breaking news
Nations Cup
-
అజేయంగా నిలిచి... టైటిల్ గెలిచి...
ఆక్లాండ్: లీగ్ దశలో కనబరిచిన జోరును నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ కొనసాగించిన భారత మహిళల హాకీ జట్టు నేషన్స్ కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు 2–0 గోల్స్ తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. తద్వారా వచ్చే ప్రొ లీగ్ సీజన్లో ఆడే అవకాశాన్ని దక్కించుకుంది. తుది పోరులో భారత్ తరఫున నవ్‌నీత్ కౌర్ (4వ నిమిషంలో), సునెలితా టొప్పో (15వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. లీగ్ దశలో భారత జట్టు వరుసగా అమెరికా (3–2తో), జపాన్ (2–1తో), ఉరుగ్వే (3–2తో) జట్లపై గెలిచి... సెమీఫైనల్లో 6–0తో చిలీని ఓడించింది. నేషన్స్ కప్ టైటిల్ నెగ్గడం భారత్‌కిది రెండోసారి. 2022లోనూ టీమిండియా విజేతగా నిలిచింది. చాంపియన్ భారత జట్టు ప్రదర్శనకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి ప్లేయర్‌కు రూ. 3 లక్షల చొప్పున... శిక్షణ సిబ్బందికి రూ. 1 లక్ష 50 వేల చొప్పున నగదు పురస్కారం అందజేయనుంది. -
భారత్ ‘హ్యాట్రిక్’ విజయం
ఆక్లాండ్: మహిళల నేషన్స్ కప్ హాకీ టోర్నమెంట్ లీగ్ దశను భారత జట్టు అజేయంగా ముగించింది. గురువారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో సలీమా టెటె బృందం 3–2 గోల్స్ తేడాతో ఉరుగ్వే జట్టును ఓడించింది. భారత్ తరఫున దీపిక రెండు గోల్స్ (24వ, 56వ నిమిషాల్లో) చేయగా... దీపిక సోరెంగ్ (43వ నిమిషంలో) ఒక గోల్ సాధించింది. ఉరుగ్వే తరఫున చియారా అపెనినో (13వ నిమిషంలో), మాన్యుయెలా విలార్ (55వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఈ మ్యాచ్ ద్వారా భారత ప్లేయర్ నేహా కెరీర్లో 200 అంతర్జాతీయ మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. ‘హ్యాట్రిక్’ విజయం సాధించిన భారత జట్టు తొమ్మిది పాయింట్లతో గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. శనివారం జరిగే సెమీఫైనల్లో చిలీ జట్టుతో భారత్ తలపడుతుంది. -
సెమీఫైనల్లో భారత్
ఆక్లాండ్: మహిళల నేషన్స్ కప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. జపాన్ జట్టుతో గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. ఈ విజయంతో భారత జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆరు పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.భారత్ తరఫున కెప్టెన్ సలీమా టెటె (33వ నిమిషంలో), లాల్రెమ్సియామి (49వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. జపాన్ జట్టుకు అయ్ హిరామిత్సు (35వ నిమిషంలో) ఏకైక గోల్ అందించింది. ఈ మ్యాచ్‌తో భారత జట్టు మిడ్‌ఫీల్డర్ జ్యోతి తన కెరీర్లో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. -
సలీమా సారథ్యంలోనే...
