breaking news
Namballa Keshava Rao
-
వరుస ఎదురు దెబ్బలు.. మావోయిస్టుల వ్యూహం ఏంటి?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రసుత్త పరిస్థితులు చూస్తుంటే.. దండకారణ్యంపై పట్టు సడలకుండా ఉండేందుకు మావోయిస్టులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడాదిన్నరగా మావోయిస్టులు బస్తర్ పరిధిలోకి వచ్చే దండకారణ్యం, ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా, అబూజ్మడ్ అడవుల్లో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత 409 మందికి పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతి చెందగా.. లొంగిపోయిన/అరెస్టయిన వారు మరో 1,200 మందికి పైగా ఉన్నారు. పోలీసుల చేతిలో హతమైన వారిలో కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతోపాటు చలపతి, ప్రయాగ్‌మాంజీ, సుధాకర్ వంటి అగ్రనేతలు ఉన్నారు. ఇంతకు రెట్టింపు సంఖ్యలో డివిజన్ కమిటీ సభ్యులు చనిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీ మరో ఆరేడు నెలల్లో తన ఉనికిని కోల్పోతుందనే ప్రచారం జరిగింది. మరోవైపు ఈ ఏడాది మార్చి 28న శాంతి చర్చల ప్రతిపాదనను మావోయిస్టులు తెర మీదకు తెచ్చారు. బస్తర్‌కు తిరిగి రండి..! వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు/అరెస్టులతో కేడర్‌ను మావోయిస్టులు చాలా వరకు నష్టపోయారు. మరోవైపు శాంతి చర్చల ప్రతిపాదనపై కేంద్రం, ఛత్తీస్‌గఢ్ సర్కార్ నుంచి సానుకూల ప్రకటన రావడం లేదు. దీంతో బస్తర్ అడవుల్లో తమ పట్టు కోల్పోకుండా ఉండేందుకు మావోయిస్టులు ప్రణాళిక సిద్ధం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రా–ఒడిశా బోర్డర్ (ఏఓబీ), ఎంఎంసీ (మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్), కేకేటీ (కర్ణాటక, కేరళ, తమిళనాడు) ప్రాంతాల్లో పనిచేస్తున్న అగ్రనేతలను బస్తర్‌కు తిరిగి రావాలని మావోయిస్టు పార్టీ కోరినట్టు తెలుస్తోంది. పార్టీ నిర్మాణం, సాయుధ పోరాటం, గెరిల్లా వార్ఫేర్లో నిపుణులైన సీనియర్ నాయకులు రంగంలోకి దిగితే సానుభూతిపరులు, పార్టీ కేడర్‌లో ఆత్మ విశ్వాసం పెంచొచ్చని ఆ పార్టీ అంచనా వేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.కొత్తగా ఏడుగురు ఐపీఎస్‌లు వానాకాలం రావడంతో బస్తర్ అడవులు చిక్కబడ్డాయి. డ్రోన్ల సాయంతో కూంబింగ్ చేయడం సైతం భద్రతా దళాలకు కష్టంగా మారే పరిస్థితి వచ్చింది. అయినా మావోయిస్టులపై నిర్బంధం కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన సుక్మా, బీజాపూర్, దంతేవాడ, నారాయణపూర్‌లో కొత్తగా ఏడుగురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. 2021 బ్యాచ్‌కు చెందిన ఈ యువ అధికారులకు నక్సల్స్‌ను తుదముట్టించే బాధ్యతలు అప్పగించింది. కొత్తగా వచ్చిన అధికారులతో ఈ నాలుగు జిల్లాల పరిధిలో యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌లో పాల్గొంటున్న ఐపీఎస్‌ల సంఖ్య 20కి చేరుకుంది.ఊహించని దాడి.. ఏఓబీ నుంచి కొందరు కీలక నేతలు ఇప్పటికే దండకారణ్యానికి చేరుకున్నట్టు సమాచారం. ఈ సందేహాలకు బలం చేకూర్చేలా పువర్తిలో సీఆర్పీఎఫ్ క్యాంప్‌నకు సమీపంలో ఒక వ్యక్తిని ఇటీవల మావోయిస్టులు హత్య చేశారు. అంతటితో ఆగకుండా రాష్ట్ర సరిహద్దులో ఉన్న కుంట మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో భద్రాచలం–జగ్దల్పూర్ జాతీయ రహదారి నుంచి కేవలం 400 మీటర్ల సమీపంలో ఐఈడీ పేల్చి ఏఎస్పీ స్థాయి అధికారిని హతమార్చారు. తీవ్ర నిర్బంధం నడుమ వరుసగా రెండు రోజుల పాటు భద్రతా దళాల కన్నుగప్పి దాడులు నిర్వహించి ఈ ప్రాంతంపై తమకున్న పట్టు ఏంటో మావోలు తెలియజేసినట్టయ్యింది. అయితే ఈ రెండు ఘటనలపై మావోయిస్టుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.చదవండి: అడవే ఆధారం.. బతుకు భారం -
ఐఈడీ పేలి ఏఎస్పీ ఆకాష్ రావు దుర్మరణం
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా బస్తర్‌లో దారుణం జరిగింది. భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి అడిషనల్ ఎస్పీ మరణించారు. మరో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. గత మే నెలలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా 27 మంది మృతి, ఆపరేషన్ కగార్‌ను నిరసిస్తూ ఆ పార్టీ జూన్10న దేశవ్యాప్తంగా బంద్ పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు మే 11 నుంచి ఆగస్టు 3 వరకు స్మారక సభలు నిర్వహించాలని తెలిపింది.భారత్ బంద్ పిలుపుతో మావోయిస్టులు ఎక్కువ ఉండే బస్తర్‌లో ఈరోజు తెల్లవారుజామున కొంటా-ఎర్రబోర్ రోడ్డులోని దొండ్రా గ్రామం సమీపంలో సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహించేందుకు అడిషనల్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) ఆకాష్ రావు గిరిపుంజే, ఇతర పోలీసు సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహించేందుకు వెళ్లారు. అప్పటికే భద్రతా బలగాల్ని నిలువరించేందుకు సిద్ధంగా ఉన్న మావోయిస్టులు పెట్రోలింగ్ చేసేందుకు వచ్చిన ఏఎస్పీ ఆకాష్ రావు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీతో పేల్చారు.ఈ ఘటనలో ఏఎస్పీతో పాటు ఇతర భద్రతా బలగాలు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన రెస్క్యూ టీం గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థాయి తీవ్రంగా ఉండడంతో ఏఎస్పీని ఎయిర్‌లిఫ్ట్‌లో మరో ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఏఎస్పీ మృతి చెందారు. మిగిలిన భద్రతా బలగాల ఆరోగ్యం స్థిమితంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
నంబాల ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టులు లేఖ
సాక్షి,ఢిల్లీ: మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు జోనల్ కమిటీ పేరుతో లేఖ విడుదలైంది. ఆ లేఖలో నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన కారణాల్ని అందులో పేర్కొన్నారు.‘లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతో ఎన్ కౌంటర్ జరిగింది. 6నెలలుగా కేశవరావు మాడ్ ప్రాంతంలో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలుసు. కేశవరావు టీమ్‌లో ఉన్న ఆరుగురు ఇటీవలే లొంగిపోయారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతో ఎన్ కౌంటర్. యూనిఫైడ్ కమాండో సభ్యుడు దేశ ద్రోహిగా మారాడు. రికీతో సహా పలువురు ద్రోహం చేయడంతో ఈ ఎన్ కౌంటర్. ఎన్కౌంటర్ ముందు రోజు నుంచి 20వేల మంది బలగాలు మా ప్రాంతాన్ని చుట్టి ముట్టాయి. 10 గంటల్లో ఐదు ఎన్ కౌంటర్లు జరిపాయి. 60 గంటల పాటు బలగాలు మమ్మల్ని నిర్భందించాయి. కేశవరావుని కాపాడుకునేందుకు 35మంది ప్రాణాల్ని అడ్డుపెట్టారు. ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు సురక్షింతంగా బయటపడ్డారు. నంబాలను సజీవంగా పట్టుకుని ఎన్ కౌంటర్ చేశారు.మమ్మల్ని వదిలి కేశవరావును సురక్షిత ప్రాంతాన్ని తరలించేందుకు ప్రయత్నించాం. కానీ మమ్మల్ని వదిలి కేశవరావు బయటకు వెళ్లేందుకు ఒప్పుకోలేదు. నాయకత్వాన్ని ముందుండి మాతోటే నడిచారు. ప్రాణాల్ని ఫణంగా పెట్టారు. మా నాయకుడిని కాపాడు కోవడంలో మేం విఫలమయ్యాం. ఈ ఎన్కౌంటర్లో 27 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే, మరో మృతదేహాన్ని మేం తీసుకెళ్లాం. దాయాది పాకిస్తాన్ కోరితే కాల్పుల విరమణకు అంగీకరించిన కేంద్రం.. తాము చర్చలకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆ లేఖలో అసహనం వ్యక్తం చేశారు. -
నంబాల ఫ్యామిలీకి మంత్రి అచ్చెన్న బెదిరింపులు
