Closed door local trains
-
‘వందేభారత్ స్టైల్’ లోకల్ రైలు వచ్చేసింది..
లోకల్ రైళ్లలో సరికొత్త విప్లవం రాబోతోంది. సెమీ హైస్పీడ్ రైలు 'వందే భారత్' తరహాలో, అత్యాధునిక హంగులతో రూపొందించిన మొట్టమొదటి నాన్-ఏసీ లోకల్ రైలు ముంబై చేరుకుంది. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ, ఆటోమేటిక్ డోర్ వ్యవస్థతో రూపొందించిన ఈ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) సిద్ధం చేసింది. ఈ కొత్త రైలుకు సంబంధించిన విశేషాలు మీకోసం..ఆటోమేటిక్ డోర్ క్లోజ్ ముంబై లోకల్ రైళ్లంటేనే తెరచి ఉండే తలుపులు, ఫుట్‌బోర్డ్ ప్రయాణాలు గుర్తొస్తాయి. ఈ లోకల్ రైళ్లను ముంబై జీవనరేఖగా పేర్కొంటారు. నిత్యం అత్యంత రద్దీగా ఈ రైళ్లు నడుస్తుంటాయి. అయితే, ఇలాంటి ప్రయాణాల కారణంగా ఏటా వందలాది మంది ప్రయాణికులు రైలు నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా 2025లో ముంబ్రా సమీపంలో జరిగిన ఒక విషాద ఘటన తర్వాత, రైల్వే శాఖ ఈ ఆటోమేటిక్ డోర్ క్లోజ్ వ్యవస్థపై సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఈ రైలులో వందేభారత్ రైలు తరహాలో అన్ని తలుపులు మూసుకుంటే తప్ప ఇంజిన్ స్టార్ట్ కాదు. తలుపుల వద్ద వేలాడుతూ ప్రయాణించే ప్రమాదకర సంస్కృతికి దీనితో అడ్డుకట్ట పడనుంది.ఏసీ లేకపోయినా.. గాలికి డోకా లేదు!నాన్-ఏసీ రైలులో తలుపులు మూసివేస్తే ఉక్కపోత పెరుగుతుందనే ఆందోళనపై రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం మూడు రకాల సాంకేతిక మార్పులు చేశారు. హై-కెపాసిటీ బ్లోయర్లు ఏర్పాటు చేశారు. సాధారణ రైళ్ల కంటే రెట్టింపు సామర్థ్యంతో గంటకు 10,000 క్యూబిక్ మీటర్ల తాజా గాలిని ఇవి లోపలికి పంపిస్తాయి.అలాగే కిటికీల వెడల్పును 900 మిమీ నుంచి 1,900 మిమీకి పెంచారు. దీనివల్ల ప్రయాణికులకు మంచి వ్యూతో పాటు వెలుతురు లభిస్తుంది. ఇక తలుపులకు ప్రత్యేకమైన గాలి రంధ్రాల (లౌవర్స్) అమరిక ఉంటుంది. తద్వారా తలుపులు మూసి ఉన్నా గాలి ప్రసరణ నిరంతరం జరుగుతుంది.ప్రయాణికులకు మరిన్ని ఫీచర్లుకేవలం భద్రతే కాకుండా, ప్రయాణ అనుభవాన్ని మార్చేలా మరిన్ని హంగులను ఈ రైలులో జోడించారు. ఒక కోచ్ నుంచి మరో కోచ్‌లోకి లోపలి నుంచే వెళ్లేలా వెస్టిబ్యూల్ సౌకర్యం ఉంది. దీనివల్ల రద్దీ ఒకే చోట ఉండకుండా సమానంగా పంపిణీ అవుతుంది. ప్రయాణికుల కోసం లెగ్‌రూమ్ పెంచి, సీట్లను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. తదుపరి స్టేషన్ వివరాలు, భద్రతా సూచనలను ఎప్పటికప్పుడు తెలిపే డిజిటల్ డిస్ప్లేలు ఏర్పాటు చేశారు.12 కోచ్‌ల ఆటోమేటిక్ డోర్ క్లోజ్‌నాన్ ఏసీ రైలు ప్రస్తుతం కుర్లా కార్ షెడ్‌కు చేరుకుంది. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) దీనిపై కఠినమైన భద్రతా పరీక్షలు నిర్వహించనుంది. ట్రయల్స్ పూర్తయి, సర్టిఫికేషన్ లభించిన వెంటనే ఈ 'వందే భారత్' స్టైల్ లోకల్ రైలు ముంబై వాసులకు అందుబాటులోకి రానుంది. -
ముంబై సమగ్రాభివృద్ధి కోసమే కమిటీ
