eamcet-2 leakage
-
ఎంసెట్-2 లీకేజీలో మరో ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్: ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా సీఐడీ శనివారం మరో ఇద్దరు బ్రోకర్లను అరెస్టు చేసింది. హరియాణాకు చెందిన ఇక్బాల్ ఖాన్ అలియాస్ ఇక్బాల్, గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన గుమ్మడి వెంకటేశ్‌లను అరెస్టు చేసినట్లు సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హరియాణాకు చెందిన ఇక్బాల్ బెంగళూరు, ఢిల్లీ కేంద్రాలుగా విద్యాసంస్థల కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంసెట్-2 బ్రోకర్లతో సంబంధాలు పెట్టుకొని 20 మంది విద్యార్థులను కోల్‌కతా కేంద్రంగా ప్రత్యేక శిక్షణ ఇప్పించినట్లు సీఐడీ విచారణలో వెలుగు చూసింది. అదే విధంగా గుంటూరుకు చెందిన వెంకటేశ్ హైదరాబాద్‌లోని కేపీహెచ్బీలో విద్యాసంస్థను నిర్వహిస్తున్నాడు. వెంకటేశ్‌కు విజయవాడకు చెందిన మరోవ్యక్తి సహకరించినట్లు సీఐడీ విచారణలో బయటపడింది. వెంకటేశ్ కూడా ఏడు మంది విద్యార్థులను కోల్‌కతాలోని ప్రత్యేక కేంద్రానికి తరలించి శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. వెంకటేశ్ నుంచి రూ.16.45 లక్షలు రికవరీ చేసినట్లు సీఐడీ పేర్కొంది. -
ఎంసెట్-2 లీకేజీ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
-
ఎంసెట్-2 లీకేజీ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
► కుంభకోణంలో 8కి చేరిన అరెస్టులు ► గుడ్డూను కూడా పట్టుకున్న అధికారులు! హైదరాబాద్: ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కుంభకోణంలో భాగస్వాములైన మరో ఇద్దరు బ్రోకర్లు మెదక్ జిల్లా జోగిపేటకు చెందిన గుడిపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ షకీరాలను సీఐడీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. దీంతో ఈ కుంభకోణంలో అరెస్టైన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. చంద్రశేఖర్‌రెడ్డి, షేక్ షకీరాలు ఆరుగురు విద్యార్థులను కోల్‌కతాకు తీసుకెళ్లి ‘ప్రత్యేక శిక్షణ’ ఇప్పించినట్లు గుర్తించారు. సరిగ్గా పరీక్షకు 48 గంటల ముందు జూలై 7న వారిని విమానంలో కోల్‌కతాకు తీసుకెళ్లి.. హోటల్ గదుల్లో ఒక రోజు శిక్షణ ఇచ్చారు. జూలై 8న రాత్రి తిరిగి విమానంలో హైదరాబాద్‌కు తీసుకురాగా.. వారు జూలై 9న ఎంసెట్-2 పరీక్ష రాశారు. ష్యూరిటీగా విద్యార్థుల సర్టిఫికెట్లు ఈ కుంభకోణంలో ఒప్పందం మేరకు పూర్తి డబ్బులు చెల్లించేంత వరకు పూచీకత్తుగా విద్యార్థులకు చెందిన ఎస్సెస్సీ, ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికెట్లను గుడిపల్లి చంద్రశేఖర్, షేక్ షకీరాలు తమ వద్ద పెట్టుకున్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సంతకాలు చేసిన బ్యాంకు చెక్కులను తీసుకున్నారు. ఆ చెక్కులను బ్రోకర్ల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లీకేజీ కేసులో అరెస్టైన షేక్ రమేశ్‌కు షేక్ షకీరా సన్నిహితులని తేలింది. వీరిద్దరూ కలసి ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లు ఇప్పిస్తామంటూ విద్యార్థుల తల్లిదండ్రులను సంప్రదిస్తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. వారు బ్రోకర్ రాజగోపాల్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏకంగా ప్రశ్నపత్రం లీకేజీ చేస్తామంటూ తల్లిదండ్రులను వలలో వేసుకున్నట్లు తెలిపాయి. ఇక చంద్రశేఖర్‌రెడ్డి కూడా మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తానంటూ రెండుమూడేళ్లుగా దందా నడుపుతున్నట్లు సీఐడీ విచారణలో వెలుగు చూసింది. అతను పలు కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను సంప్రదించి.. ఒప్పందాలు కుదిర్చాడు. సీఐడీ అదుపులో గుడ్డూ! ఎంసెట్ స్కాంలో కీలక వ్యక్తిగా భావిస్తున్న ముంబై వాసి గుడ్డూను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రశ్నపత్రాల లీకేజీలో పుణేకు చెందిన షేక్ నౌషాద్ అలీ, ముంబైకి చెందిన గుడ్డూల కోసం సీఐడీ అధికారులు పదిహేను రోజులుగా గాలిస్తున్న విషయం తెలిసిందే. వారు దుబాయ్‌కి పారిపోయారనే సమాచారంతో ఒక ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లి గాలింపు చేపట్టింది కూడా. మొత్తంగా గుడ్డూ ఆచూకీని సీఐడీ అధికారులు గుర్తించగలిగారు. అతడిని మంగళవారమే అదుపులోకి తీసుకుని.. హైదరాబాద్‌లోని ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం అధికారికంగా అరెస్టు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరో బ్రోకర్ నౌషాద్తో పాటు సునీల్‌సింగ్, ముకుల్‌జైన్, మయాంక్‌శర్మ, ఇక్బాల్‌ల ఆచూకీ కనిపెట్టేందుకు సీఐడీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. -
ప్రభుత్వం టైంపాస్ చేస్తోంది: నాగం
హైదరాబాద్: ఎంసెట్-2లీకేజీకి కారకులంటూ బ్రోకర్లను అరెస్టు చేస్తూ టైంపాస్ చేస్తోందని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వెంటనే అధికారులను, మంత్రులను బాధ్యుల్ని చేస్తూ సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే తమ పార్టీ ఆందోళనకు దిగుతుందని చెప్పారు. లీకేజీకి బాధ్యతవహిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులిద్దరూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
ఎంసెట్-2 రద్దుపై ఆందోళన వద్దు : కడియం
సీఐడీ నివేదిక తర్వాతే నిర్ణయం వరంగల్: ఎంసెట్-2 రద్దు విషయంలో సీఐడీ నివేదిక పరిశీలించాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గురువారం హన్మకొండలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆయనను కలిశారు. ఎంసెట్-2 రద్దు చేసి, ఎంసెట్-3 నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోందని, విద్యార్థులు ఇప్పటికే కష్టపడి చదివి రెండు ఎంసెట్లు రాశారని వివరించారు. మరోసారి ఎంసెట్ నిర్వహిస్తే తమ పిల్లలు రాసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షించాలని, కావాలంటే వారి ప్రవేశాలు రద్దు చేయాలని, తమను ఇందులో బలిచేయొద్దని విద్యార్థులు, తల్లిదండ్రులు కడియం ముందు గోడు వెళ్లబోసుకున్నారు. మరోసారి ఎంసెట్ నిర్వహించవద్దని కోరారు. గతంలో అక్రమాలకు పాల్పడినవారిపై చర్య తీసుకుంటే ఈ పరిస్థితి పునరావృతం అయ్యేది కాదన్నారు. విద్యార్థులకు నష్టం కలగద ని, ఆందోళన చెందవద్దని కడియం వారికి చెప్పారు. -
