breaking news
Aravind Babu
-
టీడీపీ ఎమ్మెల్యేల గూండాగిరీ
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి ఏలూరు/అనంతపురం టౌన్: వాళ్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు.. పేరుకు ఎమ్మెల్యేలైనా రౌడీలను మించి చెలరేగిపోతున్నారు. అరాచకాలు, అకృత్యాలతో బరితెగిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు, దాడులతో రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తమకు అడ్డుచెప్పే వారే లేరంటూ పేట్రేగిపోతున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రాష్ట్రంలో ఏ జిల్లా చూసినా టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యకాండలే తాండవమాడుతున్నాయి. అర్ధరాత్రి జేసీబీలతో సొంత పార్టీకి చెందిన న్యాయవాది ఇంటిపై దండయాత్రకు దిగిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చట్టాన్నీ, పోలీసు యంత్రాంగాన్నీ ఖాతరు చేయలేదు. తన అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తున్నాడని న్యాయవాది ఇంటిపై దాడికి యత్నించారు. ‘‘వాడో.. నేనో ఉండాలి’ అంటూ బీభత్సం సృష్టించారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కూడా అరాచకాలతో రెచ్చిపోతున్నారు. ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని సొంత పార్టీ నేత సెల్ఫీ వీడియో విడుదల చేయడం ప్రసాద్ అకృత్యాలకు అద్దంపడుతోంది. ఓ ఎన్ఆర్ఐ కష్టార్జితంతో కట్టుకున్న రూ.60 కోట్ల మాల్‌ను చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కబ్జా చేశారు. తననెవరు అడ్డుకునేది అన్నట్టు పేట్రేగిపోతున్నారు. ఇవే కాదు.. జిల్లా ఎస్పీ కార్యాలయాన్నే 10 గంటలు ముట్టడించిన నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్‌బాబు, అర్ధరాత్రి వీడియో కాల్స్‌తో కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్‌ను వేధించిన ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, సొంత పార్టీ మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి కారణమైన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్, అటవీ శాఖాధికారులను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డిల తీరు రాక్షసకాండను తలపిస్తున్నాయి.. ఇవన్నీ రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఎంత దుర్మార్గంగా ఉందో చెప్పడానికి మచ్చుతునకలు.అరాచకానికి కేరాఫ్ అడ్రస్ చింతమనేని అరాచకాలు, అడ్డగోలు తనానికి మారుపేరైన ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోమారు రెచ్చిపోయారు. ఆదివారం అర్ధరాత్రి ఏలూరు నగరంలో రచ్చరచ్చ చేశారు. సొంత పార్టీకి చెందిన ప్రముఖ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు నివాసాన్ని కూలగొట్టడానికి ఏకంగా పొక్లెయిన్లు, వందల మంది అనుచరులతో దండయాత్రగా వెళ్లారు. ఆయన ఇల్లు కూల్చివేస్తానని నానా బీభత్సం చేశారు. అడ్డుకున్న పోలీసులనూ పక్కకు నెట్టేసి దుర్భాషలాడారు. వాడో, నేనో ఉండాలంటూ హల్చల్ చేశారు. ఇంత చేసినా ఎమ్మెల్యేను పోలీసులు రాచ మర్యాదలతో ఇంటికి పంపించారు. బాధితుడైన శ్రీనివాస్, ఆయన కుమారుడిని మాత్రం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చివరికి టీడీపీ అరాచకవాది చింతమనేనికే వత్తాసు పలికింది. బాధితుడైన న్యాయవాది శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. చింతమనేని ఇలా చేయడం కొత్త కాదు. కొద్దిరోజుల క్రితం సాక్షి ఏలూరు కార్యాలయంపై దాడి చేశారు. ఆ తర్వాత కార్యాలయానికి తన అనుచరులతో కలిసి నిప్పు పెట్టించారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఆయన వ్యవసాయ తోటలో అరాచకం సృష్టించారు. 2014–19 మధ్య ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న ముసునూరు మహిళా తహశీల్దార్ వనజాక్షిపై విచక్షణారహితంగా దాడికి దిగారు. అధికారులపై దాడి చేయడం, ప్రజలపై నోరుపారేసుకోవడం, దుర్భాషలాడడం ఆయనకు నిత్యకృత్యం. ఇసుక, మట్టి దోపిడీ, కోడి పందేలతో దెందులూరు నియోజకవర్గాన్ని చింతమనేని ప్రభాకర్ రౌడీరాజ్యంగా మార్చివేశారు.అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నారనే..!బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఎమ్మెల్యే చింతమనేని మా ఇంటి ముందుకు వచ్చి వందలాది మందితో మాపై దాడి చేయడానికి యత్నించి, ఇల్లు కూల్చడానికి తెగబడ్డారు. అందరినీ దుర్భాషలాడారు. పోలీసులు చింతమనేనిని వదిలివేసి, ఏ తప్పూ చేయని నా భర్తను, కుమారుడిని అర్ధరాత్రి పూట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదేమి అన్యాయం? నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తున్నారనే నా భర్తపై కక్షగట్టారు. ఇదేనా చంద్రబాబు సుపరిపాలన? – ఈడ్పుగంటి పద్మజ, న్యాయవాది, చింతమనేని బాధితుడి సతీమణికబ్జాల ప్రత్తిపాటి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కబ్జాలకు, అరాచకాలకూ అంతేలేదు. చిలకలూరిపేటలోని ఎన్ఆర్ఐ రావి మురళీమోహన్‌కు చెందిన రూ.60 కోట్ల విలువైన సాయి కార్తీక్ సిటీ సెంటర్‌ను ప్రత్తిపాటి ఆక్రమించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గత ఏడాది ఆగస్టు 5న తన మాల్‌ను ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఎన్ఆర్ఐ మురళీమోహన్ వెల్లడించారు. రెండు థియేటర్లు, రెండు ఫంక్షన్ హాళ్ళు, వాణిజ్య ప్రాంతాలు ఉన్న ఈ కాంప్లెక్స్‌లో ఎవరినీ ప్రవేశించనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లోనూ బాధితుడు ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదని, బాధితుడు కోర్టుకు వెళ్లారు. ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినా ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదు. చంద్రబాబు, లోకేశ్‌కి ఫిర్యాదు చేసినా కబ్జా చేసిన పుల్లారావుకే వత్తాసు పలుకుతుండడం గమనార్హం.సొంత పార్టీ నేతలనూ వదలని దగ్గుపాటి అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సొంతపార్టీ నేతలనూ వదలడం లేదు. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని టీడీపీ మైనార్టీ నేత మహబూబ్ బాషా సెల్ఫీ వీడియో విడుదల చేయడమే దీనికి నిదర్శనం. తనకు ఏమి జరిగినా ఎమ్మెల్యేదే బాధ్యత అని ఆ వీడియోలో బాధితుడు స్పష్టం చేశారు. మైనార్టీలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని అడగడమే తన తప్పులా ఎమ్మెల్యే వ్యవహరించారని వివరించారు. ‘‘నాకు ఎవరూ ఉచితంగా ఓటు వేయలేదని, నేనెందుకు ఇంటి పట్టాలు ఇవ్వాలి’’ అంటూ దగ్గుపాటి ఫోన్లో బెదిరించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పట్టాలు అడిగితే చంపేస్తారా అని ప్రశ్నించారు. పదేళ్లుగా పార్టీకి పనిచేస్తున్నానని, ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చుపెట్టానని వివరించారు. ఎమ్మెల్యే అరాచకాలపై పార్టీ పెద్దలకు చెప్పినా స్పందన లేదని వివరించారు. అనంతపురం టీడీపీలో మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాలపై మంగళవారం ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఎదుట దీక్ష చేపడుతున్నట్లు మహబుబ్‌బాషా తెలిపారు. ఎమ్మెల్యే దగ్గుపాటిపై గతంలోనూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మద్యం షాపుల వద్దకు నేరుగా తన మనుషులను పంపడం, కమీషన్ల కోసం ఇష్టానుసారం వ్యవహరించడం ఆయనకు అలవాటుగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాను తన నియోజకవర్గంలో విడుదల కాకుండా అడ్డుకునేందుకు థియేటర్ యజమానులను బెదిరించారు.ఎస్పీనే బెదిరించిన ఎమ్మెల్యే అరవిందబాబునరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కొద్దిరోజుల క్రితం పోలీసులపైనే చెలరేగిపోయారు. పల్నాడు ఎస్పీ కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు బైఠాయించి అధికారులకే సవాల్ విసిరారు. తాను సూచించిన వ్యక్తికి లీగల్ అడ్వైజర్ పోస్టు ఇవ్వాలని ఏకంగా ఎస్పీనే బెదిరించారు. ఎస్పీ బయటకు వెళ్లిపోవడంతో ఆయన చాంబర్లోనే తలుపులు వేసుకుని కూర్చోవడంతో పోలీసులు తలుపులు బద్దలుకొట్టి ఎమ్మెల్యేను బయటకు తీసుకు రావాల్సి వచ్చింది. గతంలోనూ అరవిందబాబు తాను చెప్పిన వారికి కాంట్రాక్టు పోస్టులు ఇవ్వాలని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో హంగామా సృష్టించారు.ఎమ్మెల్యే నసీర్ వేధింపులకు మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నం గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వేధింపులు తట్టుకోలేక ఒక టీడీపీ మహిళా కార్యకర్త ఆయన కార్యాలయం ఎదుటే ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. ఇందుకు సంబంధించి ఒక వీడియో బయటకు రావడంతో ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యే వెంటాడి వేధించారు. తన పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. అయినా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. కేజీబీవీ ప్రిన్సిపాల్‌కు కూన రవికుమార్ వేధింపులు ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్ బయటపెట్టడం కొద్ది నెలల క్రితం చర్చనీయాంశమైంది. అర్ధరాత్రి వేళ అడ్మిషన్ల పేరిట మీటింగ్‌కు రమ్మని ఫోన్ కాల్స్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినా ప్రభుత్వం ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.అటవీ శాఖ ఉద్యోగులనే కిడ్నాప్ చేసిన ఎమ్మెల్యే బుడ్డా శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి గత ఏడాది చెక్‌పోస్టు వద్ద తన కారును ఆపారని ఏకంగా అటవీ శాఖ ఉద్యోగులనే కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. తన కారులోనే వారిని తీసుకెళ్లి దాడి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. పలు సందర్భాల్లో నియోజకవర్గంలో ఆయన గొడవలు సృష్టించారు. తనకు తెలియకుండా ఎంపీ రావడాన్ని వ్యతిరేకిస్తూ కార్యకర్తలతో దాడులు చేయించారు. ఇవే కాదు.. అనేక నియోజకవర్గాల్లో అధికార కూటమి ఎమ్మెల్యేలు తాము సర్వాధికారులమనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం, దౌర్జన్యంగా అరెస్టు చేయించడం, దాడులు చేయడం ప్రతిచోటా జరుగుతూనే ఉంది. చంద్రబాబు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారు. -
కప్పం కడితేనే దుకాణాలకు అనుమతి
