యూపీలో కుప్పకూలిన శీతల గిడ్డంగి
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లో శీతల గిడ్డంగి కుప్పకూలిన ఘటనలో నలుగురు కార్మికులు చనిపోగా, 12 మంది వరకు గాయాలపాలయ్యారు. ప్రయాగ్రాజ్ జిల్లా ఫాఫామౌలో సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శీతల గిడ్డంగి భవనం అకస్మాత్తుగా కుప్పకూలగా శిథిలాలు మీద పడి తీవ్ర గాయాలతో నలుగురు చనిపోయారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులైన 12 మంది కార్మికులు ఎస్ఆర్ఎన్ ఆస్పల్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ అక్కడికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. విపత్తు నిర్వహణ దళం, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని శిథిలాల తొలగింపు చేపట్టాయని తెలిపారు. కాగా, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. కోల్డ్ స్టోరేజీ ప్రమాదంతో అమోనియం గ్యాస్ లీకైందంటూ వార్తలు ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఘటనపై ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.