న్యూఢిల్లీ: ఎనిమిది దేశాలు పాల్గొనే నేషన్స్ కప్ హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత మహిళల జట్టును మంగళవారం ప్రకటించారు. సలీమా టెటె నాయకత్వంలో పోటీ పడనున్న ఈ జట్టులో కొత్త ప్లేయర్లు లాల్తంత్లువాంగి, శిల్పి దబాస్లకు మరో అవకాశం దక్కింది. ఇటీవల ఆ్రస్టేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో కూడా లాల్తంగ్, శిల్పి జట్టులో భాగంగా ఉన్నా... ఒక్క మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగలేదు. ఆ్రస్టేలియాతో సిరీస్‌ను 2–2తో సమం చేసుకున్న జట్టును నడిపించిన సలీమా కెప్టెన్‌గా కొనసాగనుండగా... సీనియర్లు సవిత, బిచ్చు దేవి గోల్కీపర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ‘అనుభవజు్ఞలు, జూనియర్ల ప్లేయర్లతో సమతూకంగా జట్టును ఎంపిక చేశాం. ఇటీవల అర్జెంటీనా, ఆస్ట్రేలియా పర్యటనలతో మన జట్టు ప్రదర్శన మరింత మెరుగైంది. నిలకడగా రాణిస్తున్న టీమ్ నేషన్స్ కప్ సవాల్‌కు సిద్ధంగా ఉంది’ అని హెడ్ కోచ్ జోయెర్డ్ మరీన్ వ్యాఖ్యానించాడు. నేషన్స్ కప్ గ్రూప్ ‘ఎ’లో భారత్‌తో పాటు జపాన్, అమెరికా, ఉరుగ్వే ఉండగా...గ్రూప్ ‘బి’లో న్యూజిలాండ్, కొరియా, ఫ్రాన్స్, చిలీ బరిలోకి దిగనున్నాయి. జూన్ 15 నుంచి 21 వరకు న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. నేషన్స్ కప్ విజేత జట్టు తదుపరి సీజన్ ప్రొ లీగ్‌కు అర్హత సాధిస్తుంది. భారత జట్టు వివరాలు: సవిత, బిచ్చుదేవి (గోల్‌కీపర్లు); సుశీలా చాను, ఇషిక చౌధరీ, లాల్తంగ్లువాంగి, శిల్పి దబాస్, జ్యోతి, నిక్కీ ప్రధాన్ (డిఫెండర్లు); సలీమా టెటె, నేహ, సునేలిత టొప్పో, సాక్షి రాణా, దీపిక సొరెంగ్, సోనమ్, లాల్రెమ్సియామ్ (మిడ్‌ఫీల్డర్లు); నవనీత్ కౌర్, దీపిక, రుతుజా పిసాల్, ఇషిక, అన్ను (ఫార్వర్డ్స్). -
ఆస్ట్రేలియా పర్యటనకు భారత మహిళా జట్టు
ప్రొ హాకీ లీగ్‌లో మరోసారి స్థానం సంపాదించేందుకు భారత మహిళల హాకీ జట్టు సిద్ధమైంది. ప్రొ హాకీ లీగ్ అర్హత టోర్నీ అయిన నేషన్స్ కప్ జూన్ 15 నుంచి 21 వరకు న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలో జరగనుంది. నేషన్స్ కప్ సన్నాహాల కోసం భారత జట్టు ఈనెలలో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. పెర్త్ వేదికగా ఆ్రస్టేలియా జట్టుతో భారత జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. మే 26, 27 తేదీల్లో తొలి రెండు మ్యాచ్‌లు... మే 29, 30 తేదీల్లో మరో రెండు మ్యాచ్‌లు భారత్ ఆడుతుంది. ఈ సిరీస్ ముగిశాక భారత జట్టు న్యూజిలాండ్‌లో అడుగు పెడుతుంది. నేషన్స్ కప్ విజేత జట్టు తదుపరి ఏడాది ప్రొ హాకీ లీగ్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ప్రొ హాకీ లీగ్‌లో చివరి స్థానంలో నిలిచిన జట్టు మళ్లీ లీగ్‌లో స్థానం కోసం నేషన్స్ కప్‌లో బరిలోకి దిగుతుంది. 2022లో స్పెయిన్‌లో జరిగిన నేషన్స్ కప్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. 2024–2025 ప్రొ లీగ్‌లో పాల్గొనే అవకాశాన్ని సంపాదించింది. తొమ్మిది జట్లు పాల్గొన్న 2024–2025 ప్రొ లీగ్‌లో భారత జట్టు చ చివరి స్థానంలో నిలిచి మళ్లీ నేషన్స్ కప్‌కు పడిపోయింది. ఇటీవల అర్జెంటీనాలో పర్యటించిన భారత మహిళల జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. రెండింటిలో గెలిచింది. ఈ సిరీస్ తర్వాత బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో భారత జట్టుకు శిబిరం ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా, ఆ తర్వాత నేషన్స్ కప్‌లో భారత జట్టులోని డ్రాగ్ ఫ్లికర్లకు నెదర్లాండ్స్ దిగ్గజం టేకె టకేమా శిక్షణ ఇస్తారు. ‘నేషన్స్ కప్ సన్నాహాల కోసం ఆ్రస్టేలియాతో సిరీస్ ఏర్పాటు చేయడం బాగుంది. ఈ సిరీస్ ద్వారా భారత జట్టులోని బలాబలాలు, బలహీనతలు తెలుస్తాయి’ అని భారత జట్టు చీఫ్ కోచ్ జొయెర్డ్ మరీన్ తెలిపారు. చదవండి: ఆసియా క్రీడలకు భారత జట్టు ప్రకటన.. ‘నంబర్ వన్’కు చోటే లేదు!