ఎంసెట్-2 రద్దు చేయొద్దు
సచివాలయం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల నిరసన హైదరాబాద్: ‘మెడిసిన్‌లో సీటు మా కల. అందుకోసం చిన్నప్పటి నుంచి అన్ని ఆనందాలు వదులుకుని చదువుకున్నాం. తెలంగాణ, ఏపీల్లో ఎంసెట్, ఎంసెట్-2 రాశాం. కేంద్ర ప్రభుత్వం ‘నీట్’ అంటే అదీ రాశాం. ఎంసెట్-2లో మెరిట్ ర్యాంకు వచ్చింది. మంచి కాలేజీలో చేరుదామనుకుంటే.. లీకేజీ వ్యవహారం బయటపడింది. ఇప్పుడు ఎంసెట్-2 రద్దు చేసి మళ్లీ పరీక్ష పెడతామంటే మా గతేం కావాలి. ఇప్పటికి 5 పరీక్షలు రాశాం. ఇంకా ఎంట్రన్స్ టెస్ట్‌లు రాసే శక్తి మాకు లేదు..’.. ఎంసెట్-2 ర్యాంకర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సచివాలయం వద్దకు వచ్చారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మలను కలవాలని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సచివాలయం ప్రధాన గేటు ఓముందు ఎన్టీఆర్ గార్డెన్స్‌ను ఆనుకొని ఉన్న ఫుట్‌పాత్‌పై బైఠాయించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు అక్కడి నుంచి కదలబోమని స్పష్టం చేశారు. ఎంసెట్-2 రద్దు చేయొద్దని, దోషులను మాత్రమే శిక్షించాలని డిమాండ్ చేశారు. ర్యాంకర్లకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. వారిని మళ్లీ పరీక్ష రాయనివ్వం: నాయిని ఆందోళన చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కొందరిని సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తన చాంబర్‌కు పిలిపించుకుని మాట్లాడారు. ఎంసెట్-2 రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహిస్తే తమ పిల్లలకు అన్యాయం జరుగుతుందని తల్లిదండ్రులు నాయినికి విన్నవించుకున్నారు. లీకేజీకి కారణమైన వారిని గుర్తించి శిక్షించాలని... 72 మంది కారణంగా వేలాది మంది విద్యార్థులకు అన్యాయం చేయవద్దని కోరారు. దీనిపై స్పందించిన నాయిని.. ‘‘ఎంసెట్ పేపర్ లీకైనట్టు రుజువైంది. మాల్ ప్రాక్టీస్ చట్టం ప్రకారం ఒక్క ప్రశ్న లీకైనా మళ్లీ పరీక్ష నిర్వహించాలి. లీకైన పేపర్‌తో పరీక్ష రాసిన 72 మంది విద్యార్థులను మళ్లీ పరీక్ష రాయనివ్వం. మీరేం ఆందోళన చెందవద్దు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా..’’ అని పేర్కొన్నారు. నిక్కచ్చిగా విచారణ జరపాలి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితులను గుర్తించాలని రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిక్కచ్చిగా, పారదర్శకంగా విచారణ చేపట్టి తెర వెనుక ఉన్న వారి పేర్లను బయట పెట్టాలన్నారు. మళ్లీ ఎంసెట్ పరీక్ష రాసే పరిస్థితి రానివ్వొద్దని సూచించారు. ఎంసెట్ లీకేజీ వ్యవహారంపై సీబీఐతో విచారణ చేపట్టాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
ఎంసెట్-2 లీకేజీ వ్యహారంలో ముగ్గురి అరెస్ట్
-
