ఎంసెట్‌-2 లీకేజీ వ్యహారంలో ముగ్గురి అరెస్ట్‌ | Two arrested in Eamcet-2 leakage case | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌-2 లీకేజీ వ్యహారంలో ముగ్గురి అరెస్ట్‌

Jul 28 2016 4:41 PM | Updated on Sep 4 2017 6:46 AM

ఎంసెట్‌-2 ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల వ్యవహారంలో ముగ్గురిని సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు.

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌-2 ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల వ్యవహారంలో ముగ్గురిని సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈ లీకేజీ వ్యవహారంలో మొత్తం ముగ్గురిని అరెస్ట్‌ చేసిన సీఐడీ.. హైదరాబాద్‌కు చెందిన కన్సల్టెన్సీ నిర్వాహకుడు విష్ణుధర్‌, దళారీ తిరుమల్‌ అనే ఇద్దరు నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మరోక నిందితుడి వివరాలు ప్రకటించాల్సి ఉంది.

అయితే ఈ లీకేజీలో మొత్తం 30 మంది విద్యార్థులకు పేపర్‌ లీక్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 25న కేసు దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ అధికారులు రెండు సెట్ల పేపర్లు లీక్‌ అయినట్టు నిర్ధారించారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ. 30 నుంచి రూ. 40 లక్షల చొప్పున వసూలు చేసినట్టు సీఐడీ పేర్కొంది. ఢిల్లీలో ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి పేపర్‌ లీక్‌ అయినట్టు వెల్లడించింది. ముంబై, బెంగళూరులో విద్యార్థులకు పేపర్‌ ఇచ్చినట్టు తెలిపింది. రెండు రోజుల ముందు పేపర్‌ను స్టూడెంట్స్‌కు ఇచ్చారని తెలిపింది. పేపర్‌ కొన్న విద్యార్థులు బెంగళూరు, ముంబైల్లో ప్రాక్టీస్‌ చేసినట్టు సీఐడీ వెల్లడించింది. రెండు సెట్లలోని మొత్తం 320 ప్రశ్నలపై ప్రాక్టీస్‌ చేయించారు. ప్రాక్టీస్‌ ముగియగానే తిరిగి విద్యార్థులను వెనక్కి పంపినట్టు సీఐడీ తెలిపింది. రాజగోపాల్‌ రెడ్డి విద్యార్థుల చేత ప్రాక్టీస్‌ చేయించినట్టు పేర్కొంది. ఈ లీకేజీ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని సీఐడీ భావిస్తోంది. తద్వారా లీకేజీ వ్యవహారంలో అనుమానితులను కస్టడీలోకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేయనుంది. ఒకవైపు సీఐడీ నివేదిక కోసం ప్రభుత్వం కూడా వేచిచూస్తోంది.

అయితే ఇప్పటివరకు లభించిన ఆధారాల మేరకు ఎంసెట్-1లో వేలకుపైగా ర్యాంకు వచ్చి, ఎంసెట్-2లో మెరుగైన ర్యాంకులు సాధించిన వారు 24 మంది ఉన్నట్లు సీఐడీ పోలీసులు గుర్తించారు. బ్రోకర్‌గా చెలామణీ అవుతున్న వెంకట్రావు సెల్‌ఫోన్ నుంచి వీరిలో కొందరికి కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు. సీఐడీ ప్రాథమిక విచారణను మూడు అంశాలుగా విభజించి దర్యాప్తు చేస్తోంది. పేపర్ తయారీ-ప్రింటింగ్, కోచింగ్ సెంటర్లు-పరీక్షకు హాజరైన విధానం, సెల్‌ఫోన్ కాల్స్-ఎంసెట్ ర్యాంకులుగా విభజించి విచారణ చేస్తున్నారు.

కాగా, మరోవైపు డీజీపీ, సీఐడీ చీఫ్తో ఎంసెట్‌ కన్వీనర్‌ రమణారావు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎంసెట్‌-2 లీకేజీ వ్యవహారంపై వారు చర్చిస్తున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement