
ఎంసెట్-2 లీకేజీ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది.
► కుంభకోణంలో 8కి చేరిన అరెస్టులు
► గుడ్డూను కూడా పట్టుకున్న అధికారులు!
హైదరాబాద్: ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కుంభకోణంలో భాగస్వాములైన మరో ఇద్దరు బ్రోకర్లు మెదక్ జిల్లా జోగిపేటకు చెందిన గుడిపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ షకీరాలను సీఐడీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. దీంతో ఈ కుంభకోణంలో అరెస్టైన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. చంద్రశేఖర్‌రెడ్డి, షేక్ షకీరాలు ఆరుగురు విద్యార్థులను కోల్‌కతాకు తీసుకెళ్లి ‘ప్రత్యేక శిక్షణ’ ఇప్పించినట్లు గుర్తించారు. సరిగ్గా పరీక్షకు 48 గంటల ముందు జూలై 7న వారిని విమానంలో కోల్‌కతాకు తీసుకెళ్లి.. హోటల్ గదుల్లో ఒక రోజు శిక్షణ ఇచ్చారు. జూలై 8న రాత్రి తిరిగి విమానంలో హైదరాబాద్‌కు తీసుకురాగా.. వారు జూలై 9న ఎంసెట్-2 పరీక్ష రాశారు.
ష్యూరిటీగా విద్యార్థుల సర్టిఫికెట్లు
ఈ కుంభకోణంలో ఒప్పందం మేరకు పూర్తి డబ్బులు చెల్లించేంత వరకు పూచీకత్తుగా విద్యార్థులకు చెందిన ఎస్సెస్సీ, ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికెట్లను గుడిపల్లి చంద్రశేఖర్, షేక్ షకీరాలు తమ వద్ద పెట్టుకున్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సంతకాలు చేసిన బ్యాంకు చెక్కులను తీసుకున్నారు. ఆ చెక్కులను బ్రోకర్ల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లీకేజీ కేసులో అరెస్టైన షేక్ రమేశ్‌కు షేక్ షకీరా సన్నిహితులని తేలింది. వీరిద్దరూ కలసి ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్లు ఇప్పిస్తామంటూ విద్యార్థుల తల్లిదండ్రులను సంప్రదిస్తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. వారు బ్రోకర్ రాజగోపాల్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏకంగా ప్రశ్నపత్రం లీకేజీ చేస్తామంటూ తల్లిదండ్రులను వలలో వేసుకున్నట్లు తెలిపాయి. ఇక చంద్రశేఖర్‌రెడ్డి కూడా మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తానంటూ రెండుమూడేళ్లుగా దందా నడుపుతున్నట్లు సీఐడీ విచారణలో వెలుగు చూసింది. అతను పలు కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను సంప్రదించి.. ఒప్పందాలు కుదిర్చాడు.
సీఐడీ అదుపులో గుడ్డూ!
ఎంసెట్ స్కాంలో కీలక వ్యక్తిగా భావిస్తున్న ముంబై వాసి గుడ్డూను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రశ్నపత్రాల లీకేజీలో పుణేకు చెందిన షేక్ నౌషాద్ అలీ, ముంబైకి చెందిన గుడ్డూల కోసం సీఐడీ అధికారులు పదిహేను రోజులుగా గాలిస్తున్న విషయం తెలిసిందే. వారు దుబాయ్‌కి పారిపోయారనే సమాచారంతో ఒక ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లి గాలింపు చేపట్టింది కూడా. మొత్తంగా గుడ్డూ ఆచూకీని సీఐడీ అధికారులు గుర్తించగలిగారు. అతడిని మంగళవారమే అదుపులోకి తీసుకుని.. హైదరాబాద్‌లోని ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం అధికారికంగా అరెస్టు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరో బ్రోకర్ నౌషాద్‌తో పాటు సునీల్‌సింగ్, ముకుల్‌జైన్, మయాంక్‌శర్మ, ఇక్బాల్‌ల ఆచూకీ కనిపెట్టేందుకు సీఐడీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.