నరసరావుపేట రూరల్: ‘మేం అడిగినంత ఇస్తేనే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి. మాకు తెలియకుండా ఏర్పాటు చేస్తే ధ్వంసం చేస్తాం’ అంటూ పల్నాడు జిల్లా కోటప్పకొండలోని రైతులను, దుకాణాదారులను నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు అనుచరులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే చదలవాడను బాధిత రైతులు కలిసి గోడును వెళ్లబోసుకోగా.. తన అనుచరులు చెప్పినట్టు చేయాలని ఆయన చెప్పడంతో రైతులు కోటప్పకొండలో ఆందోళనకు దిగారు. టీడీపీ, జనసేన జెండాలతో టెంట్ ఏర్పాటు చేసుకుని న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 15న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండలో నిర్వహించే తిరునాళ్లకు లక్షలాది మంది తరలివస్తారు. యాత్రికుల కోసం కొండ దిగువన జాతర జరిగే ప్రదేశంలో దుకాణాలు, వినోదం కోసం జెయింట్ వీల్ వంటివి తాత్కాలికంగా ఏర్పాటు చేస్తారు. తమ భూముల్లో దుకాణాలు పెట్టుకున్నందుకు వ్యాపారుల నుంచి రైతులు కొంత మొత్తాన్ని అద్దె దూరంలో తీసుకుంటారు. ఈ మొత్తంలోనే కొంత గ్రామ పంచాయతీకి పన్నుగా చెల్లించేవారు. అయితే.. రెండేళ్లుగా తిరునాళ్లలో నిర్వహించే దుకాణాలపై టీడీపీ నాయకుల కన్ను పడింది. ఎమ్మెల్యే అనుచరుడు, తెలుగు యువత నాయకుడు నాగూర్‌మీరా గత ఏడాది దుకాణాదారులు, జెయింట్ వీల్ నిర్వాహకుల నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారు. ఈ ఏడాది కూడా రూ.5 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. మంగళవారం రాత్రి జెయింట్ వీల్ నిర్వాహకులు సామగ్రితో కొండకు చేరుకోగా.. నాగూర్‌మీరా అనుచరులు అడ్డుకోవడంతో రైతులు నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ‘మా భూముల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకుంటే మీకెందుకు డబ్బులివ్వాలి’ అని రైతులు నిలదీశారు. ‘మీకు దిక్కున్నచోట చెప్పుకోండి. మాకు డబ్బులు ఇవ్వాల్సిందే’ అని ఎమ్మెల్యే అనుచరులు హెచ్చరించారు. దీంతో రైతులంతా ఎమ్మెల్యే చదలవాడను కలిసి గోడు వెళ్లబోసుకోగా.. నాగూర్‌మీరా చెప్పినట్టే చేయాలని ఎమ్మెల్యే బదులిచ్చారు. దీంతో చేసేదిలేక రైతులంతా కోటప్పకొండకు చేరుకుని జాతర జరిగే స్థలంలో ఆందోళనకు దిగారు. టీడీపీ, జనసేన జెండాలతో టెంట్ ఏర్పాటు చేసుకుని న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. ‘మేమంతా టీడీపీ, జనసేన అభిమానులమే. టీడీపీ కూటమి విజయం కోసం కృషి చేసిన మాకే ఇలా అన్యాయం చేస్తే ఎలా’ అని ప్రశి్నంచారు. -
టీడీపీ ఎమ్మెల్యే అరవింద బాబుపై గోపి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సెటైర్లు
-
నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట టౌన్ :నరసరావుపేటలో రాజకీయాలను ‘పచ్చ’ దండు వ్యక్తిగత కక్షగా మార్చి, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఓటమి భయంతో టీడీపీ అరాచకం సృష్టిస్తోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు.. చివరకు ఓటు వేసిన వారి ఇళ్లపై విధ్వంసానికి పూనుకుంది. పల్నాడు ప్రాంతంలో ఎన్నికలప్పుడు ప్రధాన పార్టీల మధ్య గొడవలు ఎన్నో ఏళ్లుగా రగులుతూనే ఉంటాయి. ఎన్నికల అనంతరం ఆ పగలు చల్లారి, అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉంటారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకత్వం సరికొత్త ప్రతీకారానికి తెర తీసింది.