
ఇప్పుడెలా ఉంటాడో.. కుటుంబ సభ్యుల ఎదురుచూపులు
నంబాళ్ల కేశవరావు ఇంటికి ప్రజా సంఘాల తాకిడి
మృతదేహం కోసం వెళ్లి వెనక్కి వచ్చేసిన కుటుంబ సభ్యులు
కేంద్రం తీరును దుయ్యబడుతున్న ప్రజా సంఘాల నేతలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘మావోడు అంత పెద్దోడా.. పోలీసు కాల్పుల్లో మరణించారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా స్పందించారంటే అంత ఎత్తుకు ఎదిగిన నాయకుడా? పత్రికల్లో, టీవీల్లో చూస్తుంటే మా కేశవరావు స్థాయి ఏంటో తెలుస్తోంది. ఇక్కడ చదువు కున్నంత కాలం అందరితో సరదాగా ఉండేవాడు. రోజూ వ్యవసాయం చేసేవాడు. బాగా చదువుకునేవాడు. కబడ్డీ బాగా ఆడేవాడు. అలాంటి వ్యక్తి వరంగల్‌లో ఇంజినీరింగ్‌లో చేరాక.. ఏం జరిగిందో తెలియదు గాని నక్సలిజంలోకి వెళ్లిపోయాడు. దేశంలో ఉద్యమ శిఖరంగా, మావోయిస్టుల సుప్రీం కమాండర్‌గా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారంటే ఆశ్చర్యంగా ఉంది. 45 ఏళ్ల కిందట ఊరి నుంచి వెళ్లిపోయాడు.
ఇప్పుడెలా ఉంటాడో తెలియ దు. పేపర్లలో ఫొటోలు చూసి ఈయనే కేశవరావా అనుకోవాల్సి వస్తోంది. మృతదేహం సొంతూరికి వస్తే తప్ప కేశవరావును కళ్లారా చూసే అవకాశం లేదు. చివరి చూపు లేకపోతే ఆయన ఎలా ఉంటాడో నేటికీ తెలుసుకోలేని పరిస్థితిలో మేమంతా ఉన్నాం.ఇదీ మావోయిస్టు అగ్రనేత నంబాళ్ల కేశవరావు స్వగ్రామం జియ్యన్నపేటలో వ్యక్తమవుతున్న అభిప్రాయం.
ఈ గ్రామంలో కేశవరావుకు సంబంధించి దాదాపు 15 కుటుంబాలు ఉన్నాయి. ఆయన చిన్నతనంలో కలిసి తిరిగిన వ్యక్తులు ఉన్నారు. వరసకు సోదరుడైన నంబాళ్ల సూరయ్య, మరికొంతమంది వ్యక్తులు కేశవరావు బాల్యం గురించి చెబుతున్నారు.
కష్టపడి వ్యవసాయం చేయడమే కాకుండా బాగా చదివేవాడని, కబడ్డీ మంచిగా ఆడేవాడని, ఈ మూడు తప్ప కేశవరావుకు ఇంకేమి తెలియవని, అలాంటి వ్యక్తి వరంగల్ వెళ్లాక ఉద్యమం బాట పట్టారని చెబుతున్నారు. తర్వాత గ్రామస్తులు, కుటుంబీకులు ఇబ్బంది పడకూడదని ఊరికి రాకపోయి ఉంటాడని అంటున్నారు. వీరంతా కేశవరావు బాల్యం కోసం చెబుతున్నారే తప్ప ఇప్పుడెలా ఉంటారో గుర్తించలేమంటున్నారు. ఆయన ఆనవాళ్లు ఎలా ఉంటాయో చెప్పలేమంటున్నారు. మరికొందరైతే 45 ఏళ్ల కిందట ఊరు వదిలి వెళ్లిపోయిన కేశవరావును తర్వాత ఎప్పుడూ చూడలేదని, విశాఖపట్నంలో జైలులో ఉన్నప్పుడు తన తండ్రితో పాటు కొందరు కలిశారని, ఉద్యమంలోకి వెళ్లొద్దని చెప్పినట్టు కూడా ప్రచారం ఉందని అంటున్నారు.