శ్రీకాకుళం, సాక్షి: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడిపై మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు దిగారు. ఆయన తమను బెదిరించారని, తమ సోదరుడి మృతదేహాన్ని పోలీసులు అప్పగించకుండా అడ్డుపడుతున్నారని ఢిల్లీశ్వరరావు సాక్షి టీవీతో వాపోయారు. పోలీసులు ముందు నుంచే మమ్మల్ని బెదిరిస్తున్నారు. నంబాల మృతదేహం(Nambala Dead body) కోసం వెళ్ళిన మమ్మల్ని బలవంతంగా ఛత్తీస్‌గఢ్ నుంచి ఆంధ్ర బోర్డర్‌కు పంపించేశారు. మా సోదరుడు నంబాల రాజశేఖర్‌కు మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) ఫోన్ చేసి బెదిరించారు. ‘నా అనుమతి లేకుండా ఛత్తీస్‌గఢ్ ఎవరు వెళ్ళమన్నారు? వెంటనే వెనక్కి వచ్చేయండి. లేకపోతే మీరే సమస్యల్లో చిక్కుకుంటారు’ అని మా కుటుంబ సభ్యులను అచ్చెన్నాయుడు బెదిరించారు. .. దీంతో మా వాళ్లు భయపడ్డారు. అచ్చెన్నాయుడు నాకు ముందు నుంచే తెలుసు కానీ ఇలా మా సోదరుడి మృతదేహాం విషయంలో ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదు’’ అని నంబాల సోదరుడు ఢిల్లీశ్వరావు అన్నారు. హైకోర్టు కూడా మృతదేహాన్ని అప్పగించాలని ఆదేశించినా కూడా మంత్రి, పోలీసులు అడ్డుకుంటున్నారు. .. ఫ్యామిలీ ఫోటో చూపించండి, ఆధార్ కార్డ్ చూపించమంటూ ఛత్తీస్‌గఢ్ పోలీసులు(Chhattisgarh) ఇబ్బంది పెట్టారు. మృతదేహాన్ని అప్పగించండి అని అడిగితే మమ్మల్ని మావోయిస్టు ఫ్యామిలీ గా చూస్తూ ఇవ్వట్లేదు. అలా చూస్తే మమ్మల్ని కూడా కాల్చి చంపేయండి. నా సోదరుడి మృతదేహం చూసేందుకు కుటుంబం మొత్తం ఎదురు చూస్తోంది. దయచేసి మా తమ్ముడి మృతదేహం మాకు అప్పగించండి అని కోరుతున్నారాయన.ఇదీ చదవండి: నంబాల మృతదేహం అప్పగింతలో జాప్యమెందుకు? -
Nambala: నంబాల మృతదేహాన్ని అప్పగించరా?
సాక్షి, ఛత్తీస్‌ఘడ్: మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు(Nambala Keshava Rao) కుటుంబ సభ్యులను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారా?. కావాలనే మృత దేహం అప్పగింతకు జాప్యం చేస్తున్నారా?. అసలు మృతదేహాన్ని అప్పగిస్తారా? లేదా?. ఆయన కుటుంబ సభ్యులు కోర్టు ఆర్డర్‌తో వెళ్లినా కూడా పోలీసులు తాత్సారం చేస్తుండడంపై ఇప్పుడు విమర్శలు వినవస్తున్నాయి.ఛత్తీస్‌ఘడ్(Chhattisgarh)లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో ఈనెల 21 న జరిగిన ఎన్ కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు తో పాటు మరో 26 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే..ఆయన మృతదేహాన్ని(Nambala Dead Body) అప్పగించాలని ఏపీ హైకోర్టు (AP High Court) ఆదేశించింది. అయినా కూడా మృతదేహాల అప్పగింత విషయంలో ఛత్తీస్‌ఘడ్ పోలీసులు వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటిదాకా కేవలం ఆ రాష్ట్రానికి చెందిన మృతదేహాలను మాత్రమే కుటుంబ సభ్యులకు అప్పగించడం గమనార్హం.మరోవైపు.. కేశవరావు కుటుంబ సభ్యులను పోలీసులు నానా ఇబ్బందులు పెడుతున్నారు. తమ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని, కోర్టు ఆర్డర్ ఉన్నా అక్కడి పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగి ఆరు రోజులు కావడం.. మృత దేహం కుళ్ళిపోయే పరిస్థితి ఉన్నందున సత్వరమే నంబాల మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఛత్తీస్‌ఘడ్ పోలీసులు(Chhattisgarh Police) ఇదే రీతిలో వ్యవహరిస్తే ఆందోళన చేపతామని హెచ్చరిస్తున్నారు.నంబాల స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కొటబొమ్మాళి మండలం జియ్యన్నపేటలో.. మృతదేహాన్ని ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అభిమానులు సైతం ఎదురు చూస్తున్నారు. నాలుగున్నర దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో కొనసాగిన నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజును కడసారి చూపు చూసేందుకు లేకుండా చేస్తారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
తిరుపతి ఎట్లున్నడో?.. తిరుపతి ఎట్లున్నడో?..