గత ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకుని మరోసారి పోటీకి దిగిన నరసరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుకు మళ్లీ ఓటమి ఖాయమని పోలింగ్‌కు ముందే అన్ని సర్వేలు తేల్చాయి. దీంతో ఆయన వెన్నులో వణుకు పుట్టింది. ఈ క్రమంలో ప్రత్యర్థిని అడ్డు తొలగించుకుంటే తన గెలుపు ఖాయమని భావించి, నరసరావుపేటలో విధ్వంసానికి ప్రణాళిక రచించారని సమాచారం. ఇందులో భాగంగా పోలింగ్ రోజున నరసరావుపేట వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపైకి సుమారు 200 మంది టీడీపీ రౌడీలు మారణాయుధాలతో పట్టపగలు దాడికి వెళ్లారు. ఆ సమయంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన మామ కంజుల రామకోటిరెడ్డిపై దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనపై అరవింద్‌బాబుతో పాటు మరో 30 మందిపై నరసరావుపేట టూటౌన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కాగా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మట్టుబెట్టాలనే పథకంతోనే ఆయన ఇంటిపైకి దాడికి వచ్చినట్లు తెలిసింది. ఈ దాడికి ఇతర రాష్ట్రాల నుంచి బౌన్సర్లు, కిరాయి రౌడీలను అరవింద్ బాబు పోలింగ్ ముందు రోజు రాత్రికే రప్పించినట్టు సమాచారం.అరవింద బాబు ఇంట్లో పెట్రోల్ బాంబులు, వేట కొడవళ్లు గొడవల నేపథ్యంలో పోలింగ్ అనంతరం టీడీపీ అభ్యర్థి అరవింద బాబును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆ సయమంలో ఆయన ఇంట్లో (ఇల్లు, ఆస్పత్రి ఒకచోటే) సోదాలు నిర్వహించగా.. పెట్రోల్ బాంబులు, ఇనుప రాడ్లు, వేట కొడÐ] ళ్లు, కంకర రాళ్లు, ఇతర మారణాయుధాలు దొరికాయి. పోలింగ్‌కు ముందుగానే వీటిని తీసుకొచ్చి ఉంచినట్లు సమాచారం.ఈ ఎన్నికల్లోనూ ఓటమి ఖాయమని తేలడంతో గోపిరెడ్డిని అడ్డు తొలగించుకోవాలనే మారణాయుధాలు తెప్పించినట్లు తెలిసింది. మారణాయుధాలకు సంబంధించిన వీడియోలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయినా పోలీసులు ఇందుకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు చేయకపోవడం గమనర్హం. పోలీసు పెద్దల అనుమతి రాకపోవడం వల్లే అరవింద్బాబుపై కేసు నమోదు కాలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా నరసరావుపేటలో అల్లర్ల కారణంగా రెండు రోజుల పాటు దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగేలా ఉంది. దీంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాగైతే తామెలా బతకాలని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నేను కొట్టలేదు అంతా అవాస్తవం: నరసరావుపేట డీఎస్పీ విజయ్ భాస్కర్ రావు
-
రాయపాటిపై ఫైర్ అవుతున్న కోడెల
సాక్షి, గుంటూరు : ఎన్నికలు దగ్గరపడుతున్నా...గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. ఇప్పటికే ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు ఉప్పు-నిప్పుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా నరసరావుపేటలో కోడెలకు వ్యతిరేకంగా రాయపాటి వర్గం పావులు కదిపింది. కోడెల శివప్రసాదరావు చిరకాల ప్రత్యర్థి నల్లపాటి రామును టీడీపీలో చేర్చించడమే కాకుండా, ఏకంగా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా వేయించారు రాయపాటి. ఈ విషయాన్ని చివరి నిమిషం వరకూ కోడెలకు తెలియకుండా గోప్యంగా ఉంచారు. ఈ వ్యవహారంపై కోడెల తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాగా నరసరావుపేట నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా