breaking news
double decker trains
-
పైన ప్రయాణికులు.. కింద సరుకులు
సాక్షి, హైదరాబాద్: విమానాల తరహాలో అప్పర్ డెక్‌లో ప్రయాణికులు, కింది డెక్‌లో సరుకులు తరలించే బెల్లీ ఫ్రైట్ పద్ధతిలో ప్యాసింజర్ కమ్ గూడ్స్ డబుల్ డెక్కర్ రైలును రూపొందించే విషయంపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోబోతోంది. ఈ కాన్సెప్టులో రైలును రూపొందించే విషయంలో కొంతకాలం వేచి చూసిన రైల్వే బోర్డుకు అధికారుల కమిటీ సానుకూలంగా సిఫారసు చేసింది. దీనిపై ఇప్పుడు రైల్వే శాఖ నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం వందేభారత్ గూడ్సు రైలు ట్రయల్స్ ప్రారంభించిన రైల్వే బోర్డు, ఇప్పుడు ప్రయాణికులు–సరుకులను ఒకేసారి తరలించే ప్రత్యేక డబుల్ డెక్కర్ రైలును పట్టాలెక్కించే విషయంపై దృష్టి సారించింది. నాలుగేళ్ల క్రితం ఈ నమూనాకు తుదిరూపం ఇచ్చిన తర్వాత, దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు. తాజాగా దాన్ని వందేభారత్ సిరీస్‌లో కలిపి పట్టాలెక్కించొచ్చని కమిటీ సిఫారసు చేసింది. నమూనా తయారీ ఒకేసారి ప్రయాణికులు– తేలికపాటి సరుకులను తరలించే విధానం విమానయాన రంగంలో సక్సెస్ అయింది. దేశంలో రైళ్ల ద్వారా సరుకుల తరలింపు ఏయేటికాయేడు పెరుగుతూ వస్తోంది. ఈ జూలైలో దేశవ్యాప్తంగా రైల్వే ఏకంగా 141.3 మిలియన్ టన్నుల సరుకులను తరలించింది. గతేడాది జూలైలో ఈ సంఖ్య 129.7 మిలియన్ టన్నులు. సరుకు రవాణా ఏటా పెరుగుతుండటంతో వందేభారత్ తరహాలో వేగంగా నడిచే గూడ్సు రైళ్లను పట్టాలెక్కిస్తోంది. కొద్దిరోజుల క్రితం పశ్చిమ మధ్య రైల్వే పరిధిలోని కోటా–సవాయ్ మాధాపూర్ సెక్షన్లో వందేభారత్ గూడ్సు ప్రొటోటైప్ రైలు ట్రయల్స్ మొదలైన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ఇప్పుడు డబుల్ డెక్కర్ రైలును కూడా పట్టాలెక్కించొచ్చని కమిటీ సూచించింది. ప్రత్యేక రూఫ్ ఈ–కామర్స్ పార్సిళ్లు, మందులు, ఇతర తేలికపాటి సరుకులను కింది డెక్కులో, ప్రయాణికులను పైడెక్కులో తరలించటం దీని కాన్సెప్ట్. వందేభారత్ ఎగ్జిక్యూటివ్ కోచ్ తరహా ఏర్పాటు పైడెక్కులో ఉంటుంది. దాదాపు 46 సీట్లు, ఓ పాంట్రీ, టాయిలెట్లు ఈ కోచ్‌లో ఉంటాయి. గరిష్టంగా 6 టన్నుల వరకు సరుకును తరలించే లోయర్ డెక్ ఉంటుంది. ఈ సరుకుకు సంబంధించిన వాసన, ఇతర ప్రభావాలు పైడెక్కులోకి రాకుండా రూఫ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ కోచ్‌లలో స్మోక్ డిటెక్షన్, వీడియో సర్వైలెన్స్ కెమెరా వంటి ఏర్పాట్లు ఉంటాయి. ఒక్కో కోచ్ తయారీకి రూ. 4.5 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ రైలు కూడా 160 కి.