breaking news
Desi Pharma Industry
-
ఫార్మా వృద్ధికి పరిశోధనలు కీలకం
న్యూఢిల్లీ: బయోలాజిక్స్, బయోసిమిలర్స్, స్పెషాలిటీ మెడిసిన్‌పై మరింతగా దృష్టి పెడుతూ అంతర్జాతీయంగా ఫార్మా రంగానికి సారథ్యం వహించేలా భారత్ పటిష్టమైన స్థితిలో ఉందని కేంద్ర రసాయనాలు, ఎరువులు శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఇందుకోసం పరిశోధనలు–అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలను బలోపేతం చేయడం, పెట్టుబడులు పెరగడం మొదలైన అంశాలు కీలకమని ఆయన పేర్కొన్నారు. ఇండియా ఫార్మా 2026 కార్యక్రమానికి పంపిన వీడియో సందేశంలో మంత్రి ఈ విషయాలు చెప్పారు. నాయకత్వ సామర్థ్యాలు, అందుబాటు ధరలో జనరిక్ ఔషధాలతో అనేక సంవత్సరాలుగా ప్రపంచానికి ఫార్మసీగా భారత్ గుర్తింపు పొందిందని మంత్రి వివరించారు. ప్రస్తుతం గ్లోబల్ ఫార్మా పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయని బయోలాజిక్స్, బయోసిమిలర్స్, స్పెషాలిటీ మెడిసిన్‌పై ఫోకస్ పెరుగుతోందన్నారు. దీనికి అనువుగా భారత్ తనను తాను మల్చుకోవడంతో పాటు సారథ్యం కూడా వహించేందుకు స్థితిలో ఉందని నడ్డా వివరించారు. దేశీ ఫార్మా పరిశ్రమను గ్లోబల్ లీడరుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, అయిదేళ్ల వ్యవధి కోసం రూ. 10,000 కోట్లతో బయోఫార్మా శక్తి కార్యక్రమాన్ని కూడా ప్రకటించినట్లు చెప్పారు. బల్క్ డ్రగ్ పార్కుల అభివృద్ధి, బల్క్ డ్రగ్స్ స్కీము, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ)లాంటి కార్యక్రమాలతో దేశీయంగా తయారీ కార్యకలాపాలకు ఊతమిస్తున్నట్లు నడ్డా పేర్కొన్నారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌ని (సీడీఎస్‌సీవో) పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు, 1,500 మంది నిపుణులతో సైంటిఫిక్ సమీక్ష కోసం బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. -
ఫార్మా పరిశ్రమకు 500 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్!
న్యూఢిల్లీ : దేశీ ఫార్మా పరిశ్రమను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ఫండ్ ద్వారా కేంద్రం మౌలిక వసతుల ఏర్పాటు కోసం కంపెనీలకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందించనుంది. ఔషధాల ఆమోదానికి సింగిల్ విండో పద్ధతి, ప్రజలకు ఎక్కువ ఔషధాలను అందుబాటులోకి తీసుకురావడం తదితర ప్రతిపాదనలపై కేంద్రం కసరత్తు చేస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ (డీఓపీ) ఆధ్వర్యంలో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీ గతవారం ఫార్మా పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన ఒక నివేదికను రసాయనాలు-ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్‌కు అందించింది. ఇతర ఆర్థిక సంస్థలతో కలిసి చిన్న, మధ్యతరహా ఫార్మా కంపెనీల వృద్ధికి డీఓపీ నిధులను అందించాలని టాస్క్‌ఫోర్స్ తన నివేదికలో సూచించింది.