ఎంసెట్-2 లీకేజీ వ్యహారంలో ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల వ్యవహారంలో ముగ్గురిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ లీకేజీ వ్యవహారంలో మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేసిన సీఐడీ.. హైదరాబాద్‌కు చెందిన కన్సల్టెన్సీ నిర్వాహకుడు విష్ణుధర్, దళారీ తిరుమల్ అనే ఇద్దరు నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మరోక నిందితుడి వివరాలు ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ లీకేజీలో మొత్తం 30 మంది విద్యార్థులకు పేపర్ లీక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 25న కేసు దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ అధికారులు రెండు సెట్ల పేపర్లు లీక్ అయినట్టు నిర్ధారించారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ. 30 నుంచి రూ. 40 లక్షల చొప్పున వసూలు చేసినట్టు సీఐడీ పేర్కొంది. ఢిల్లీలో ప్రింటింగ్ ప్రెస్ నుంచి పేపర్ లీక్ అయినట్టు వెల్లడించింది. ముంబై, బెంగళూరులో విద్యార్థులకు పేపర్ ఇచ్చినట్టు తెలిపింది. రెండు రోజుల ముందు పేపర్‌ను స్టూడెంట్స్‌కు ఇచ్చారని తెలిపింది. పేపర్ కొన్న విద్యార్థులు బెంగళూరు, ముంబైల్లో ప్రాక్టీస్ చేసినట్టు సీఐడీ వెల్లడించింది. రెండు సెట్లలోని మొత్తం 320 ప్రశ్నలపై ప్రాక్టీస్ చేయించారు. ప్రాక్టీస్ ముగియగానే తిరిగి విద్యార్థులను వెనక్కి పంపినట్టు సీఐడీ తెలిపింది. రాజగోపాల్ రెడ్డి విద్యార్థుల చేత ప్రాక్టీస్ చేయించినట్టు పేర్కొంది. ఈ లీకేజీ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని సీఐడీ భావిస్తోంది. తద్వారా లీకేజీ వ్యవహారంలో అనుమానితులను కస్టడీలోకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేయనుంది. ఒకవైపు సీఐడీ నివేదిక కోసం ప్రభుత్వం కూడా వేచిచూస్తోంది. అయితే ఇప్పటివరకు లభించిన ఆధారాల మేరకు ఎంసెట్-1లో వేలకుపైగా ర్యాంకు వచ్చి, ఎంసెట్-2లో మెరుగైన ర్యాంకులు సాధించిన వారు 24 మంది ఉన్నట్లు సీఐడీ పోలీసులు గుర్తించారు. బ్రోకర్‌గా చెలామణీ అవుతున్న వెంకట్రావు సెల్‌ఫోన్ నుంచి వీరిలో కొందరికి కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు. సీఐడీ ప్రాథమిక విచారణను మూడు అంశాలుగా విభజించి దర్యాప్తు చేస్తోంది. పేపర్ తయారీ-ప్రింటింగ్, కోచింగ్ సెంటర్లు-పరీక్షకు హాజరైన విధానం, సెల్‌ఫోన్ కాల్స్-ఎంసెట్ ర్యాంకులుగా విభజించి విచారణ చేస్తున్నారు. కాగా, మరోవైపు డీజీపీ, సీఐడీ చీఫ్‌తో ఎంసెట్ కన్వీనర్ రమణారావు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై వారు చర్చిస్తున్నట్టు సమాచారం. -
లీకేజీ డీల్ రూ.50 కోట్లు
-
వరంగల్‌లో సీఐడీ విచారణ