మీ. వేగ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నాలుగేళ్ల క్రితం ఈ తరహా కోచ్‌తో కూడిన ఓ నమూనా కోచ్‌ను పంజాబ్‌లోని కపుర్తలా కోచ్ ఫ్యాక్టరీ రూపొందించింది. కానీ, ఆ తర్వాత దానిపై తుది నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టారు. ఇప్పుడు డబుల్ డెక్కర్‌ను తీసుకురావాలని కమిటీ తాజాగా పేర్కొంది. కానీ, దీనిపై బోర్డు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం కొరియర్ సర్వీసులు రోడ్డు మార్గాలపైనే ఎక్కువగా వినియోగిస్తున్నాయి. వేగంగా సరుకులను తరలించటం, శీతలీకరణ వ్యవస్థ అందుబాటులో ఉండటం. సమయపాలన, భద్రత... అంశాల పరంగా చర్యలు తీసుకుంటే తేలికపాటి సరుకుల తరలింపు ఆర్డర్లను భారీగా పొందొచ్చని, రోడ్డు మార్గాన తరలుతున్న సరుకుల్లో చాలా వరకు ఈ రైళ్ల వైపు మళ్లే వీలుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఫలితంగా, ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇది గొప్ప అవకాశమని, డబుల్ డెక్కర్ రైళ్లలో ప్రయాణం విషయంలో ప్రయాణికులు ఆసక్తిగా ఉంటారని పేర్కొంటున్నారు. ప్రధాని కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాల మేరకు రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుంది. అది సానుకూలంగా ఉంటే, మరో మూడునాలుగు నెలల్లో ప్రొటోటైప్ రైలు ట్రయల్స్ మొదలవుతాయి. లేదంటే, ఈ ఆలోచనకు రెడ్ సిగ్నల్ చూపినట్టవుతుంది. -
తెరపైకి మళ్లీ డబుల్ డెక్కర్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ రైళ్లు సూపర్ సక్సెస్ కావటంతో, ఫెయిల్యూర్‌గా ముద్రపడ్డ డబుల్ డెక్కర్ రైళ్లపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఆక్యుపెన్సీ రేషియో లేక ఒక్కొక్కటిగా మూలపడుతూ వస్తున్న డబుల్ డెక్కర్ రైళ్లను మళ్లీ పట్టాలెక్కించి విజయవంతం చేయాలని భావిస్తోంది. బెర్తులు ప్రవేశపెట్టి.. డబుల్ డెక్కర్ రైళ్లు కేవలం పగటి వేళ మాత్రమే తిరిగేలా రైల్వే ప్రవేశపెట్టింది. దీంతో వాటిల్లో కేవలం చైర్ కార్ మాత్రమే ఉండేది. సాధారణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగంతోనే వాటిని నడిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నడిచే సూపర్ ఫాస్ట్ రైళ్లకు దాదాపు 11 గంటల ప్రయాణ సమయం పడుతోంది. రాత్రి వేళ కావటంతో సూపర్ ఫాస్ట్ రైళ్లలో ప్రయాణికులు పడుకుని ప్రయాణిస్తుండటంతో వారికి పగటి సమయం వృథా కావటం లేదు. కానీ, డబుల్ డెక్కర్ రైళ్లలో పగటి వేళ అన్ని గంటలు ప్రయాణించాల్సి రావటంతో ప్రయాణికులకు ఒక రోజు సమయం వృథా అయ్యేది. డబుల్ డెక్కర్ రైళ్లు ప్రారంభమైన కొత్తలోనే సికింద్రాబాద్–తిరుపతి, సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టారు. ఈ రెండు ప్రాంతాలకు వెళ్లే వారు పగటి సమయం మొత్తం రైళ్లలోనే గడపటంతో ఒక రోజు మొత్తం వృథా అయినట్టుగా భావించేవారు. ఫలితంగా వాటిల్లో ఆక్యుపెన్సీ రేషియో వారం రోజుల్లోనే 14 శాతానికి చేరింది. దీంతో ఆ రెండు