అరవింద బాబును కూడా కోడెల శివప్రసాదరావు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా టీడీపీ ద్రోహి అరవింద్ బాబు అంటూ తన అనచరులతో ర్యాలీ కూడా చేయించారు. అయినప్పటికీ తాను నరసరావుపేట ఎంపీగా మరోసారి పోటీ చేయాలంటే డాక్టర్ చదలవాడకు టికెట్ ఇవ్వాల్సిందేనని రాయపాటి చంద్రబాబు వద్ద పట్టుబట్టి మరీ టికెట్ ఇప్పించుకున్నారు. దీంతో జిల్లాలో ఒక బీసీ అభ్యర్థికైనా స్థానం కల్పించాలనే ఉద్దేశంతో డాక్టర్ చదలవాడకు టికెట్ ఇచ్చినట్లుగా కోడెల వర్గీయులు తమకు తామే సర్ది చెప్పుకుంటున్నారు. అయితే డాక్టర్ చదలవాడ అభ్యర్థిత్వ నిర్ణయంపై కోడెల ప్రభావం లేకుండా అధిష్టానం వ్యవహరించింది. ఈ నేపథ్యంలో ‘నల్లపాటి’ విషయంలో రాయపాటి.. కోడెలపై పైచేయి సాధించినట్లు అయింది. -
నరసరావుపేట టీడీపీ అభ్యర్థికి అవమానం
సాక్షి, నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ చదలవాడ అరవిందబాబుకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేతిలో అవమానం ఎదురైంది. కోడెలను కలిసేందుకు అరవిందబాబు ఆయన ఇంటికి వెళ్లగా.. కోడెల పట్టించుకోకుండా బయటకు వెళ్లిపోయారు. వివరాలు.. కోడెల వ్యతిరేక వర్గీయుల సహకారంతో అరవిందబాబు చివరి నిమిషంలో అసెంబ్లీ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు. అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కోడెల వర్గీయులు పట్టణంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ క్రమంలో అరవిందబాబు మంగళవారం బీఫామ్ తీసుకొని ఊరేగింపుగా పట్టణంలోకి ప్రవేశించి తన వైద్యశాల పరిసరాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. (కోడెల వ్యతిరేక వర్గీయులదే పైచేయి) ఈ ప్రచారానికి కోడెల వర్గీయులు దూరంగా ఉన్నారు. దీంతో బుధవారం ఉదయం కోడెలను కలిసి ఆశీస్సులు తీసుకోవాలనే ఉద్దేశంతో అరవిందబాబు కోడెల ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న కోడెల.. అరవిందబాబును చూసి కూడా పలకరించకుండానే కిందకు దిగి వెళ్లిపోయారు. దీంతో అరవిందబాబు కోడెల తనయుడు శివరామ్‌ను కలిసి తనకు సహకరించాల్సిందిగా కోరారు. శివరామ్ తన వర్గానికి చెందిన పార్టీ నాయకులు నాగసరపు సుబ్బరాయగుప్తా తదితరులను పరిచయం చేశారు. అందరూ తనకు సహకరించాలని అరవిందబాబు వారిని కోరారు. కోడెల ఉండవల్లి వెళ్లారని.. ఆయన వచ్చేదాకా వేచి ఉండాలని శివరాం సూచించడంతో అరవిందబాబు వారి ఇంటిలోని పార్టీ కార్యాలయంలోనే ఉండిపోయారు. ఎంతసేపు చూసినా కోడెల రాకపోవటంతో చివరకు ఆయన వెనుతిరిగి వెళ్లిపోయారు. -
కోడెల వ్యతిరేక వర్గీయులదే పైచేయి
నరసరావుపేట: నరసరావుపేట నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ చదలవాడ అరవిందబాబు పేరును ప్రకటించడంతో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు వ్యతిరేక వర్గీయులదే పైచేయి అయింది. ముఖ్యంగా ఎంపీ రాయపాటి సాంబశివరావు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇందులో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. తనను కనీసం నియోజకవర్గంలోకి రానీయకుండా ఏకపక్షంగా వ్యవహరించినందుకు కోడెల, అతని కుమారుడిపై రాయపాటి కక్ష తీర్చుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. తాను నరసరావుపేట ఎంపీగా మరోసారి పోటీ చేయాలంటే డాక్టర్ చదలవాడకు టికెట్ ఇవ్వాల్సిందేనని రాయపాటి చంద్రబాబు వద్ద పట్టుబట్టినట్లు తెలుస్తోంది. వాస్తవానికి