
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్‌ల నటన.. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి టేకింగ్, ఎం.ఎం.కీరవాణి సంగీతం, సెంథిల్ కెమెరా వర్క్.. సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

ఇది చరిత్ర సృష్టించి నేటికి పదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా మొదటి భాగం బాహుబలి ది ఎపిక్‌లో ఛాన్స్ మిస్ చేసుకున్న తారలను పరిశీలిస్తే..ఈ పాత్రలు చివరికి ఎవరి చేతుల్లోకి వెళ్లాయో చూస్తే.. సినిమా ఎంత గొప్పగా నిలిచిందో అర్థమవుతుంది.

శివగామి :బాహుబలిలో పవర్‌ఫుల్ పాత్ర. మొదట శ్రీదేవిని సంప్రదించారు. కానీ ఆమె నో చెప్పడంతో రమ్యకృష్ణ ఈ పాత్రలో నటించారు. కాదు.. జీవించేశారు.

కట్టప్ప : మాహిష్మతి రాజ్యానికి విశ్వాసానికి మారుపేరుగా.. వంశపారంపర్యంగా రాజులకు సేవ చేసే యోధుడిగా కట్టప్ప పాత్ర గుర్తుండిపోతుంది. ఈ రోల్ కోసం మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్‌తో పాటు సంజయ్ దత్ పేర్లు పరిశీలించారు. అయితే ఐదేళ్ల కాల్షీట్లు ఇవ్వడం కష్టమని మోహన్‌లాల్ చెప్పగా.. సంజయ్ దత్ జైల్లో ఉండటంతో అవకాశం కోల్పోయారు. చివరికి సత్యరాజ్ ఈ పాత్రలో నటించి.. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనిపించారు.

భల్లాలదేవ : మొదట వివేక్ ఒబెరాయ్ పేరు పరిశీలించారు. ఆయన నో చెప్పారు. ఆ తర్వాత జాన్ అబ్రహం పేరూ తెర మీదకు వచ్చింది. చివరకు.. రానా దగ్గుబాటి దగ్గరకు రావడంతో.. ఆ పాత్రలో ఆయన ఒదిగిపోవాల్సి వచ్చింది.

అవంతిక : తొలుత రాశీ ఖన్నా పేరును పరిశీలించారు. అనిల్ కపూర్ కూతురు, బాలీవుడ్ నటి సోనమ్ కపూర్‌ను తొలుత సంప్రదించారు. ఆమె కాల్షీట్లు ఇవ్వలేకపోవడంతో తమన్నా ఈ పాత్రలో నటించారు.

దేవసేన : దేవసేన రోల్‌కు మొదట నయనతారను అనుకున్నారట. కానీ ఆమె నో చెప్పడంతో అనుష్క శెట్టిని ఆ అవకాశం వరించింది.

అస్లాం ఖాన్ : ఓ ముస్లిం రాజ్యానికి సైనిక నాయకుడిగా, కట్టప్పతో స్నేహబంధం ఉన్న కాసేపే కనిపించే గెస్ట్ రోల్ ఇది. ఈ పాత్రలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ మెరిశారు. అయితే తొలుత ఆ పాత్ర కోసం కోలీవుడ్ నటుడు సూర్యను సంప్రదించారట. ఆయన నో చెప్పడంతో ఇది సుదీప్‌కు వెళ్లింది. బాహుబలిలో నటించే అవకాశం తాను పొగొట్టుకున్నానని తరచూ సూర్య చెబుతుంటారు. అది ఈ రోల్ అనేది ఓ టాక్.

అమరేంద్ర-మహేంద్ర బాహుబలి : బాహుబలిగా ప్రభాస్‌ను తప్ప మరొకరిని ఊహించుకోవడం కష్టమే. అయితే బాలీవుడ్ వెర్షన్‌కు తొలుత హృతిక్ రోషన్ పేరును పరిశీలించారట. అయితే అప్పటికే జోధా అక్బర్ లాంటి చిత్రంలో హృతిక్ నటించేసి ఉండడంతో ఆ ఆలోచన నుంచి విరమించుకున్నారట. అలా ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌ను చేసేసింది బాహుబలి చిత్రం.