సర్వీసులను రైల్వే రద్దు చేసింది. ఇటీవలే వందేభారత్ రైళ్లు పట్టాలెక్కి, అదే పగటి వేళ పరుగుపెడుతున్నా కిక్కిరిసిపోతున్నాయి. వాటి ఆక్యుపెన్సీ రేషియో 110 శాతం నుంచి 120 శాతంగా ఉంటోంది. వీటి వేగం ఎక్కువ కావటంతో, తక్కువ సమయంలోనే గమ్యం చేరుతున్నాయి. కానీ, వందేభారత్ తరహా లో అన్ని మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్ల వేగా న్ని పెంచటం సాధ్యం కాదు. దీంతో వాటిల్లో బెర్తులు ప్రవేశపెట్టి రాత్రి వేళ తిప్పే యోచనలో రైల్వే ఉంది. ప్రయాణికులతోపాటు సరుకులు కూడా.. ఇక పైడెక్‌లో ప్రయాణికులు, దిగువ డెక్‌లో సరుకులను ఏకకాలంలో తరలించే ప్యాసింజర్ కమ్ గూడ్స్ నమూనాలో కూడా డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే భావిస్తోందని సమాచారం. దీనికి సంబంధించి డిజైన్లను రైల్వే అనుబంధం సంస్థ ఆర్డీఎస్ఓ పరిశీలిస్తోందని ఓ అధికారి పేర్కొన్నారు. వెరసి డబుల్ డెక్కర్ రైళ్లకు మళ్లీ డిమాండ్ కల్పించాలని రైల్వే భావిస్తోంది. -
Viral Video: డబుల్ డెక్కర్ సైకిల్ వచ్చేసింది..
-
సంక్రాంతికి రద్దీ దృష్ట్యా 12 డబుల్ డెక్కర్ రైళ్లు
-
డ(బు)ల్ డెక్కర్
ప్రయాణికులు లేక ఖాళీగా రైలు పరుగులు సాక్షి, హైదరాబాద్: రెండునెలల క్రితం అట్టహాసంగా పట్టాలెక్కిన డబుల్ డెక్కర్ రైలు సర్వీసుల విషయంలో రైల్వే శాఖ పునరాలోచనలో పడింది. ఈ సూపర్‌ఫాస్ట్ అధునాతన డబుల్ డెక్కర్ రైలు రైల్వేకు భారీ నష్టాలు తెచ్చిపెడుతోంది. దీంతో దీనిపై సమగ్ర సమీక్ష జరపాలని రైల్వే శాఖ నిర్ణయించడంతో.. ఈ సర్వీసులు ఎంతకాలం కొనసాగుతాయోననే అనుమానాలు మొదలయ్యాయి. హైదరాబాద్ (కాచిగూడ స్టేషన్) నుంచి తిరుపతి, గుంటూరులకు వారానికి రెండు రోజులు చొప్పున ఈ రైలు నడుస్తోంది. సర్వీసులు మొదలై రెండు నెలలు గడుస్తున్నా రెండు రూట్లలో ఆక్యుపెన్సీ రేటు (ప్రయూణికుల శాతం) ఏమాత్రం ఆశాజనకంగా లేదు. జూన్‌లో తిరుపతి సర్వీసు సరాసరి ఆక్యుపెన్సీ 48 శాతంగా నమోదైంది. అదే గుంటూరు సర్వీసు విషయంలో కేవలం 30 శాతంగా నమోదైంది. జూలైకొచ్చేసరికి ఆక్యుపెన్సీ మరింత దిగజారింది. ఓవైపు ఈ మార్గాల్లో నడిచే సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో టికెట్లు దొరకక ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా బస్సుల వైపు చూస్తున్నారు. కానీ డబుల్ డెక్కర్ రైలు సర్వీసులను మాత్రం పట్టించుకోవటం లేదు. భారీ నష్టాలను తీవ్రంగా పరిగణిస్తున్న అధికారులు తొలుత వాటి సమయాలను మార్చాలని, అరుునా తీరుమారకుంటే అవి నడిచే రోజులను మార్చాలని, ఆ తర్వాత కూడా పరిస్థితి మెరుగుపడకుంటే వారానికి ఒకరోజు చొప్పునే నడపాలని భావిస్తున్నట్టు తెలిసింది. అప్పటికీ ఆక్యుపెన్సీ ఆశించిన విధంగా లేకుంటే ప్రత్యామ్నాయ ప్రాంతాలను గుర్తించాలని నిర్ణయించినట్టు తెలిసింది.