పరకాల: ఎంసెట్-2 లీకేజీ దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు బుధ వారం వరంగల్ జిల్లా పరకాల, భూపాలపల్లిలో విచారణ జరిపారు. అనుమానిత ర్యాంకర్ల తల్లిదండ్రులను ప్రశ్నించారు. విద్యార్థులు ఎక్కడ చదివారు, పదో తరగతి, ఇంటర్లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంసెట్‌కు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు, ఎక్కడ పరీక్ష రాశారు తదితర అంశాలపై ఆరా తీశారు. ఫోన్ నంబర్లు తీసుకొని వారి మొబైల్స్‌కు వచ్చిన కాల్‌లిస్ట్‌ను పరిశీలించారు. కాగా, ప్రకాశం జిల్లా కనిగిరిలో ఖాశిం అనే యువకుడిని అదుపులోకి తీసుకొని వదిలేశారు. లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితులతో సంబంధం ఉందని అనుమానిస్తున్న రమేశ్(ఖాశిం సమీప బంధువు)ను అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
లీకేజీ డీల్ రూ.50 కోట్లు
► ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకైనట్లు నిర్ధారించిన సీఐడీ హైదరాబాద్: ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంలో దాదాపు రూ.50 కోట్లు చేతులు మారాయి. బ్రోకర్లు ఒక్కో విద్యార్థి నుంచి రూ.75 లక్షల చొప్పున వసూలు చేసి పక్కా పథకం ప్రకారం ఈ తతంగం నడిపినట్లు సీఐడీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. దాదాపు 72 మంది విద్యార్థుల తల్లిదండ్రులతో బ్రోకర్లు లావాదేవీలు నడిపినట్లు విచారణలో తేలింది. అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు, ఫలితాలు వచ్చాక మిగతా డబ్బులు ఇచ్చేటట్లుగా వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్సులు ఇచ్చిన విద్యార్థులను బ్రోకర్లు విడతల వారీగా విమానంలో బెంగళూరు, ముంబైలకు తరలించారు. పరీక్షకు సరిగ్గా 48 గంటల ముందు ప్రశ్నపత్రాన్ని లీక్ చేసి.. వారికి ప్రత్యేక శిక్షణనిచ్చారు. పరీక్ష రోజున నేరుగా వీరందరినీ విమానంలో తీసుకువచ్చి పరీక్ష రాయించి పక్కాగా తమ పథకాన్ని అమలు చేశారు. ఎంసెట్-2 లీకేజీపై ఇప్పటికే కేసు నమోదు చేసిన సీఐడీ.. తీగ లాగే కొద్దీ విస్మయం గొలిపే అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఈ లీకేజీకి సూత్రధారుడైన బ్రోకర్ రాజగోపాల్‌రెడ్డితోపాటు ముఠా సభ్యులు రమేశ్, తిరుమల్, విష్టును పోలీసులు ఇప్పటికే వల వేసి పట్టుకున్నట్టు సమాచారం. మహారాష్ట్రకు చెందిన గుడ్డు, షేక్ నిషాద్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని పట్టుకునేందుకు సీఐడీ బృందాలు ముంబైకి వెళ్లాయి. వీరితో పాటు బ్రోకర్లతో లావాదేవీలు నిర్వహించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులపైనా కేసులు నమోదు చేయాలని సీఐడీ నిర్ణయించింది. జేఎన్టీయూ ఫ్యాకల్టీ, సిబ్బంది పాత్ర లీకేజీ వెనుక జేఎన్టీయూ ఫ్యాకల్టీ, సిబ్బంది ప్రమేయం కూడా ఉందని సీఐడీ గుర్తించింది. దళారుల కాల్‌డేటా ఆధారంగా ఇప్పటికే ఎవరెవరి పాత్ర ఉందన్న అంచనాకు వచ్చింది. పేపర్ తయారీలో కీలక పాత్ర పోషించిన అధ్యాపక బృందం మొదలుకొని జేఎన్టీయూలోని కొంత మంది సిబ్బందితో బ్రోకర్లు సంప్రదింపులు జరిపినట్లు రూఢీ చేసుకుంది. వీరిలో కొంత మంది డబ్బుకు ఆశపడి వారి ఉచ్చులో చిక్కుకున్నట్లు గుర్తించింది. ముగ్గురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు ఫ్యాకల్టీ సభ్యు లు కొందరిని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి ద్వారానే పేపర్ ఎక్కడ ప్రింట్ అవుతుం దనే విషయాన్ని