కోరుట్ల(కరీంనగర్): మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ నేపథ్యంలో సెంట్రల్ మిలిషియా కమిషన్ మెంబర్..మావోల కీలక దాడుల్లో వ్యూహకర్త.. మావోయిస్టు పార్టీలో సెకండ్ క్యాడర్లో ఉన్న కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి ఉరఫ్ దేవ్‌జీ ఎట్లున్నడో.. అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టులు మృతి చెందుతున్న విషయం తెల్సిందే. అయితే ఎన్కౌంటర్లో తిప్పిరి తిరుపతి ఎక్కడన్నా ఉన్నాడోనని స్థానికులు కలవరపడుతున్నారు. ఆర్ఎస్యూ నేపథ్యమే..కోరుట్లలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన తిరుపతి 1983లో డిగ్రీ చదువుతున్న క్రమంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. ఆ సమయంలో ఏబీవీపీ, ఆర్ఎస్యూ విద్యార్థి సంఘాల మధ్య గొడవలు సాధారణంగా జరుగుతున్న క్రమంలో పోలీసు కేసులు నమోదు అయ్యాయి. 1983 చివరలో తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. దళ సభ్యుడి స్థాయి నుంచి కమాండర్‌గా పనిచేసి అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్‌గా, మిలిషియా దాడుల్లో వ్యూహకర్తగా సెకండ్ క్యాడర్ హోదాలో పనిచేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ఏరియాల్లో తిప్పిరి తిరుపతిని దేవ్‌జీగా పిలుచుకుంటారు. మిలి షియా దాడులు జరిపి నిమిషాల్లో అక్కడి నుంచి తప్పించుకోవడం తిరుపతికి వెన్నతో పెట్టిన విద్యగా చెబుతారు. తిరుపతి సమీపంలోని అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడి ఘటనలో నంబాల కేశవరావుతో పాటు తిప్పిరి తిరుపతి పాత్ర ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. 2010లో దంతెవాడ సమీపంలో సెంట్రల్ రిజర్వ్ జవాన్లపై దాడి జరిపి 74 మంది మృతి చెందిన ఘటనకు సారథ్యం వహించింది ఇతడేనని పోలీసు వర్గాలు చెబుతాయి. ఆయన తలకు ఎన్ఐఏ రూ. కోటి రివార్డు ప్రకటించినట్లు సమాచారం.ఎక్కడున్నడో ఏమో? ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ఏరియాల్లో మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్లో కీలకంగా వ్యవహరించడంతోపాటు మిలటరీ శిక్షణ కేంద్రం నిర్వహణలోనూ తిరుపతి పాలుపంచుకున్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో తి రుపతి తన స్థావరాలు మార్చుకుంటున్నట్లు పో లీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల కొంత మంది మా వోయిస్టు కీలక నేతలు పశ్చిమ బెంగాల్ సరి హద్దు ప్రాంతాల్లోకి వెళ్లి షెల్టర్ తీసుకుంటున్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ భావిస్తోంది.వీరిలో తిప్పిరి తిరుపతి కూడా ఉంటాడన్న ప్రచా రం జరుగుతోంది. ఈ మూడు నెలల వ్యవధిలో వందలాది మంది మావోయిస్టులు మృతి చెందుతున్న క్రమంలో తిరుపతి ప్రస్తావన రావడం గమనార్హం. ఇటీవల మెట్పల్లి డీఎస్పీ అ డ్డూరి రాములు కోరుట్లలోని తిరుపతి ఇంటికి వె ళ్లి అజ్ఞాతంలో ఉన్న అతడిని లొంగిపోయేలా చూ డాలని ఆయన బంధువులను కోరడం గమనార్హం -
మా కేశవుడు అంత పెద్దోడా..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘మావోడు అంత పెద్దోడా.. పోలీసు కాల్పుల్లో మరణించారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా స్పందించారంటే అంత ఎత్తుకు ఎదిగిన నాయకుడా? పత్రికల్లో, టీవీల్లో చూస్తుంటే మా కేశవరావు స్థాయి ఏంటో తెలుస్తోంది. ఇక్కడ చదువు కున్నంత కాలం అందరితో సరదాగా ఉండేవాడు. రోజూ వ్యవసాయం చేసేవాడు. బాగా చదువుకునేవాడు. కబడ్డీ బాగా ఆడేవాడు. అలాంటి వ్యక్తి వరంగల్‌లో ఇంజినీరింగ్‌లో చేరాక.. ఏం జరిగిందో తెలియదు గాని నక్సలిజంలోకి వెళ్లిపోయాడు. దేశంలో ఉద్యమ శిఖరంగా, మావోయిస్టుల సుప్రీం కమాండర్‌గా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారంటే ఆశ్చర్యంగా ఉంది. 45 ఏళ్ల కిందట ఊరి నుంచి వెళ్లిపోయాడు. ఇప్పుడెలా ఉంటాడో తెలియ దు. పేపర్లలో ఫొటోలు చూసి ఈయనే కేశవరావా అనుకోవాల్సి వస్తోంది. మృతదేహం సొంతూరికి వస్తే తప్ప కేశవరావును కళ్లారా చూసే అవకాశం లేదు. చివరి చూపు లేకపోతే ఆయన ఎలా ఉంటాడో నేటికీ తెలుసుకోలేని పరిస్థితిలో మేమంతా ఉన్నాం.ఇదీ మావోయిస్టు అగ్రనేత నంబాళ్ల కేశవరావు స్వగ్రామం జియ్యన్నపేటలో వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఈ గ్రామంలో కేశవరావుకు సంబంధించి దాదాపు 15 కుటుంబాలు ఉన్నాయి. ఆయన చిన్నతనంలో కలిసి తిరిగిన వ్యక్తులు ఉన్నారు. వరసకు సోదరుడైన నంబాళ్ల సూరయ్య, మరికొంతమంది వ్యక్తులు కేశవరావు బాల్యం గురించి చెబుతున్నారు. కష్టపడి వ్యవసాయం చేయడమే కాకుండా బాగా చదివేవాడని, కబడ్డీ మంచిగా ఆడేవాడని, ఈ మూడు తప్ప కేశవరావుకు ఇంకేమి తెలియవని, అలాంటి వ్యక్తి వరంగల్ వెళ్లాక ఉద్యమం బాట పట్టారని చెబుతున్నారు. తర్వాత గ్రామస్తులు, కుటుంబీకులు ఇబ్బంది పడకూడదని ఊరికి రాకపోయి ఉంటాడని అంటున్నారు. వీరంతా కేశవరావు బాల్యం కోసం చెబుతున్నారే తప్ప ఇప్పుడెలా ఉంటారో గుర్తించలేమంటున్నారు. ఆయన ఆనవాళ్లు ఎలా ఉంటాయో చెప్పలేమంటున్నారు. మరికొందరైతే 45 ఏళ్ల కిందట ఊరు వదిలి వెళ్లిపోయిన కేశవరావును తర్వాత ఎప్పుడూ చూడలేదని, విశాఖపట్నంలో జైలులో ఉన్నప్పుడు తన తండ్రితో పాటు కొందరు కలిశారని, ఉద్యమంలోకి వెళ్లొద్దని చెప్పినట్టు కూడా ప్రచారం ఉందని అంటున్నారు. మా కేశవరావు ఇప్పుడెలా ఉంటాడో చూడాలని ఉందని, చనిపోయాకైనా చూసిన భాగ్యం కలుగుతుందని అంటున్నారు. గతంలో కూడా రెండు మూడు పర్యాయాలు కేశవరావు చనిపోయారని వార్తలు వచ్చాయని, కానీ నిజం కాదని తర్వాత తర్వాత తెలిసిందని అంటున్నారు. ఇప్పుడేకంగా ప్రధానమంత్రి, హోంమంత్రి కేశవరావు చనిపోయాడని స్టేట్మెంట్ ఇచ్చారని, అసలేం జరిగిందో తెలియకపోయినా మృతదేహాన్ని ఇస్తే కళ్లారా చూసి, అంత్యక్రియలు చేసుకుంటామని అంటున్నారు. కాకపోతే, తమ పేర్లు రాయవద్దని గతంలో ఇలాగే మీడియాతో మాట్లాడితే విచారణకని విశాఖపట్నం తదితర ప్రాంతాలకు తిప్పారని, ఇప్పుడు తమకు ఇదంతా అవసరమా అని అంటున్నారు. ప్రస్తుతానికైతే మృతదేహం కోసం గ్రామం ఎదురు చూస్తోంది. కేశవరావు ఇంటికి ప్రజా సంఘాల తాకిడి జియ్యన్నపేటలో తాళం వేసి ఉన్న కేశవరావు ఇంటికి ప్రజా సంఘాల తాకిడి ఎక్కువైంది. జిల్లా నుంచే కాదు మిగతా ప్రాంతాల నుంచి పలు సంఘాల నాయకులు వచ్చి చూస్తున్నారు. చుట్టు పక్కల ఉన్న వారితో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా కలిసిన మీడియా ప్రతినిధుల వద్ద భుక్తి కోసం, భూమి కోసం చేసిన పోరాటంలో శిఖరంగా కేశవరావు నిలిచాడని, దోపిడీ రూపం మార్చుకుందే తప్ప పూర్తిగా పోలేదని, చర్చలతో సమస్యలు పరిష్కరించుకుందామని మావోయిస్టులు కోరుతున్నా పట్టించుకోకుండా ఆపరేషన్ కగార్ పేరుతో హతమారుస్తుందని కేంద్ర ప్రభుత్వం తీరును దుయ్యబడుతున్నారు. వెనక్కి వచ్చేసిన కుటుంబీకులు కేశవరావు మరణించారని, వెళ్లి చూడొచ్చని జిల్లా పోలీసులే సమాచారమిచ్చారు. మృతదేహాన్ని తీసుకోవచ్చని చెప్పి పంపించారు. జగదల్పూర్ వరకు వెళ్లాక ప్రొసీజర్ అవ్వలేదని, ప్రస్తుతానికి మృతదేహం ఇవ్వడం కుదరదని అక్కడ పోలీసులు చెప్పేశారు. ఇంతలో పోస్టుమార్టమైతే అక్కడే ఖననం చేసేయండని, ఇక్కడికి తీసుకురావద్దని పోలీసులు చెప్పారంటూ అక్కడికి వెళ్లిన కేశవరావు సోదరుడు రామ్ ప్రసాద్ బృందం చెబుతోంది. మృతదేహాన్ని తీసుకొస్తే దేశం నలుమూలల నుంచి విప్లవ సంఘం నాయకులు, అభిమానులు వస్తారని, వారి ప్రభావం ఈ ప్రాంతంపై పడుతుందని, ఉద్యమాల పుట్టిన గడ్డపై మళ్లీ కొంత పుంతలు తొక్కుతుందేమో అన్న అనుమానంతో అడ్డుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.పలాసలో ఉద్రిక్తత కాశీబుగ్గ: నంబాళ్ల కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లో చంపారని శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సి పాలిటీలో శుక్రవారం ప్రజా సంఘాల నాయకులు పలువురు నిరసన తెలిపారు. కాశీబుగ్గలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉదయం పది గంటలకు శాంతిపూర్వక నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాశీబుగ్గ సీఐలు సూర్యనారాయ ణ, తిరుపతిరావులు తమ సిబ్బంది వచ్చి వారిని అడ్డుకున్నారు. సుమారు 15 మందిని అదుపులోకి తీసుకుని కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో కాశీబుగ్గ బస్టాండ్ పరిసర ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. సీపీఐ ఎంఎల్ న్యూడెమెక్రసీ, లిబరేషన్ పార్టీ నాయకులు, పౌరహక్కుల సంఘం, దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు, అమరుల బంధుమిత్రుల సంఘం, ప్రజాకళామండలి, ప్రగతిశీల కార్మిక సమాఖ్య, సీపీఎం పారీ్టలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. -
Operation Kagar: మావోళ్లు ఎలా ఉన్నరో?
సాక్షి, పెద్దపల్లి: మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వారికి కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో నెత్తురోడుతోంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా 2024 జనవరిలో కేంద్ర బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో చోటుచేసుకుంటున్న ఎదురుకాల్పుల్లో సుమారు 300మందికి పైగా మా వోయిస్టులు మృతిచెందారు. ప్రభుత్వ దూకుడు, పె రుగుతున్న నిర్బంధం, వరుస ఎన్కౌంటర్లతో ఎ ప్పుడు ఏం జరుగుతుందోనని అజ్ఞాత మావోయి స్టు కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మృతిచెందడంతో జిల్లా నేతల క్షేమసమాచారంపై బంధువుల్లో ఆందోళన నెలకొంది. భయపెడుతున్న ఘటనలు మావోయిస్టుల అంతమే లక్ష్యంగా ఛత్తీస్‌గఢ్‌లో దూ సుకుపోతున్న భద్రతాదళాలకు మనజిల్లాకు చెంది న నేతలు కొరకరాని కొయ్యలా మారారు. కేంద్ర కమిటీతోపాటు వివిధ కీలక స్థానాల్లో మన జిల్లావా సులు దండాకారణ్యంలో కార్యకలాపాలు కొనసాగి స్తున్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా జనతన స ర్కార్ను స్థాపించారు. అయితే, మావోయిస్టుల విస్తరణకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో 2009తో ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. అప్పటినుంచి దేశవ్యాప్తంగా ముమ్మరంగా యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ సాగిస్తోంది. తాజాగా ప్రభు త్వం ఆపరేషన్ కగార్‌ను ప్రారంభించింది. సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, డీఆర్జీ, సీ–60, ఎస్‌వోజీ, స్పెషల్ టాస్‌్కఫోర్స్ పేరుతో అడవులను జల్లెడ పడుతున్నా యి. దీంతో ఏడాదిన్నర కాలంలోనే 300 మందికిపైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతిచెందా రు. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు ఉన్నట్లు ప్రచారం జరిగినా త్రుటిలో తప్పించుకుంటున్నారు. ఇటీవల జూలపల్లికి చెందిన పుల్లూరి ప్రసాద్‌రావు ఉరఫ్ చంద్రన్న మృతిచెందారని ప్రచారం జరిగినా ఇంకా నిర్ధారణ కాలేదు. జిల్లావాసులే కీలకం పెద్దపల్లి జిల్లాలకు చెందిన పలువురు మావోయిస్టులు కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. కిష్టంపేట గ్రామానికి చెందిన కంకణాల రాజిరెడ్డి, జాలపల్లి మండలం వడ్కా పూర్ గ్రామానికి చెందిన పుల్లూరి ప్రసాద్‌రావు ఉరఫ్ చంద్రన్న, పెద్దపల్లికి చెందిన మల్లోజుల వేణుగోపాలరావు ఉరఫ్ భూపతి, జూలపల్లి మండలం వెంకట్రాపుపల్లికి చెందిన దీకొండ శంకర్, పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామానికి చెందిన గంకిడి సత్యనారాయణరెడ్డి ఉరఫ్ విజయ్, పాలితం గ్రానికి చెందిన అలేటి రామలచ్చులు, రామగుండం మండలానికి చెందిన అప్పాసి నారాయణ ఉరఫ్ రమేశ్, గోపయ్యపల్లికి చెందిన దళ కమాండర్ దాతు ఐలయ్య, సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామానికి చెందిన జువ్వాడి వెంకటేశ్వర్రావు, మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన మల్ల రాజిరెడ్డి ఉరఫ్ మీసాల రాజన్న తదితరులు ఉన్నారు. ఎక్కడ, ఎప్పుడు ఎలాంటి ఎన్కౌంటర్ జరిగినా ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసుల్లో ఆందోళన నెలకొంటోంది. -
Nambala Keshava Rao: శ్రీకాకుళం టు సుప్రీం కమాండర్
సొంతూరికి దూరంగా దాదాపు నాలుగు దశాబ్దాల అజ్ఞాత వాసం ముగిసిపోయింది. ఎంటెక్ చదివినా ఏళ్లకు ఏళ్లు చేసిన అరణ్య వాసం పూర్తయ్యింది. కలాన్ని వదిలి తుపాకీ చేతబట్టిన ఆయన జీవితం ఆ తుపాకీ గుళ్లకే బలైపోయింది. జియ్యన్నపేటలో పుట్టి.. టెక్కలిలో చదివి.. వరంగల్‌లో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లి.. ఆపై అడవిలో అన్నగా మారిన నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు ప్రస్థానం ముగిసిపోయింది. చత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో