ఆసియా క్రీడలకు భారత జట్టు ప్రకటన | Asian No.1 Shooter Zoravar Singh Sandhu Left Out As National Rifle Association Of India Prioritises Trials Over Rankings | Sakshi
Sakshi News home page

ఆసియా క్రీడలకు భారత జట్టు ప్రకటన.. ‘నంబర్‌ వన్‌’కు చోటే లేదు!

May 14 2026 9:21 AM | Updated on May 14 2026 10:27 AM

Asian Games 2026: India Team Announced No 1 Zoravar Singh Left Out

జొరావర్‌, కైనన్‌

భారత జట్టు ఎంపికలో ర్యాంకింగ్స్, అంతర్జాతీయ ప్రదర్శనలకంటే తమ సెలక్షన్‌ ట్రయల్స్‌కే ప్రాధాన్యతనిస్తామని భారత జాతీయ రైఫిల్‌ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) స్పష్టం చేసింది. ట్రయల్స్‌లో సత్తా చాటితేనే టీమ్‌లో చోటు దక్కుతుందని, ర్యాంక్‌ను పరిగణనలోకి తీసుకోమని ఏడాది క్రితం తాము రూపొందించిన విధానాన్ని వెల్లడించింది. 

‘నంబర్‌ వన్‌’కు చోటే లేదు!
ఈ ఏడాది సెప్టెంబర్‌–అక్టోబర్‌లలో జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ‘షాట్‌గన్‌’ టీమ్‌లను ఎన్‌ఆర్‌ఐఏ ప్రకటించింది. అయితే ఇందులో ఆసియా నంబర్‌వన్, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 6వ స్థానంలో ఉన్న ట్రాప్‌ షూటర్‌ జొరావర్‌ సింగ్‌ సంధూకు చోటు దక్కలేదు.

గత ఆరు నెలలుగా అంతర్జాతీయ స్థాయిలో అతను నిలకడగా రాణిస్తున్నా... ఇటీవల జాతీయ చాంపియన్‌షిప్, సెలక్షన్‌ ట్రయల్స్‌లోలో ప్రదర్శన బాగా లేకపోవడంతో జొరావర్‌ను తప్పించారు. నెల రోజుల క్రితమే జొరావర్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 4వ స్థానంలో ఉన్నాడు. 

గత అక్టోబర్‌లో వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన 47 ఏళ్ల జొరావర్‌ ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో పతకం నెగ్గిన మూడో భారత షూటర్‌గా గుర్తింపు పొందాడు. గత నెలలో కేవలం స్కోరింగ్‌ పాయింట్ల కోసమే పాల్గొన్న వరల్డ్‌ కప్‌లో కూడా జొరావర్‌ 119 పాయింట్లతో భారత షూటర్లలో అందరికంటే మెరుగైన స్కోరు సాధించాడు. 

నా ఘనతను గుర్తించాలని కోరుతున్నా
ఇక 2025 వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో కూడా 122 పాయింట్లతో భారత్‌ తరఫున అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. తమ నిర్ణయాన్ని ఎన్‌ఆర్‌ఏఐ పునఃసమీక్షించాలని జొరావర్‌ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశాడు. 

‘ఆసియా నంబర్‌వన్‌గా, వరల్డ్‌ నంబర్‌ 6గా ఉన్న నా ఘనతను గుర్తించాలని కోరుతున్నా. గత ఆరు నెలలుగా నేను ట్రాప్‌లో అత్యుత్తమ స్కోరింగ్‌లు నమోదు చేశాను’ అని జొరావర్‌ అన్నాడు. 

ఎంపిక చేసే ప్రసక్తే లేదు
అయితే ఎన్‌ఆర్‌ఏఐ మాత్రం ఇవేమీ పరిగణనలోకి తీసుకోమని చెబుతోంది. ఎలాంటి మార్పూ లేకుండా ప్రస్తుతం ప్రకటించిన జట్టే 99 శాతం బరిలోకి దిగుతుందని ఎన్‌ఆర్‌ఏఐ కార్యదర్శి పవన్‌ కుమార్‌ సింగ్‌ స్పష్టం చేశారు. 

ఆటగాళ్ల పేరు ప్రతిష్టలను బట్టి ఎంపిక ఉండదని ఆయన పునరుద్ఘాటించారు. టీమ్‌లోకి ఎంపికైన ఇతర ‘షాట్‌గన్‌’ షూటర్ల స్కోరింగ్‌ అంతర్జాతీయ స్థాయిలో జొరావర్‌కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో రిజ్వీ (122), హైదరాబాద్‌ షూటర్‌ కైనన్‌ చెనాయ్‌ (119), శపథ్‌ భరద్వాజ్‌ (118) స్కోరు సాధించారు. 

35 ఏళ్ల కైనన్‌ మూడోసారి ఆసియా క్రీడల్లో పోటీపడనున్నాడు. 2014 ఇంచియోన్‌ ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన కైనన్‌ 36వ స్థానంలో నిలిచాడు. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో కైనన్‌ కాంస్య పతకాన్ని సాధించాడు. 

2016 రియో ఒలింపిక్స్‌లోనూ భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన కైనన్‌... ఆసియా చాంపియన్‌షిప్‌లో ఒక రజతం, ఒక కాంస్యం... ప్రపంచకప్‌లలో ఒక స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్యాలతో కలిపి నాలుగు పతకాలు గెలిచాడు.   

భారత ‘షాట్‌గన్‌’ జట్ల వివరాలు 
పురుషుల ట్రాప్‌: కైనన్‌ చెనాయ్, అహ్వర్‌ రిజ్వీ, శపథ్‌ భరద్వాజ్‌. 
మహిళల ట్రాప్‌: నీరూ, మనీషా కీర్, ఆషిమా అహ్లావత్‌. 
పురుషుల స్కీట్‌: అనంత్‌జీత్‌ సింగ్, భవ్‌తేజ్‌ గిల్, మేరాజ్‌ అహ్మద్‌ ఖాన్‌. 
మహిళల స్కీట్‌: పరీనాజ్‌ ధలివాల్, రైజా ఢిల్లాన్, మహేశ్వరి చౌహాన్‌. 
ట్రాప్‌ ‘మిక్స్‌డ్‌’: కైనన్‌ చెనాయ్, నీరూ. 
స్కీట్‌ ‘మిక్స్‌డ్‌’: అనంత్‌జీత్‌ సింగ్, పరీనాజ్‌ ధలివాల్‌.   

చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. తొలి ప్లేయర్‌గా అరుదైన రి​కార్డు

Advertisement
 
Advertisement
Advertisement