బ్రోకర్ల ముఠా తెలుసుకుంది. ప్రింటింగ్ జరిగే ప్రాంతం, కేంద్రం వివరాలు తెలుసుకొని అక్కణ్నుంచే పేపర్‌ను తస్కరించారు. ఎంత డబ్బుకు అన్ని ప్రశ్నలు ఎంసెట్-2 ప్రశ్నపత్రాన్ని సంపాదిస్తామనే ధీమాతో బ్రోకర్లు... అందుకు అనుగుణంగా విద్యార్థులను ఎంపిక చేసుకున్నారు. కోచింగ్ సెంటర్లలో ఆర్థికంగా బలంగా ఉన్న వారి లిస్టును సంపాదించి వారికి ఫోన్లు చేస్తూ ఎర వేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ముందస్తుగా ‘సీటు వస్తేనే డబ్బు చెల్లించండి. సీటు రాకపోతే అడ్వాన్స్ డబ్బులు వాపస్’ అంటూ ఊరించారు. అందుకు అనుగుణంగా దాదాపు వంద మందికి పైగా సంప్రదించగా 72 మంది ఆసక్తి కనబర్చినట్లు సీఐడీ విచారణలో వెలుగు చూసింది. స్తోమతను బట్టి రూ.40 లక్షల నుంచి రూ.70 లక్షల రేటు ఫిక్స్ చేశారు. రూ.40 లక్షలు చెల్లించే వారికి 130 ప్రశ్నలు, రూ.70 లక్షలు చెల్లించే వారికి 140 ప్రశ్నలు అందించారు. అందుకు అనుగుణంగానే విద్యార్థులు 130 నుంచి 140 మధ్యే మార్కులు సాధించారు. ప్రింటింగ్ ప్రెస్ నుంచే లీక్ గతంలో వివిధ పరీక్షలను లీక్ చేయటంలో ఆరితేరిన రాజగోపాల్‌రెడ్డి ఎంసెట్-2 లీకేజీలోనూ ప్రధాన పాత్ర పోషించాడు. ఇతడు బెంగళూరులో ఉషా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నాడు. అదే కేంద్రంగా ఎంసెట్ లీకేజీకి పథకం పన్నాడు. వైద్య విద్య సీట్లకు సంబంధించింది కావటంతో భారీగా ఉండే డిమాండ్‌ను సొమ్ము చేసుకునే ఎత్తుగడ వేశాడు. రమేశ్, విష్ణు, తిరుమల్ను రంగంలోకి దింపి ప్రింటింగ్ ప్రెస్ నుంచే ప్రశ్నపత్రాన్ని లీక్ చేయించి తతంగమంతా నడిపించాడు. నిందితులుగా విద్యార్థులు, తల్లిదండ్రులు.. ఎంసెట్-2కు లీక్‌కు సంబంధించి ప్రాథమిక విచారణలోనే ఒక అంచనాకు వచ్చిన సీఐడీ... కేసు నమోదు చేయగానే దూకుడు పెంచింది. ఒకేసారి ఆరు బృందాలను రంగంలోకి దించి కేవలం రెండు రోజుల్లోనే కేసును కొలిక్కి తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వ్యవహారం కావటం, భారీగా డబ్బులు చేతులు మారటంతో ఎఫ్ఐఆర్లో కఠిన సెక్షన్లను విధించింది. ఐపీసీలోని సెక్షన్ 406 (నమ్మకద్రోహం), 408 (ప్రభుత్వ ఉద్యోగి నమ్మక ద్రోహం), 420 రెడ్‌విత్ 120బి(కుట్రతో కూడిన మోసం)లతో పాటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ అండ్ అన్ఫెయిర్నెస్) చట్టం కింద కేసులు నమోదు చేశారు. స్కాంను దృష్టిలో పెట్టుకొని ముందుగానే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు నిందితులుగా ఎవరి పేర్లను చేర్చని సీఐడీ.. వరుసగా పలు సెక్షన్ల కింద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బ్రోకర్లతో పాటు వారికి సహకరించిన వారిని చేర్చేందుకు రంగం సిద్ధం చేసింది. వీరికి నోటీసులు కూడా జారీ చేసింది. అన్ని తెలిసీ నేరం చేసినందున, పైగా విద్యార్థులందరూ మేజర్లు కాబట్టి వారిని కూడా నిందితులుగా చేర్చాలని నిర్ణయించింది. విద్యార్థులపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ అండ్ అన్ఫెయిర్నెస్) చట్టంలోని సెక్షన్ 8 కింద కేసులు పెట్టాలని సీఐడీ యోచిస్తోంది.