నాగపూర్: దేశ ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతున్న ముంబై నగరాన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని ఆధ్వర్యంలో నగర అభివృద్ధి కమిటీ ఏర్పాటుకు తాను ప్రతిపాదించానని ఆయన నొక్కి చెప్పారు. విధాన మండలిలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ముంబై అభివృద్ధికి కమిటీ ఏర్పాటు విషయమై ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం సృష్టిస్తున్నాయని అన్నారు. ముంబై నగరం ఎన్నటికీ మహారాష్ట్రలో భాగంగానే ఉంటుందని, దాన్ని ఎవరూ రాష్ట్రం నుంచి వేరుచేయలేరని ఆయన ప్రకటించారు. నగ రం ఇప్పటికే అభివృద్ధి చెందినప్పటికీ, మరింత సమగ్ర అభివృద్ధి సాధించడం ద్వారా ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం సంకల్పించిందన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. నగరంలో చేపట్టే పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి శీఘ్రగతిన ఆమోదాలు పొందాలంటే ప్రధాని స్థాయి వ్యక్తిని నగర అభివృద్ధిలో భాగస్వామ్యులను చేయడం ఉత్తమ మార్గమని తాము తలచినట్లు వివరించారు. కాగా, బృహన్ ముంబై నగర పాలక మండలి (బీఎంసీ) ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు వంటి జిమ్మిక్కులు చేస్తోందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విమర్శించిన సంగతి తెలిసిందే. ముంబై అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని, దీనిలో ప్రధాని పాత్ర అనవసరమని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా, ముంబైలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా నగరవాసుల జీవవ ప్రమాణాలను మెరుగుపరచడం తమ లక్ష్యమన్నారు. ప్రపంచ దేశాలనుంచి నగరానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు తగిన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందన్నారు. పెట్టుబడుదారులకు అవసరమైన అనుమతులను శీఘ్రగతిన అందజేసేందుకు కేంద్రం సాయంకూడా చాలా అవసరమన్నారు. దీని కోసమే తమ ప్రభుత్వం ప్రధాని ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటుకు సూచించిందని చెప్పారు. కాగా, దీనిపై కాంగ్రెస్ నేత మాణిక్‌రావ్ ఠాక్రే స్పందిస్తూ.. నగర సమగ్రఅభివృద్ధి కమిటీ ఏర్పాటుచేస్తే దానికి సాధారణంగా ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తారు.. అయితే ప్రధానిని ఈ కమిటీకి నాయకత్వం వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడం సమంజసమేనా.. అంటూ ప్రశ్నించారు. దీనికి ఫడ్నవిస్ స్పందిస్తూ.. దేశంలో ఏ కమిటీకైనా ప్రధాని నేతృత్వం వహించవచ్చు.. అలాంటప్పుడు ఈ కమిటీ ఆయన నేతృత్వం వహిస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. మెట్రో లైన్లలో లోకల్ రైళ్లను నడిపేందుకు తమ ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. సాధ్యమైనంతమేరకు క్లోజ్డ్ డోర్ లోకల్ రైళ్లను నడిపేందుకు ప్రతిపాదన ఉందన్నారు. కాగా,హార్బర్ లైన్లో క్లోజ్డ్ డోర్ రైళ్లను ప్రయోగత్మకంగా నడపనున్నట్లు వెల్లడించారు. అది విజయవంతమైతే మిగిలిన లైన్లలో కూడా ఈ రైళ్లను నడిపిస్తామని వివరించారు. అలాగే వడాలా- సంత్ గాడ్గే మహరాజ్ చౌక్ మధ్య రెండో విడత మెట్రో పనులు వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు పూర్తిచేస్తామని సీఎం ప్రకటించారు. అయితే సీఎం ప్రకటన లోపభూయిష్టంగా , అసంపూర్ణంగా ఉందని విధాన మండలిలో ఎన్సీపీ నేత అయిన ధనంజయ్ ముండే విమర్శించారు.


