ఆ వైభవం తిరిగొస్తుందా?

Sakshi Editorial On Tamil Nadu Politics DMK AIDMK

గత అక్టోబర్‌లో యాభై ఏళ్ళు నిండినప్పుడు అందరూ ఆగిచూసిన దక్షిణాది ప్రాంతీయ పార్టీ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకె)కు మంచి రోజులు రానున్నాయా? అప్పట్లో ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకె)తో సరిపడక హీరో ఎమ్జీఆర్‌ బయటకొచ్చి స్థాపించిన ఈ పార్టీపై పట్టు కోసం కోర్టులో పోరు కొలిక్కి వచ్చినట్టేనా? పార్టీ నుంచి తనను బహిష్కరించడాన్నీ, తన ప్రత్యర్థి – మాజీ సీఎం ఈడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌)ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడాన్నీ సవాలు చేస్తూ మాజీ సమన్వయకర్త ఓ. పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) వేసిన పిటిషన్లను మద్రాస్‌ హైకోర్ట్‌ మంగళవారం తోసిపుచ్చింది.

కోర్టులో ఓపీఎస్‌కు ఎదురుదెబ్బ ఇది వరుసగా మూడోసారి. తీర్పుపై అప్పీలుకు అవకాశం ఉన్నా, ఆయన రాజకీయ పునరాగమనానికి దారులు మూసుకుపోతున్నట్టే అనిపిస్తోంది. కేడర్‌పై విస్తరించిన పట్టు, కీలక స్థానాల్లో నమ్మినబంట్ల నియామకం, సమర్థ పరిపాల కుడిగా సాధించిన పేరు, తాజా కోర్టు తీర్పుతో... పార్టీ పగ్గాలు ఈపీఎస్‌ చేతికి దాదాపు వచ్చినట్టే. ఇది పార్టీ పునర్వైభవానికి దోహదమవుతుందా అన్నదే ఇక మిగిలిన ప్రశ్న.

అధినేత్రి జయలలిత మరణానంతరం క్రమంగా కష్టాల్లో పడ్డ అన్నాడీఎంకె గత రెండేళ్ళలో తేవర్లు, గౌండర్లు, వగైరా కులాల కుంపట్లతో ఒకటికి నాలుగు (ఈపీఎస్, ఓపీఎస్, పదవీచ్యుత ప్రధాన కార్యదర్శి శశికళ, ఆమె మేనల్లుడు – ఏఎంఎంకె అధినేత టీటీవీ దినకరన్‌) వర్గాలైంది.

సాంప్రదాయికంగా అన్నాడీఎంకెకు పట్టున్న రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో నిరుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకె పాగా వేసింది. మహిళలు, వెనుకబడిన వర్గాలు, అగ్రవర్ణాల ఓటు బ్యాంక్‌ క్రమంగా చెదిరిపోతోంది.

ఈపీఎస్, ఓపీఎస్‌ శిబిరాల మధ్య పోరుతో పార్టీ దశ, దిశ కోల్పోయి బలహీనపడ్డ సమయంలో కోర్ట్‌ తీర్పు అయాచిత వరమే. పేరుకు ప్రధాన ప్రతిపక్షమైనా వర్గ విభేదాలు, పార్టీకి సారథి ఎవరో తెలియని అయోమయం, ఎన్నికల చిహ్నం రెండాకులపై పోరాటం సాగుతున్న వేళ ఈ తీర్పు పార్టీ ప్రస్థానానికి దిశానిర్దేశమే.

కోర్టు ఆదేశాలు ఈపీఎస్‌ వర్గానికి నైతికంగా పెద్ద అండ. నిజానికి, దివంగత జయలలితనే పార్టీ శాశ్వత అధినేత్రిగా ప్రకటించాలన్నది ఓపీఎస్‌ వర్గం దీర్ఘకాలిక డిమాండ్‌. ఇప్పుడీ తీర్పుతో వారి డిమాండ్‌కు గండిపడింది. ఈపీఎస్‌ మద్దతుదారులు తమ నేతను శాశ్వత ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొని, పార్టీని మళ్ళీ పట్టాలెక్కించాలని ఉవ్విళ్ళూరుతున్నారు.

ఈ ఫిబ్రవరిలో సుప్రీం కోర్ట్‌ సానుకూలంగా ఇచ్చిన తీర్పూ వారికి కలిసొచ్చే అంశం. ఇప్పటికే పార్టీ జనరల్‌ కౌన్సిల్‌లో, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో మెజారిటీ సభ్యుల మద్దతు ఈపీఎస్‌కే ఉంది గనక ఈపీఎస్‌ యథేచ్ఛగా ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవచ్చు. సదరు సమావేశాల్లో పార్టీలో ఓపీఎస్‌ లాంటి ప్రత్యర్థుల్ని ఇంటికి సాగనంపుతూ తీర్మానాలు చేసే వీలు చిక్కుతుంది. అవసరాన్ని బట్టి పార్టీ రాజ్యాంగాన్నీ సవరించుకోవచ్చు. ఇవన్నీ ఈపీఎస్‌కు కలిసొచ్చే అంశాలు. 

