
విజయవాడ బుక్ ఫెస్టివల్ సోసైటీ ఆధ్వర్యంలో నగరంలో ప్రతి ఏటా నిర్వహించే విజయవాడ పుస్తక మహోత్సవం కొలువుదీరింది. విజయవాడ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణ వేదికగా గురువారం ప్రారంభమైన పుస్తక మహోత్సవం జనవరి ఏడో తేదీ వరకూ కొనసాగనుంది.

కేవలం రాష్ట్రానికి చెందిన ప్రచురణ కర్తలే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రచురణ సంస్థలు, ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, బహుళ జాతి సంస్థలు సైతం ఈ పుస్తక మహోత్సవంలో తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి.

సాహిత్య అకాడమీ, నేషనల్ బుక్ ట్రస్ట్ తదితర ప్రభుత్వ విభాగాలకు చెందిన స్టాల్స్ పాఠకులను ఆకట్టుకుంటున్నాయి.

దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత పెద్దదిగా పేరుగాంచిన విజయవాడ బుక్ ఫెస్టివల్ సౌసైటీ 33 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 34వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది.

1989లో నగరానికి చెందిన ప్రచురణ కర్తలు నేషనల్ బుక్ ట్రస్ట్ సహకారంతో తొలిసారిగా 89 స్టాల్స్‌తో ప్రారంభించిన పుస్తక మహోత్సవం 370 దుకాణాలను సైతం నిర్వహించింది

చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ, సామాన్యుల నుంచి కవులు, రచయితల వరకూ అందరికీ ఆహ్వానం పలుకుతోంది.





















