
ఏలూరు (మెట్రో): పండగ రోజుల్లోనూ చేతుల్లో పైసలు లేవు. బంధుమిత్రులతో కళకళలాడాల్సిన తెలుగు లోగిళ్లలో.. సొమ్ములు లేని వెలితి కనిపిస్తోంది. నగదు కోసం జిల్లావాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. పండగ వేళ.. ఇదేం బాధ అనుకుంటూ ఏటీఎం కార్డులు పట్టుకుని కాళ్లకు పని చెబుతున్నారు. కనిపించిన ప్రతి ఏటీఎంకు వెళ్లి నగదు కోసం యత్నిస్తున్నారు. అయినా ఫలితం ఉండడం లేదు.
నో క్యాష్ బోర్డులే
ఏ బ్యాంకు ఏటీఎం అయినా ప్రస్తుతం నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం రిజర్వుబ్యాంకు నుంచి నగదు రాకపోవడమేనని తెలుస్తోంది. పండగ నేపథ్యంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా నగదు కావాల్సి ఉంటుందని రిజర్వు బ్యాంకుకు ఇక్కడి బ్యాంకులు ముందే నివేదించినా అక్కడి నుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో బ్యాంకర్లు తామేమీ చేయలేమంటూ చేతులెత్తేశారు. ఇప్పటికే ప్రజల వద్ద వినియోగానికి మించి నగదు నిల్వలు ఉన్నాయని రిజర్వు బ్యాంకు నోట్లను పంపడం నిలిపేసింది.
నగదు డిపాజిట్లు అరకొరే..
ఇదిలా ఉంటే వారం రోజులుగా జిల్లావ్యాప్తంగా నగదు డిపాజిట్లు అరొకరగానే జరిగాయి. నగదు ఉపసంహరణలే ఎక్కువగా జరిగాయి. ఫలితంగా నగదు లేకుండా పోయింది.
జిల్లా వ్యాప్తంగా ఇలా ..
జిల్లా వ్యాప్తంగా 39 బ్యాంకులు, 615 బ్రాంచిలు ఉన్నాయి. 671 ఎటీఎంలు ఉన్నాయి. గత గురు, శుక్రవారాల్లో జిల్లా వ్యాప్తంగా రూ.200 కోట్ల మేర నగదు ఉపసంహరణలు జరిగాయని సమాచారం. దీంతో బ్యాంకుల్లో నగదు నిల్వలు నిండుకున్నాయి.
మరో నాలుగు రోజులు ఇంతే..
మరో నాలుగు రోజులు పండగ సెలవులు కావడంతో బ్యాంకులు పనిచేయవు. బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేసే అవకాశమే లేదు. ఇప్పటికే జిల్లాలో కోడిపందేలు, ఇతరత్రా పనుల కోసం భారీస్థాయిలో నగదు నిల్వలు అట్టేపెట్టుకున్నారు. దీంతో ఈ నాలుగు రోజులూ సామాన్యులకు సొమ్ములు లభించని దుస్థితి నెలకొంది. ఫలితంగా చేతిలో పైసల్లేకుండా పండగ ఎలా చేసుకోవాలో తెలీక సామాన్యులు సతమతమవుతున్నారు.
మూడురోజుల్లో వెసులుబాటు
మరో మూడురోజుల్లో సమస్య పరిష్కారమయ్యే ఆస్కారం ఉంది. ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం కంటే నగదు తీసుకునేందుకే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో నగదు నిల్వలు లేవు. రిజర్వు బ్యాంకుకు విషయాన్ని చెప్పినా అక్కడి నుంచి స్పందన లేదు. ప్రజల వద్ద నగదు ఎక్కువగానే ఉందని చెబుతున్నారు. రైతులకు ధాన్యం సొమ్ములు జమకావడం కూడా నగదు కొరతకు ఒక కారణమే. మరో మూడు రోజుల్లో కాస్త వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. – పి.సూర్యారావు, లీడ్‌బ్యాంకు మేనేజర్