ఇల్లలకగానే పండగ కాదనట్టు ఈపీఎస్‌కు అనేక సవాళ్ళు ముందున్నాయి. దాదాపు 1.5 కోట్ల మంది కార్యకర్తలున్న పార్టీని ఒంటరి దళపతిగా ఆయన ముందుకు నడపాలి. పార్టీకి మునుపు సారథ్యం వహించిన ఎమ్జీఆర్, జయలలిత లాంటి దిగ్గజాలకున్న ఇమేజ్, ప్రాచుర్యం ఈపీఎస్‌కు లేవు. వారిలా జనాకర్షణ, మాటే శాసనంగా పార్టీని నడిపే పట్టు ఆయన నుంచి ఆశించలేం.

సొంత గూటి సంగతి పక్కన పెడితే, ప్రత్యర్థి పార్టీ అయిన డీఎంకెతో ఢీ అంటే ఢీ అనాలంటే ముందుగా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా జనంలో పార్టీపై నమ్మకం పెంపొందించాలి. మరోపక్క 2019 లోక్‌సభ ఎన్నికల్లో, 2021 తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో విజయాలతో డీఎంకెను ముందుకు నడిపిన ఘనత స్టాలిన్‌ది. బలమైన ఈ ప్రత్యర్థితో తలపడడం ఈపీఎస్‌కు ఈజీ కాదు.

తమిళ రాజకీయాలెప్పుడూ డీఎంకె, అన్నాడీఎంకెల మధ్య... కరుణానిధి, జయలలితల మధ్య ఊగడం రివాజు. ఆ రాజకీయ దృశ్యం ఇప్పుడు గణనీయంగా మారింది. చిరకాలంగా తమిళ రాజకీయాలకు దిక్సూచైన ద్రావిడ సిద్ధాంతం క్రమంగా కుంచించుకుపోతోంది. ఇద్దరు రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారులను (గవర్నర్‌ రవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై) 2021లో బరిలోకి దింపి, డీఎంకె వ్యతిరేక, హిందూత్వ జాతీయవాద వైఖరితో బీజేపీ కాలు దువ్వుతోంది.

అలాగే, జయ మరణానంతరం అన్నాడీఎంకెకు పెద్దన్నగా వ్యవహరించిన బీజేపీ... ఆ పార్టీ బలహీనతల్ని వాటంగా చేసుకొని, జయ వదిలివెళ్ళిన స్థానంలో ప్రధాన ప్రతిపక్షంగా తాను కూర్చోవాలని శతధా ప్రయత్నిస్తోంది. పక్కనే పొంచివున్న ఈ ముప్పు పట్ల ఈపీఎస్‌ జాగరూకత వహించి, సమర్థంగా ఎదుర్కోవాలి. 

ఒక్కమాటలో– 39 పార్లమెంటరీ స్థానాలున్న తమిళనాట రానున్న 2024 లోక్‌సభ ఎన్నికలు ఈపీఎస్‌కు తొలి పెద్ద పరీక్ష. దానిలో పార్టీని బలంగా నిలబెట్టి, తర్వాత మరో రెండేళ్ళకు వచ్చే 234 స్థానాల శాసనసభా సమరంలో అధికారం చేజిక్కించుకునేలా పోరాడాలి. నిరుటి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకె కూటమి 159 స్థానాలు సాధిస్తే, 75 సీట్లకే పరిమితమైన అన్నాడీఎంకె కూటమి ఆ లెక్కను తిరగరాయాలి.

అదే జరిగితే అధినేతగా ఈపీఎస్‌కు తిరుగుండదు. లేదంటే, అన్నాడీఎంకెలో మరోసారి అసమ్మతి స్వరాలు పైకొస్తాయి. రిటైరయ్యానని ప్రకటించిన జయలలిత నెచ్చెలి శశికళను మళ్ళీ తెర పైకి తేవాలనే మాటలు వినిపిస్తాయి. అందుకే, రాగల మూడేళ్ళ కాలం ఈపీఎస్‌కు పరీక్షా సమయం. మంచి మార్కులు తెచ్చుకుంటేనే ఆయనకైనా, అన్నాడీఎంకెకైనా భవిష్యత్తు! 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top