అత్తింటి ఎదుట కోడలి న్యాయదీక్ష
వజ్రపుకొత్తూరు రూరల్ : అత్తామామలు ఇంట్లోకి రానివ్వడం లేదంటూ కోడలు న్యాయదీక్షకు దిగిన ఘటన వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లిలో గురువారం చోటుచేసుకుంది. బాధితులు, స్థానికులు చెప్పిన వివరాలు మేరకు. అక్కుపల్లి గ్రామానికి చెందిన యంపళ్ల అనూషకు అదే గ్రామానికి చెందిన మడ్డు సుధీర్‌తో 2022లో వివాహం జరిగింది. ఇద్దరూ సాప్ట్‌వేర్ ఉద్యోగులు కావడంలో బెంగళూరులో కాపురం పెట్టారు. వీరికి 10 నెలల చిన్నారి ఉంది. అనూష ప్రస్తుతం కన్నవారి ఇంటి వద్దే ఉంటోంది. ఇటీవల భార్యాభర్తల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 21న అత్తవారింటికి పాపతో కలిసి వచ్చిన అనూషను ఇంట్లోకి అనుమతించకుండా అత్తమామలు అడ్డుకున్నారు. అప్పటికి ఇంట్లోనే భర్త సుధీర్ కూడా ముఖం చాటేశాడు. అయితే నీ భర్త ఇంట్లో లేడని, బెంగళూరులో ఉన్నాడంటూ బదులిస్తూ ఇంట్లోకి రానివ్వలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తమకు జరిగిన అన్యాయం కోసం బాధితురాలు డయల్ 100కు కాల్ చేయడంతో స్థానిక పోలీసులు సంప్రదించినా ప్రయోజనం లేకపోయిందని వాపోయింది. దీంతో తప్పని పరిస్థితిలో మూడు రోజులుగా భర్త ఇంటి ముందు న్యాయ దీక్షకు బాధితురాలు పూనుకుంది. విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో గురువారం ఘటన స్థలానికి చేరుకొని బాధితరాలికి మద్దతుగా నిలిచారు. అత్తమామలకు సర్దిచెప్పడంతో తాత్కాలికంగా ఇంట్లోకి అనుమతించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.


