
శ్రీకాకుళం, సాక్షి: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడిపై మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు దిగారు. ఆయన తమను బెదిరించారని, తమ సోదరుడి మృతదేహాన్ని పోలీసులు అప్పగించకుండా అడ్డుపడుతున్నారని ఢిల్లీశ్వరరావు సాక్షి టీవీతో వాపోయారు.
పోలీసులు ముందు నుంచే మమ్మల్ని బెదిరిస్తున్నారు. నంబాల మృతదేహం(Nambala Dead body) కోసం వెళ్ళిన మమ్మల్ని బలవంతంగా ఛత్తీస్‌గఢ్ నుంచి ఆంధ్ర బోర్డర్‌కు పంపించేశారు. మా సోదరుడు నంబాల రాజశేఖర్‌కు మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) ఫోన్ చేసి బెదిరించారు. ‘నా అనుమతి లేకుండా ఛత్తీస్‌గఢ్ ఎవరు వెళ్ళమన్నారు? వెంటనే వెనక్కి వచ్చేయండి. లేకపోతే మీరే సమస్యల్లో చిక్కుకుంటారు’ అని మా కుటుంబ సభ్యులను అచ్చెన్నాయుడు బెదిరించారు.
.. దీంతో మా వాళ్లు భయపడ్డారు. అచ్చెన్నాయుడు నాకు ముందు నుంచే తెలుసు కానీ ఇలా మా సోదరుడి మృతదేహాం విషయంలో ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదు’’ అని నంబాల సోదరుడు ఢిల్లీశ్వరావు అన్నారు. హైకోర్టు కూడా మృతదేహాన్ని అప్పగించాలని ఆదేశించినా కూడా మంత్రి, పోలీసులు అడ్డుకుంటున్నారు.
.. ఫ్యామిలీ ఫోటో చూపించండి, ఆధార్ కార్డ్ చూపించమంటూ ఛత్తీస్‌గఢ్ పోలీసులు(Chhattisgarh) ఇబ్బంది పెట్టారు. మృతదేహాన్ని అప్పగించండి అని అడిగితే మమ్మల్ని మావోయిస్టు ఫ్యామిలీ గా చూస్తూ ఇవ్వట్లేదు. అలా చూస్తే మమ్మల్ని కూడా కాల్చి చంపేయండి. నా సోదరుడి మృతదేహం చూసేందుకు కుటుంబం మొత్తం ఎదురు చూస్తోంది. దయచేసి మా తమ్ముడి మృతదేహం మాకు అప్పగించండి అని కోరుతున్నారాయన.
ఇదీ చదవండి: నంబాల మృతదేహం అప్పగింతలో జాప్యమెందుకు?