గర్భిణులకు వరం | Pregnant, lactating women to get Rs 5000 each under PMMVY | Sakshi
Sakshi News home page

గర్భిణులకు వరం

Feb 5 2018 12:56 PM | Updated on Jun 2 2018 8:29 PM

Pregnant, lactating women to get Rs 5000 each under PMMVY - Sakshi

పీఎంఎంవీవై

వైఎస్‌ఆర్‌ జిల్లా , బద్వేలు: మాతాశిశు మరణాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మాత వందన యోజన (పీఎంఎంవీవై) గర్భిణులకు వరంగా మారింది. దీన్ని అందిపుచ్చుకోవాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సిందే. మొదటిసారి గర్భం దాల్చిన మహిళలు ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో నమోదైన వారికి మూడు విడతలుగా అర్థిక సాయం అందజేస్తారు. పీఎంఎంవీవై ద్వారా లబ్ధి పొందిన వారు ఆస్పత్రులలో ప్రసవించినా.. ప్రభుత్వం ఇచ్చే జననీ సురక్ష యోజన ద్వారా రూ.వెయ్యి కూడా పొందవచ్చు. 2017 జనవరి 1 తర్వాత గర్భిణిగా నమోదు చేయించుకున్న వారు తప్పనిసరిగా గర్భిణి పరీక్షలు (కనీసం ఒక పర్యాయం) చేయించుకోవాలి. పుట్టిన బిడ్డ జనన ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ఆ బిడ్డకు మొదటి విడత పోలియో చుక్కలు, పెంటా వాలెంట్‌ వ్యాక్సిన్, రోటా వైరస్‌ వ్యాక్సిన్, ఐపీవీ వ్యాక్సిన్‌ వేయించి ఉండాలి. నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకుంటే మూడు విడతలుగా లబ్ధిదారుల ఖాతాలోకి నగదు జమ అవుతుంది.

దరఖాస్తు చేయడం ఇలా...
దరఖాస్తుతోపాటు భార్యభర్తల ఆధార్‌కార్డు జిరాక్స్, దరఖాస్తుదారు బ్యాంకు అకౌంట్‌ జిరాక్స్‌ కాపీలు జత చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేసే ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు. ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు, ఆయాలు ఈ పథకంలో నమోదు చేయించుకుని లబ్ధి పొందవచ్చు. 2017 జనవరి 1, ఆ తర్వాత నమోదు చేసుకున్న గర్భిణులలో కొందరు ప్రస్తుతం కాన్పు అయి ఉంటారు. నమోదు చేయించుకుని ప్రస్తుతం తల్లిగా ఉన్న వారు కూడా ఈ పథకానికి అర్హులే. ప్రతి గర్భిణి తమ గ్రామ ఏఎన్‌ఎంతో ఆర్‌సీహెచ్‌ పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి. 12 అంకెల ఆర్‌సీహెచ్‌ గుర్తింపు సంఖ్య.. వారి ఎంసీపీ కార్డు మీద తప్పనిసరిగా రాయించుకోవాలి. గర్భిణి ఆధార్‌కార్డుతో ఉన్న పేరుతో బ్యాంకు అకౌంట్‌ ఉండాలి. గర్భిణి లేదా కుటుంబ సభ్యులలో ఫోన్‌ నంబరు దరఖాస్తులో నమోదు చేయాలి. గర్భిణి నమోదు సమయంలో మొదటిగా పారం–1 ఏతో పాటు, సంబంధిత డాక్యుమెంట్స్‌ నకలు కాపీలు ఏఎన్‌ఎంకు ఇచ్చి వారి నుంచి రశీదు పొందాలి. మంజూరు అధికారులు గర్భిణుల దరఖాస్తులు పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.

బ్యాంక్‌ అకౌంట్‌లో జమ
డాక్యుమెంట్స్‌ సక్రమంగా ఉన్న దరఖాస్తుదారులకు 30 రోజులలో మొదట విడతగా 30 రోజులలో వెయ్యి నగదు వారి అకౌంట్‌లో జమ అవుతుంది. తరువాత ఆరు నెలలకు ఫారం–బీతో సంబంధిత కాపీల నకలుతో దరఖాస్తు చేసుకుంటే మళ్లీ 30 రోజులలో వారి అకౌంట్‌లో రెండో విడతగా రూ.రెండు వేలు జమ చేస్తారు. ప్రసవం తర్వాత ఫారం–1సీతో దరఖాస్తు చేయాలి. 30 రోజులలో మూడో విడతగా మరో రూ.రెండు వేలు జమ అవుతాయి. అనివార్య కారణాలతో అబార్షన్‌ అయితే రెండోసారి గర్భం దాల్చిన తర్వాత.. రెండో ఇన్‌స్టాల్‌మెంట్‌ నుంచి సంబంధిత పరీక్షలు చేయించుకుని దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందవచ్చు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement