ప్రొ హాకీ లీగ్‌లో మరోసారి స్థానం సంపాదించేందుకు భారత మహిళల హాకీ జట్టు సిద్ధమైంది. ప్రొ హాకీ లీగ్ అర్హత టోర్నీ అయిన నేషన్స్ కప్ జూన్ 15 నుంచి 21 వరకు న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలో జరగనుంది. నేషన్స్ కప్ సన్నాహాల కోసం భారత జట్టు ఈనెలలో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.
పెర్త్ వేదికగా ఆ్రస్టేలియా జట్టుతో భారత జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. మే 26, 27 తేదీల్లో తొలి రెండు మ్యాచ్‌లు... మే 29, 30 తేదీల్లో మరో రెండు మ్యాచ్‌లు భారత్ ఆడుతుంది. ఈ సిరీస్ ముగిశాక భారత జట్టు న్యూజిలాండ్‌లో అడుగు పెడుతుంది. నేషన్స్ కప్ విజేత జట్టు తదుపరి ఏడాది ప్రొ హాకీ లీగ్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది.
ప్రొ హాకీ లీగ్‌లో చివరి స్థానంలో నిలిచిన జట్టు మళ్లీ లీగ్‌లో స్థానం కోసం నేషన్స్ కప్‌లో బరిలోకి దిగుతుంది. 2022లో స్పెయిన్‌లో జరిగిన నేషన్స్ కప్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. 2024–2025 ప్రొ లీగ్‌లో పాల్గొనే అవకాశాన్ని సంపాదించింది.
తొమ్మిది జట్లు పాల్గొన్న 2024–2025 ప్రొ లీగ్‌లో భారత జట్టు చ చివరి స్థానంలో నిలిచి మళ్లీ నేషన్స్ కప్‌కు పడిపోయింది. ఇటీవల అర్జెంటీనాలో పర్యటించిన భారత మహిళల జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. రెండింటిలో గెలిచింది. ఈ సిరీస్ తర్వాత బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో భారత జట్టుకు శిబిరం ఏర్పాటు చేశారు.
ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా, ఆ తర్వాత నేషన్స్ కప్‌లో భారత జట్టులోని డ్రాగ్ ఫ్లికర్లకు నెదర్లాండ్స్ దిగ్గజం టేకె టకేమా శిక్షణ ఇస్తారు. ‘నేషన్స్ కప్ సన్నాహాల కోసం ఆ్రస్టేలియాతో సిరీస్ ఏర్పాటు చేయడం బాగుంది. ఈ సిరీస్ ద్వారా భారత జట్టులోని బలాబలాలు, బలహీనతలు తెలుస్తాయి’ అని భారత జట్టు చీఫ్ కోచ్ జొయెర్డ్ మరీన్ తెలిపారు.
చదవండి: ఆసియా క్రీడలకు భారత జట్టు ప్రకటన.. ‘నంబర్ వన్’కు చోటే లేదు!