మూడు రోజుల క్రితమే డాక్టర్ చదలవాడను రాయపాటి, ప్రత్తిపాటి ఆశీస్సులతో కోడెల వ్యతిరేక వర్గీయులు కొల్లి బ్రహ్మయ్య, పులిమి రామిరెడ్డి, వాసిరెడ్డి రవీంద్ర, చల్లా సుబ్బారావు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లారు. చదలవాడ అభ్యర్థిత్వంపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. నరసరావుపేటకు వచ్చిన చదలవాడ తనను హైకమాండ్ అభ్యర్థిగా ప్రకటించిందని మీడియాకు చెప్పారు. జిల్లాలో ఒక బీసీ అభ్యర్థికైనా స్థానం కల్పించాలనే ఉద్దేశంతో డాక్టర్ చదలవాడకు టికెట్ ఇచ్చినట్లుగా కోడెల వర్గీయులు తమకు తామే సర్ది చెప్పుకుంటున్నారు. అయితే డాక్టర్ చదలవాడ అభ్యర్థిత్వ నిర్ణయంపై కోడెల ప్రభావం లేకుండా అధిష్టానం వ్యవహరించింది. -
అంతర్రాష్ర్ట దొంగల ముఠా అరెస్టు
సామర్లకోట :కొంత కాలంగా జిల్లాలో వివిధ నేరాలకు పాల్పడుతున్న ముఠా సామర్లకోట పోలీసులకు పట్టుబడింది. వీరి వద్ద నుంచి సుమారు రూ.15 లక్ష ల విలువైన 530 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం స్థానిక పోలీసు స్టేషన్లో పెద్దాపురం డీఎస్పీ ఓలేటి అరవింద్‌బాబు ఈ వివరాలు వెల్లడించారు.విశాఖ జిల్లా యలమంచిలి మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన బొడ్డపు బాబూరావు గత 15 ఏళ్ల నుంచి నేరాల బాటలో పయనిస్తున్నాడు. అతడికి ఇంకా చాలా నేరాలతో సంబం ధం ఉంది. విశాఖపట్నం, మహారాష్ట్రలో బాబూరావుపై హత్య కేసులు నమోదయ్యాయి. నేరం చేసే సమయంలో అడ్డొచ్చిన వారిని హతమార్చేందుకు వెనుకాడలేదు. బిక్కవోలు, పెదపూడి, సామర్లకోట, ఏలేశ్వరం ప్రాంతాల్లో ఆరు నేరాలు చేశాడు. ఇతడికి సామర్లకోట మండలం వేట్లపాలేనికి చెందిన మల్లిపూడి శ్రీనివాసరావు, కుంపట్ల విష్ణుచక్రం, విశాఖ జిల్లా సబ్బవరం మండలం పైడివాడకు చెందిన శెట్టి అప్పలరాజు సహకరించారు. వీరు బంగారు ఆభరణాల దొంగతనమే ప్రధాన వృత్తిగా ఎంచుకున్నారు. బంగారు షాపుల షట్టర్లను తొలగించేందుకు గ్యాస్ కట్టర్‌ను కూడా సమకూర్చుకున్నారు. ఏటీఎంల్లో చోరీ చేసే సమయంలో కెమెరాలో పడకుండా ఉండేందుకు నల్లటి ముసుగు, వేలిముద్రలు లభించకుండా గ్లౌజులు, మంకీ టోపీ ఏర్పాటు చేసుకున్నారు. బిక్కవోలు, పెదపూడిల్లోని బంగారు షాపుల్లో చోరీలకు పాల్పడిన వీరు.. బిక్కవోలులో ఉన్న పురాతన సుబ్రహ్మణేశ్వరస్వామి ఆలయంలో 169 గ్రాముల అమ్మవారి బంగారు మంగళసూత్రాలు, వడ్డాణం, కనుబొమ్మలు, కాసులపేరు, నక్లెస్‌ను దొంగిలించారు. బిక్కవోలు పోలీసు స్టేషన్ పరిధిలో 220 గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. పెదపూడి పోలీసు స్టేషన్ పరిధిలో 86.350 గ్రాముల బంగారు ఆభరణాలను తస్కరించారు. సామర్లకోట పోలీసుస్టేషన్ పరిధిలో 54.210 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగిలించారు. ఏలేశ్వరం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మోటార్ బైక్‌ను చోరీ చేశారు. ఈ చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుంది. నిందితులు సామర్లకోట సుగర్ ఫ్యాక్టరీ సమీపంలో అనుమానాస్పందంగా తచ్చాడుతుండగా, వారిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో తమ నేరాలను అంగీకరించారు. ఈ కేసులను ఛేదించిన క్రైం సీఐ సీహెచ్ సురేష్, క్రైం ఎస్సై వల్లీ, ఎస్సై ఎండీఎంఆర్ ఆలీఖాన్, ఇతర సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. వీరికి రివార్డులు ఇవ్వాలని ఎస్పీకి సిఫారసు చేస్తామన్నారు.


