15 క్వింటాళ్ల మొక్కజొన్న పిక్కలు చోరీ
కొత్తూరు : కర్లెమ్మ పంచాయతీ బడిగాం గ్రామ సమీపంలో మర్రిపాడు రోడ్డుకు ఆనుకొని ఆరబెట్టేందుకు ఉంచిన సుమారు 15 క్వింటాళ్ల మొక్కజొన్న పిక్కలను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ మేరకు కొత్తూరుకు చెందిన బాధిత రైతు పెద్దకోట ఆనందరావు గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
31న జాతీయ సమైక్యత యాత్ర
ఎచ్చెర్ల : దేశ ఉపప్రధాని, భారత్ ఐక్యతకు ఎనలేని కృషి జరిపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కేంద్ర యువజన క్రీడా వ్యవహరాల మంత్రిత్వ శాఖ, మేరా భారత్ జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్) జిల్లా శాఖలు సంయుక్తంగా ఈ నెల 31న శ్రీకాకుళంలో జాతీయ సమైక్యత యాత్ర నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ కె.ఆర్.రజిని గురువారం తన చాంబర్‌లో ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు విద్యార్థులను, యువతను భాగస్వామ్యం చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అంబేడ్కర్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, మేరా భారత్ జిల్లా సహాయ సంచాలకులు కె.వి.ఉజ్వల్, వర్శిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లు డా.ఎస్.ఉదయభాస్కర్, ఎం.అనురాధ, ఎస్‌ఓ కె.సామ్రాజ్యలక్ష్మి, ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా కో ఆర్డినేటర్ డి.వనజ, అకడమిక్ అఫైర్స్ డీన్ కె.స్వప్నవాహిని పాల్గొన్నారు.


