బంగారం ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా
గార: అప్పుతో సహా వడ్డీ చెల్లిస్తానని చెప్పినా తాను తాకట్టు పెట్టిన బంగారం ఇవ్వడం లేదంటూ గార మండలం బందరువానిపేటకు చెందిన మైలపల్లి పద్మశ్రీ అనే వివాహిత గురువారం కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన పొట్నూరు కూర్మారావు ఇంటి వద్ద నిరసన చేపట్టింది. తన కుమారుడితో కలిసి పురుగుమందు డబ్బా పట్టుకొని న్యాయం జరగకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని చెప్పడంతో కలకలం రేగింది. 2022లో స్థానిక ఏపీజీవీబీలో 22 తులాలు బంగారం తాకట్టు ఉందని, డబ్బులిస్తే బంగారం విడిపిస్తానని చెప్పడంతో కూర్మారావు డబ్బులిచ్చారని, ఆ సమయంలో బ్యాంకు నుంచి విడిపించి కూర్మారావు దగ్గర బంగారం తాకట్టు పెట్టానని పద్మశ్రీ చెప్పింది. ఆ బంగారం విడిపించేందుకు రెండు రోజుల క్రితం వెళ్లగా డబ్బులెక్కువ లెక్క చెప్పారని, పెద్దలకు చెప్పినా న్యాయం జరగకపోవడంతో నిరసన చేపట్టాల్సి వచ్చిందని తెలిపింది. ఈ విషయమై ఎస్‌ఐ సీహెచ్.గంగరాజు వద్ద ప్రస్తావించగా తమకు ఫిర్యాదు రాలేదని చెప్పారు.