కేశవరావు హతమయ్యారు. ఈ ఘటనతో సిక్కోలు ఉలిక్కిపడింది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, పలాస: నలభై ఏళ్ల కిందట ఓ విద్యార్థి అకస్మాత్తుగా ఇంటికి వచ్చి.. తన వాటా ఆస్తి రాసిచ్చేయాలని టీచరైన తండ్రిని కోరారు. ఎందుకని అడిగితే ఆస్తి ఇస్తే.. పేదలకు పంచేస్తా అని చెప్పారు. ఆ విద్యార్థే నంబాళ్ల కేశవరావు. విద్యారి్థగా ఊరి నుంచి, కు టుంబం నుంచి వెళ్లిన కేశవరావు విగతజీవిగా మా రారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అజ్ఞాత వాసం చేసి అడవిలోనూ ఊపిరి వదిలేశారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటనతో సిక్కోలు ఉలిక్కి పడింది. నంబాళ్ల స్వగ్రామమైన కోట»ొమ్మాళి మండలం జియ్యన్నపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిన్నప్పుడు తెలివైన విద్యార్థి, మెరుగైన కబడ్డీ ప్లేయర్‌గా మన్ననలు అందుకున్న కేశవరావు కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామానికి చెందిన నంబాళ్ల వాసుదేవరావు (ఉపాధ్యాయుడు) లక్ష్మీనారాయణమ్మ దంపతులకు 1955లో జన్మించారు. 1 నుంచి 5 వరకు స్వగ్రామమైన జియ్యన్నపేటలో ప్రాథమిక విద్యనభ్యసించారు. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు టెక్కలి మండలం తలగాం ఎట్ నౌపడ ఆర్ఎస్లో విద్యనభ్యసించారు. టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ పూర్తి చేసి 1971 లో టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ కోర్సులో చేరారు. ఏడాది తర్వాత వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కళాశాలలో చేరారు. ఆ తర్వాత అక్కడే ఎంటెక్‌లో చేరారు. అటు నుంచి అటే అడవి బాట పట్టారు. కేశవరావు మరణంతో కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ గ్రామం ప్రస్తుతం గుంభనంగా ఉంది. గతంలో ఒకటి రెండు మార్లు కేశవరావుమృతి వదంతులపై కొందరు స్పందించడంతో వారిని పోలీసులు విచారించారు. దీంతో ప్రస్తుతం ఎవరూ బయట పడడం లేదు. ఉద్దానంలో.. నంబాళ్ల కేశవరావు ఎన్కౌంటర్లో మృతి చెందారన్న వార్త ఉద్దానంలో దావానలంలా వ్యాపించింది. టెక్కలికి చెందిన ఆయనకు ఈ ప్రాంతం ఉద్యమాలతో నేరుగా సంబంధం లేకపోయినా ఈ ప్రాంతం మావోయిస్టు కేడరుకు, నాటి పీపుల్స్ వార్ పార్టీ కేడరుకు దిశానిర్దేశం చేసిన వ్యక్తి కావడంతో మృతి వార్తతో ఉద్దానం ఉలిక్కిపడింది. పోలీసు వర్గాలు ముందుగా పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి ఈ సమాచారం అందించి మృతదేహాన్ని తీసుకొని రావడానికి ఎవరైనా వెళ్తున్నారా అని అడిగారు. తమ గ్రామానితో ఎలాంటి బంధుత్వం లేదని, రాజకీయ బంధుత్వం మాత్రమే ఉందని వారు చెప్పారు. ఒక నాటి పీపుల్స్ వార్‌లో, నేటి మావోయిస్టు పారీ్టలో పనిచేసి ఈ ఉద్దానం ప్రాంతంలో సుమారు 60మంది వరకు కార్యకర్తలు, నాయకులు పోలీసు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. నంబాళ్ల కేశవరావు మృతితో ఇక నాయకత్వ స్థానాల్లో ఈ జిల్లా నుంచి ఎవరూ లేరనే తెలుస్తోంది. ఆయన మృతదేహం తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు, మాజీ మావోయిస్టు నాయకులు బయల్దేరి వెళ్తున్నట్టు ఉద్దానం వాసులు చెబుతున్నారు. ఎన్‌కౌంటర్‌కు ఖండన చత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ మఢ్ అడవుల్లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌ను సి.పి.ఐ.ఎం.ఎల్ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు ఖండించారు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆయన కోరారు. మావోయిస్టు పార్టీ శాంతి చర్చలు కోరినా వాటిని తిరస్కరించి మన దేశపౌరులైన మావోయిస్టులను ఉగ్రవాదులపై దాడుల కన్నా ఎక్కువగా దాడి చేసి దండకారణ్యంలో ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టిండచం అప్రజాస్వామికమని, పౌర సమాజం వీటిపై తీవ్రంగా స్పందించాలని కోరారు. -
తిరిగి పట్టు కోసం!
సీపీఐ మావోయిస్టు కేంద్ర మిలటరీ కమిటీ నేత నంబళ్ల కేశవరావు అలియాస్ గంగన్న మన్యంలోకి వచ్చి వెళ్లిన తర్వాత మావోయిస్టుల్లో నూతనోత్తేజం కనబడుతోంది. ఏవోబీలో కోల్పోయిన పట్టుకోసం వారు తిరిగి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మూడు రాష్ట్రాలకు కేంద్రంగా ఉన్న ఏవోబీలో పట్టుకోల్పోతే దండకారణ్యంపై దాని ప్రభావం పడుతుందని భావిస్తూ.. పెదబయలు ఏరియా కమిటీని మల్కజ్గిరి-విశాఖ-కోరాఫుట్(ఎంవీకే) డివిజన్లో విలీనం చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర కమిటీకి చెందిన కీలక నేతలతో పాటు దండకారణ్యంనకు చెందిన కొందరు నేతలు ఈస్ట్ డివిజన్లో పర్యటించినట్టు వస్తున్న వార్తలు.. ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ఇదిలా ఉండగా వచ్చే నెల నుంచి మావోయిస్టుల నిరసన వారాన్ని పాటించాలని పిలువునివ్వడంతో పోలీసులు అదనపు బ లగాలను మన్యంలోకి మోహరించారు. - ఏవోబీలో మావోయిస్టుల యత్నాలు.. - ఈస్ట్ డివిజన్లో పర్యటించిన కీలక నేత.. - పెదబయలు ఏరియా కమిటీ ఎంవీకేలో విలీనం? - జులై 1 నుంచి వారం పాటు నిరసన - అప్రమత్తమైన పోలీసులు.. కూబింగ్ ఉధృతం కొయ్యూరు : మిలటరీ వ్యూహాలు రచించడంలో దిట్టయిన నంబళ్ల కేశవరావు 40 రోజుల కిందట ఈస్ట్ డివిజన్‌లోకి అడుగుపెట్టారు. కొద్ది రోజులు ఆయన అక్కడే ఉన్నారు. అతను వస్తే ఏదో ఒక విధ్వంసానికి మావోయిస్టులు ఏదో ఓ వ్యూహాన్ని రచించి ఉంటారని పోలీసులు భావించి.. గడచిన కొన్ని రోజుల నుంచి విస్త ృతంగా బలగాలను మోహరించి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అతనితో పాటు కేంద్ర రీజియన్ బ్యూరోకు చెందిన కటకం సుదర్శన్ కూడా ఈస్ట్ డివిజన్‌లోకి వచ్చి వెళ్లినట్లు తెలుస్తోంది. వీరంతా ఏవోబీలో ఉన్న ఏరియా కమిటీలు, డివిజన్ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి భవిష్యత్ ప్రణాళికలు, కొత్త వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. పెదబయలు ఇటు మల్కజ్గిరి అటు కోరాపుట్‌కు కీలకంగా మారడంతో దాని పేరిట ఉన్న ఏరియా కమిటీని ఎంవీకేలో విలీనం చేశారన్న వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉండగా కొద్ది రోజుల నుంచి ఏపీ పోలీసులు మావోయిస్టులపై పూర్తిస్థాయిలో నెట్‌వర్క్‌ను ప్రారంభించారు. దీంతో మిలీషియా కమాండర్లు, సభ్యులు లొంగుబాట్లు పెరిగాయి. అలాగే ఈ నెల 20న పెదబయలు మండలంలో చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో మావోయిస్టు నేత సూర్యం మరణించారు. వేణు ఎవరన్న దానిపై ఆరా.. కొద్ది రోజుల కిందట మల్కన్‌గిరి-విశాఖ- కోరాపుట్ నేత వేణు పేరిట ఓ ప్రకటన విడుదల అయింది. దీంతో వేణు ఎవరన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో పని చేసిన గాజర్ల రవి అలియాస్ ఉదయ్.. వేణు అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. పోలీసుల చర్యలను నిరసిస్తూ మావోయిస్టులు జులై ఒకటి నుంచి నిరసన వారాలు పాటించి ఆరు, ఏడున బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సమాచారంతో పోలీసులకు చేరడంతో అదనపు బలగాలను ఆ ప్రాంతంలో మోహరించారు. నర్సీపట్నం ఓఎస్డీ విశాల్ గున్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్న ఎండకోట,గొందికోటలో కూడా పర్యటించి గిరిజనులతో ఇటీవల మాట్లాడారు. మావోయిస్టులకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదన్న పట్టుదలతో పోలీసులున్నారు.