీఎంకెకు పెద్దన్నగా వ్యవహరించిన బీజేపీ... ఆ పార్టీ బలహీనతల్ని వాటంగా చేసుకొని, జయ వదిలివెళ్ళిన స్థానంలో ప్రధాన ప్రతిపక్షంగా తాను కూర్చోవాలని శతధా ప్రయత్నిస్తోంది. పక్కనే పొంచివున్న ఈ ముప్పు పట్ల ఈపీఎస్ జాగరూకత వహించి, సమర్థంగా ఎదుర్కోవాలి. ఒక్కమాటలో– 39 పార్లమెంటరీ స్థానాలున్న తమిళనాట రానున్న 2024 లోక్‌సభ ఎన్నికలు ఈపీఎస్‌కు తొలి పెద్ద పరీక్ష. దానిలో పార్టీని బలంగా నిలబెట్టి, తర్వాత మరో రెండేళ్ళకు వచ్చే 234 స్థానాల శాసనసభా సమరంలో అధికారం చేజిక్కించుకునేలా పోరాడాలి. నిరుటి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకె కూటమి 159 స్థానాలు సాధిస్తే, 75 సీట్లకే పరిమితమైన అన్నాడీఎంకె కూటమి ఆ లెక్కను తిరగరాయాలి. అదే జరిగితే అధినేతగా ఈపీఎస్‌కు తిరుగుండదు. లేదంటే, అన్నాడీఎంకెలో మరోసారి అసమ్మతి స్వరాలు పైకొస్తాయి. రిటైరయ్యానని ప్రకటించిన జయలలిత నెచ్చెలి శశికళను మళ్ళీ తెర పైకి తేవాలనే మాటలు వినిపిస్తాయి. అందుకే, రాగల మూడేళ్ళ కాలం ఈపీఎస్‌కు పరీక్షా సమయం. మంచి మార్కులు తెచ్చుకుంటేనే ఆయనకైనా, అన్నాడీఎంకెకైనా భవిష్యత్తు! -
భక్తుడి నేతృత్వంలో కమిటీ
చెన్నై : అమ్మకు ఆగ్రహం వస్తే ఏమవుతుందో అందరికీ ఎరుకే. బడా మంత్రైనా, చోటా నేతైనా రాత్రికి రాత్రే వేటుకు గురికాక తప్పదు. సంజాయిషీలకు సైతం అవకాశం ఇవ్వకుండా వరుసగా మంత్రులపై వేటువేసుకుంటూ పోతున్న జయలలిత జాబితాలో మరి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నట్లు పార్టీశ్రేణులు చెబుతున్నాయి. అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వంలో సీఎం జయలలిత తరువాత స్థానం ఆర్థికమంత్రి ఓ పన్నీర్ సెల్వందే అనేది నిర్వివాదాంశం. పార్టీ అధినేత్రి జయలలితతో నేరుగా విన్నవించుకునే అవకాశం దాదాపుగా ఎవ్వరికీ దక్కదు. అందరూ అన్ని విషయాలు పన్నీర్‌సెల్వానికి చెప్పు కుంటే ఆయన ద్వారా అమ్మకు చేరుతాయి. సీఎం జయలలిత సైతం పన్నీర్‌సెల్వం నేతృత్వంలో మంత్రులు నత్తం విశ్వనాధం, వైద్యలింగం, ఏడప్పాడి పళనిస్వామి, పళనియప్పన్ తదితరులతో ఒక బృందాన్ని నియమించింది. ఈ బందృంతో మాత్రమే జయలలిత తన పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను చర్చిస్తారు. అలాగే క్రమశిక్షణ చర్యల కమిటీ సైతం ఈ మంత్రులు బృందం నేతృత్వంలోనే పనిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నేతలపై వస్తున్న ఫిర్యాదులను జయలలిత లేకుండా పరిష్కరిస్తారు. ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను సైతం మంత్రుల బృందమే నిర్వహిస్తోంది. ఇలా అన్ని విషయాల్లో మంత్రుల బృందంపైనే జయ ఆధారపడటం వల్ల నేతల ధోరణి మారిపోయింది. పార్టీ నిర్వాహకులు, నేతలు, కార్యకర్తలు, ప్రజల చుట్టూ తిరిగేకంటే ఈ ఐదుమంది మంత్రల చుట్టూ తిరిగేతేచాలు పదవులు కాపాడబడుతాయి, కొత్త పదవులు దక్కుతాయనే భావనకు వచ్చేశారు. గతంలోని జయలలిత పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో శశికళకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇటీవల కాలంలో శశికళను దూరంగా పెట్టిన జయలలిత ఆ స్థానాన్ని పన్నీర్‌సెల్వంకు అప్పగించారు. పన్నీర్‌సెల్వం సైతం శశికళను విభేదించేవారితో ఒక కూటమిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ కూటమిలో మంత్రల స్థాయి నుంచి క్షేతస్థాయి నేతల వరకు ఉన్నారు. కూటమిలోని వారిపై ఎటువంటి ఫిర్యాదు చేసినా క్రమశిక్షణ చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు ఇటీవల కాలంలో తలెత్తాయి. అంతేగాక తనకు పోటీగా ఎదుగుతాడనే అనుమానంతో మంత్రి వైద్యలింగంపై జయ వద్ద తరచూ ఆరోపణలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో పన్నీర్‌సెల్వం నడవడికపై ఓ కన్నేసి ఉంచాల్సిందిగా హోంశాఖకు సూచించగా, పన్నీర్‌సెల్వం షాడోసీఎంగా వ్యవహరిస్తున్నట్లు వారు సీఎంకు నివేదిక ఇచ్చారు. అంతేగాక కుమారులతో రాజకీయ వారసులను సిద్ధం చేసుకోవడం, ప్రజాపనుల శాఖలో పన్నీర్‌సెల్వం కుమారుడి పెత్తనం కూడా జయ దృష్టికి వచ్చింది. అంతేగాక ఈ మంత్రుల బృందం రాష్ట్రంలోని పలువురు నేతలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు అమ్మ పరిశీలనలోకి వెళ్లాయి. మంత్రులు పన్నీర్‌సెల్వం, నత్తం విశ్వనాథం, పళనియప్పన్‌లు కలిసి సుమారు వందమంది వద్ద కోట్లరూపాయలను స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తనకు పూర్తిగా నమ్మకస్తులైన వారి జాబితాను సిద్ధం చేసుకున్న పన్నీర్‌సెల్వం వారికి టిక్కెట్లను ఖరారు చేసారని అంటున్నారు. ఈ కారణాలతో ముగ్గురు మంత్రులను చెన్నై వదిలి లేదా గార్డెన్ వదిలి వెళ్లరాదని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరాదని జయ ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. టికెట్ ఎరవేసి డబ్బులు గుంజే ఎమ్మెల్యేల జాబితాను సైతం సీఎం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇలా వివాదాస్పద ఎమ్మెల్యేల్లో పన్నీర్‌సెల్వం అనుచర ఎమ్మెల్యేలు అధికశాతం ఉన్నారని తెలుస్తోంది. అలాగే ఇతర మంత్రుల అనుచరుల ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కూడా కూడా ఉన్నారు. 90 మందిపై విచారణ సాగుతున్నట్లు తెలుస్తోంది.