మా కేశవరావు ఇప్పుడెలా ఉంటాడో చూడాలని ఉందని, చనిపోయాకైనా చూసిన భాగ్యం కలుగుతుందని అంటున్నారు. గతంలో కూడా రెండు మూడు పర్యాయాలు కేశవరావు చనిపోయారని వార్తలు వచ్చాయని, కానీ నిజం కాదని తర్వాత తర్వాత తెలిసిందని అంటున్నారు. ఇప్పుడేకంగా ప్రధానమంత్రి, హోంమంత్రి కేశవరావు చనిపోయాడని స్టేట్‌మెంట్ ఇచ్చారని, అసలేం జరిగిందో తెలియకపోయినా మృతదేహాన్ని ఇస్తే కళ్లారా చూసి, అంత్యక్రియలు చేసుకుంటామని అంటున్నారు. కాకపోతే, తమ పేర్లు రాయవద్దని గతంలో ఇలాగే మీడియాతో మాట్లాడితే విచారణకని విశాఖపట్నం తదితర ప్రాంతాలకు తిప్పారని, ఇప్పుడు తమకు ఇదంతా అవసరమా అని అంటున్నారు. ప్రస్తుతానికైతే మృతదేహం కోసం గ్రామం ఎదురు చూస్తోంది.
కేశవరావు ఇంటికి ప్రజా సంఘాల తాకిడి
జియ్యన్నపేటలో తాళం వేసి ఉన్న కేశవరావు ఇంటికి ప్రజా సంఘాల తాకిడి ఎక్కువైంది. జిల్లా నుంచే కాదు మిగతా ప్రాంతాల నుంచి పలు సంఘాల నాయకులు వచ్చి చూస్తున్నారు. చుట్టు పక్కల ఉన్న వారితో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా కలిసిన మీడియా ప్రతినిధుల వద్ద భుక్తి కోసం, భూమి కోసం చేసిన పోరాటంలో శిఖరంగా కేశవరావు నిలిచాడని, దోపిడీ రూపం మార్చుకుందే తప్ప పూర్తిగా పోలేదని, చర్చలతో సమస్యలు పరిష్కరించుకుందామని మావోయిస్టులు కోరుతున్నా పట్టించుకోకుండా ఆపరేషన్ కగార్ పేరుతో హతమారుస్తుందని కేంద్ర ప్రభుత్వం తీరును దుయ్యబడుతున్నారు.
వెనక్కి వచ్చేసిన కుటుంబీకులు
కేశవరావు మరణించారని, వెళ్లి చూడొచ్చని జిల్లా పోలీసులే సమాచారమిచ్చారు. మృతదేహాన్ని తీసుకోవచ్చని చెప్పి పంపించారు. జగదల్‌పూర్ వరకు వెళ్లాక ప్రొసీజర్ అవ్వలేదని, ప్రస్తుతానికి మృతదేహం ఇవ్వడం కుదరదని అక్కడ పోలీసులు చెప్పేశారు. ఇంతలో పోస్టుమార్టమైతే అక్కడే ఖననం చేసేయండని, ఇక్కడికి తీసుకురావద్దని పోలీసులు చెప్పారంటూ అక్కడికి వెళ్లిన కేశవరావు సోదరుడు రామ్ ప్రసాద్ బృందం చెబుతోంది. మృతదేహాన్ని తీసుకొస్తే దేశం నలుమూలల నుంచి విప్లవ సంఘం నాయకులు, అభిమానులు వస్తారని, వారి ప్రభావం ఈ ప్రాంతంపై పడుతుందని, ఉద్యమాల పుట్టిన గడ్డపై మళ్లీ కొంత పుంతలు తొక్కుతుందేమో అన్న అనుమానంతో అడ్డుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పలాసలో ఉద్రిక్తత
కాశీబుగ్గ: నంబాళ్ల కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులను బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపారని శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సి పాలిటీలో శుక్రవారం ప్రజా సంఘాల నాయకులు పలువురు నిరసన తెలిపారు. కాశీబుగ్గలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉదయం పది గంటలకు శాంతిపూర్వక నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాశీబుగ్గ సీఐలు సూర్యనారాయ ణ, తిరుపతిరావులు తమ సిబ్బంది వచ్చి వారిని అడ్డుకున్నారు.
సుమారు 15 మందిని అదుపులోకి తీసుకుని కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో కాశీబుగ్గ బస్టాండ్ పరిసర ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. సీపీఐ ఎంఎల్ న్యూడెమెక్రసీ, లిబరేషన్ పార్టీ నాయకులు, పౌరహక్కుల సంఘం, దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు, అమరుల బంధుమిత్రుల సంఘం, ప్రజాకళామండలి, ప్రగతిశీల కార్మిక సమాఖ్య, సీపీఎం పారీ్టలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది.